ఫైనల్లో గుజరాత్‌

ABN , First Publish Date - 2022-05-25T07:30:31+05:30 IST

ఐపీఎల్‌ ఆద్యంతం నిలకడైన ఆటతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌.. నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఫైనల్లో గుజరాత్‌

గెలిపించిన మిల్లర్‌, పాండ్యా 

7 వికెట్లతో రాజస్థాన్‌ ఓటమి

బట్లర్‌ శ్రమ వృథా

హార్దిక్‌ కూల్‌ ఇన్నింగ్స్‌కు.. మిల్లర్‌ ధనాధన్‌ ఆట తోడు కావడంతో.. అరంగేట్రం సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆరంభంలోనే తడబడినా.. హార్దిక్‌ ముందుండి నడిపించాడు. బట్లర్‌ దుమ్మురేపడంతో.. రాజస్థాన్‌ భారీ స్కోరు చేసినా.. బౌలర్ల వైఫల్యంతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఫైనల్లో చోటు కోసం క్వాలిఫయర్‌-2లో తలపడనుంది. 


కోల్‌కతా: ఐపీఎల్‌ ఆద్యంతం నిలకడైన ఆటతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌.. నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మిల్లర్‌ (38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (27 బంతుల్లో 5 ఫోర్లతో 40 నాటౌట్‌) ధాటిగా ఆడడంతో.. మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 89), సంజూ శాంసన్‌ (26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47) శ్రమ వృథా అయింది. షమి, దయాళ్‌, పాండ్యా, సాయి కిషోర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం ఛేదనలో గుజరాత్‌ 19.3 ఓవర్లలో 191/3 స్కోరు చేసి నెగ్గింది. పాండ్యా, మిల్లర్‌ 8వ వికెట్‌కు అజేయంగా 61 బంతుల్లో 101 పరుగులు జోడించి గెలిపించారు. శుభ్‌మన్‌ గిల్‌ (35), వేడ్‌ (35) రాణించారు. బౌల్ట్‌, మెకాయ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. రాజస్థాన్‌ ఫైనల్‌ ఆశలు మిగిలే ఉన్నాయి. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో రాయల్స్‌ క్వాలిఫయర్‌-2లో ఆడాల్సి ఉంటుంది. ఇందులో నెగ్గినే తుది పోరుకు చేరుకొనే అవకాశం ఉంది. మిల్లర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. 


కూల్‌గా హార్దిక్‌..:

హార్దిక్‌ ముందుండి నడిపించగా.. మిల్లర్‌ దూకుడైన ఆటతో గుజరాత్‌ను సునాయాసంగా గెలిపించారు. ఛేదనలో గుజరాత్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఇన్‌ఫామ్‌ ఓపెనర్‌ సాహాను బౌల్ట్‌ డకౌట్‌ చేశాడు. కానీ, మరో ఓపెనర్‌ గిల్‌, మాథ్యూ వేడ్‌  ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పవర్‌ప్లే ముగిసే సరికి టైటాన్స్‌ 64/1తో పటిష్ఠస్థితిలో నిలిచింది. అయితే, రెండో వికెట్‌కు 43 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యంతో ధాటిగా ఆడుతున్న సమయంలో.. వేడ్‌తో సమన్వయ లోపం కారణంగా గిల్‌ రనౌట్‌ అయ్యాడు. స్వల్ప తేడాతో వేడ్‌ను మెకాయ్‌ అవుట్‌ చేయడంతో గుజరాత్‌ తడబడినట్టుగా కనిపించింది. ఈ దశలో జట్టు బాధ్యతలు భుజాన వేసుకున్న పాండ్యా.. మిల్లర్‌తో కలసి స్కోరు బోర్డును నడిపించాడు. చివరి 30 బంతుల్లో 50 పరుగులు కావాల్సి ఉండగా.. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ గెలుపు దిశగా నడిపించారు. మిల్లర్‌ 4,6 బాదడంతో.. లక్ష్యం 12 బంతుల్లో 23 పరుగులకు దిగివచ్చింది. అయితే, 19వ ఓవర్‌లో మెకాయ్‌ 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసక్తి రేపాడు. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సి ఉండగా.. మిల్లర్‌ 3 సిక్స్‌లతో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. 


