Jagannath Rath Yatraను ప్రారంభించిన గుజరాత్ సీఎం పటేల్

ABN , First Publish Date - 2022-07-01T18:32:50+05:30 IST

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం ఉదయం 145వ

Jagannath Rath Yatraను ప్రారంభించిన గుజరాత్ సీఎం పటేల్

అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం ఉదయం 145వ శ్రీ జగన్నాథుని రథయాత్రను ప్రారంభించారు. అహ్మదాబాద్ నగరం పాత బస్తీలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్రల ఆశీర్వాదాల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు.  ఈ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. 


జగన్నాథ దేవాలయం ట్రస్టీ మహేంద్ర ఝా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు బుధవారం కోవిడ్-19 లక్షణాలు స్వల్పంగా కనిపించాయని చెప్పారు. వైద్యుల సలహాలను పాటిస్తూ ఆయన శ్రీ జగన్నాథ రథయాత్రను ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి పటేల్ హాజరవడంపై అనుమానాలు వ్యక్తమవడంతో తాము గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కూడా ఆహ్వానించామని చెప్పారు. అయితే పటేల్ హాజరవుతారని ముఖ్యమంత్రి కార్యాలయం ధ్రువీకరించిందన్నారు. 


శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రయాణించే మార్గంలో సంప్రదాయం ప్రకారం గుజరాత్ ముఖ్యమంత్రి పహింద్ విధిని నిర్వహిస్తారు. (మార్గాన్ని శుభ్రపరుస్తారు) మార్గాన్ని ముఖ్యమంత్రి  శుభ్రపరచిన తర్వాత రథయాత్ర ప్రారంభమవుతుంది. 


కోవిడ్-19 మహమ్మారి వల్ల రెండేళ్ళపాటు ఈ రథయాత్రలో పాల్గొనేందుకు ప్రజలను అనుమతించలేదు. ఈ సంవత్సరం రథయాత్రకు ప్రజలను అనుమతించడంతో దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీ జగన్నాథ, సుభద్ర, బలభద్రుల ఆశీర్వాదాల కోసం భక్తులు తరలివస్తున్నారు. 


Updated Date - 2022-07-01T18:32:50+05:30 IST