ఒకరి బదులు మరొకరు డిశ్చార్జ్... కరోనా పాజిటివ్ కేసు కలకలం..

ABN , First Publish Date - 2020-05-24T00:22:26+05:30 IST

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అధికారులు పొరపాటున కారోనా నెగిటివ్ ఉన్న వ్యక్తికి బదులు పాజిటివ్ వ్యక్తిని..

ఒకరి బదులు మరొకరు డిశ్చార్జ్... కరోనా పాజిటివ్ కేసు కలకలం..

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అధికారులు పొరపాటున కారోనా నెగిటివ్ ఉన్న వ్యక్తికి బదులు పాజిటివ్ వ్యక్తిని డిశ్చార్జ్ చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఇద్దరికీ ఒకే పేరు ఉండడం వల్ల పొరపాటున ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. తీరా పాజిటివ్ ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చి ఆస్పత్రిలో చేర్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆస్పత్రి (ఎస్‌వీపీ)లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మానవ తప్పిదం వల్లే ఈ పొరపాటు చోటుచేసుకుందంటూ ఆస్పత్రి అధికారులు క్షమాపణలు తెలిపారు.


‘‘గురువారం రోజు ఐదు గంటల వ్యవధిలో ఒకే పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తుల నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపాం. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మొదటి రిపోర్టు నెగిటివ్ అని వచ్చింది. దీంతో ఆ ఇద్దరిలో ఒకరిని డిశ్చార్జ్ చేశాం. అయితే సాయంత్రం 7 గంటల సమయంలో అదే పేరు మీద ఉన్న మరో వ్యక్తి రిపోర్టు కోవిడ్-19 పాజిటివ్ అని వచ్చింది. రెండో రిపోర్టు వచ్చిన తర్వాతే డిశ్చార్జ్ అయిన వ్యక్తికే కరోనా పాజిటివ్ అని గుర్తించాం..’’ అని ఎస్‌వీపీ ఆస్పత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో హుటాహుటిన కరోనా పాజిటివ్ పేషెంట్‌కు జరిగిన విషయం చెప్పి ఓ అంబులెన్సు పంపామనీ.. అతడు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు.


కాగా జరిగిన మానవ తప్పిదంపై సదరు వైద్య బృందాన్ని ఆస్పత్రి యాజమాన్యం తీవ్ర స్థాయిలో మందలించినట్టు సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎస్‌వీపీ ఆస్పత్రిలో మొత్తం 4,131 మంది కొవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందించారు. కాగా అహ్మదాబాద్‌లో ఇవాళ ఉదయం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు గుజరాత్‌లో 9,577 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. వీరిలో 638 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-05-24T00:22:26+05:30 IST