అదరగొట్టిన బట్లర్‌, శాంసన్‌..:

తొలుత శాంసన్‌.. డెత్‌లో బట్లర్‌ దుమ్మురేపడంతో.. రాజస్థాన్‌ సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్‌..  స్వల్ప స్కోరుకే ఓపెనర్‌ జైస్వాల్‌ (3) వికెట్‌ కోల్పోయింది. కానీ, ధాటిగా ఆడిన శాంసన్‌.. మరో ఓపెనర్‌ బట్లర్‌తో కలసి రెండో వికెట్‌కు 47 బంతుల్లో 68 పరుగులతో ఆదుకొన్నాడు. 10వ ఓవర్‌లో శాంసన్‌ను క్యాచ్‌ అవుట్‌ చేసిన కిషోర్‌.. జట్టుకు మంచి బ్రేక్‌ ఇచ్చాడు. 14వ ఓవర్‌లో సిక్స్‌, రెండు ఫోర్లతో టీమ్‌ స్కోరు సెంచరీ దాటించిన పడిక్కళ్‌ (28)ను పాండ్యా బౌల్డ్‌ చేశాడు. దయాళ్‌ వేసిన 17వ ఓవర్‌లో నాలుగు బౌండ్రీలు బాదిన బట్లర్‌ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. ఆ తర్వాతి ఓవర్‌లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. హెట్‌మయెర్‌ను షమి అవుట్‌ చేసినా.. బట్లర్‌ ఫోర్‌, రెండు సిక్స్‌లతో టీమ్‌ స్కోరును 180 మార్క్‌ దాటించాడు. బట్లర్‌ రనౌటైనా.. అతడి దెబ్బకు గుజరాత్‌ చివరి 5 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకుంది. 


స్కోరుబోర్డు

రాజస్థాన్‌:

యశస్వీ (సి) సాహా (బి) దయాళ్‌ 3, బట్లర్‌ (రనౌట్‌) 89, శామ్సన్‌ (సి) జోసెఫ్‌ (బి) కిషోర్‌ 47, పడిక్కళ్‌ (బి) పాండ్యా 28, హెట్‌మయెర్‌ (సి) తెవాటియా (బి) షమి 4, పరాగ్‌ (రనౌట్‌) 4, అశ్విన్‌ (నాటౌట్‌) 2, బౌల్ట్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 188/6; వికెట్ల పతనం: 1-11, 2-79, 3-116, 4-161, 5-185, 6-186; బౌలింగ్‌: షమి 4-0-43-1, యష్‌ దయాళ్‌ 4-0-46-1, జోసెఫ్‌ 2-0-27-0, రషీద్‌ 4-0-15-0, సాయి కిషోర్‌ 4-0-43-1, హార్దిక్‌ పాండ్యా 2-0-14-1.


గుజరాత్‌:

సాహా (సి) సంజూ (బి) బౌల్ట్‌ 0, గిల్‌ (రనౌట్‌) 35, వేడ్‌ (సి) బట్లర్‌ (బి) మెకాయ్‌ 35, హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 40, మిల్లర్‌ (నాటౌట్‌) 68; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 19.3 ఓవర్లలో 191/3;  వికెట్ల పతనం: 1-0, 2-72, 3-85; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-38-1, ప్రసిద్ధ్‌ కృష్ణ 3.3-0-40-0, అశ్విన్‌ 4-0-40-0, చాహల్‌ 4-0-32-0, మెకాయ్‌ 4-0-40-1.

Updated Date - 2022-05-25T07:30:31+05:30 IST