Published: Tue, 05 Jul 2022 02:07:47 IST ‘స్టార్టప్‌ల ఎకోసిస్టం’లో గుజరాత్, కర్ణాటక టాప్!


v>‘టాప్ పెర్ఫార్మర్’తోనే తెలంగాణ సరి
ఏపీకి ‘ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టం’
న్యూఢిల్లీ, జూలై 4: ఔత్సాహిక వ్యాపారుల కోసం స్టార్ట్‌పల అనుకూల వ్యవస్థను అభివృద్ధి చేయడంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. బెస్ట్ పెర్ఫార్మర్స్, టాప్ పెర్ఫార్మర్స్, లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ అనే ఐదు విభాగాల్లో ర్యాంకులు కేటాయించారు. ఇందులో అత్యుత్తమ పనితీరు కనబరిచిన (బెస్ట్ పెర్ఫార్మర్) రాష్ట్రాలుగా గుజరాత్, కర్ణాటక నిలిచాయి. స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 అని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పదేపదే వ్యాఖ్యానించే విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ మాత్రం రెండో విభాగమైన టాప్ పెర్ఫార్మర్ ర్యాంకుతో సరిపెట్టుకుంది. కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జమ్మూకశ్మీర్‌లకూ ఇదే ర్యాంకు దక్కడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టం ర్యాంకు దక్కింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ ర్యాంకులను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. ‘రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ 2021’ను కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయెల్ సోమవారమిక్కడ విడుదల చేశారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ప్రస్తుతం మనదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని, అగ్రస్థానంలో నిలవడమే లక్ష్యంగా భాగస్వాములందరూ పనిచేయాలని మంత్రి కోరారు. స్టార్ట్‌పలు ఏర్పాటు చేసే వారి కోసం ‘మెంటార్‌షిప్, అడ్వయిజరీ, అసిస్టెన్స్, రిసిలియన్స్, గ్రోత్ (మార్గ్)’ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఒక్కో రాష్ట్రం ఇతర రాష్ట్రాల్లో అమలయ్యే ఉత్తమ విధానాలను నేర్చుకోవడమే లక్ష్యంగా డీపీఐఐటీ ఈ ర్యాంకుల ప్రక్రియను ప్రారంభించింది. తాజా ర్యాంకింగ్‌ల్లో గుజరాత్ ‘బెస్ట్ పెర్ఫార్మర్’గా వరసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. 26 కార్యాచరణ ప్రాంతాల్లోని 7 సంస్కరణల ఆధారంగా ఆయా రాష్ట్రాల పనితీరును మదించి ర్యాంకులు కేటాయించినట్లు డీపీఐఐటీ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.