11 రోజుల పసిపాపకు కరోనా పాజిటివ్... చికిత్స అందిస్తున్నారిలా...

ABN , First Publish Date - 2021-04-13T16:41:46+05:30 IST

గుజరాత్‌లోని సూరత్‌లో 11 రోజుల నవజాత శిశువుకు...

11 రోజుల పసిపాపకు కరోనా పాజిటివ్... చికిత్స అందిస్తున్నారిలా...

సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో 11 రోజుల నవజాత శిశువుకు కరోనా సోకింది. ఈ చిన్నారి జన్మించిన ఐదవ రోజున కరోనాకు గురైంది. ఈ శిశువుకు తల్లి నుంచి కరోనా సంక్రమించి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే అమ్రెలి ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల గర్భిణిని ఏప్రిల్ ఒకటిన డెలివరీ కోసం డైమండ్ ఆసుపత్రిలో చేర్చారు. అదేరోజు ఆమె శిశువుకు జన్మనిచ్చింది. 


ఈ సందర్భంగా ఆసుపత్రిలోని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అల్పేష్ సిఘ్వీ మాట్లాడుతూ ఆ శిశువు పుట్టిన వెంటనే శ్వాస సంబంధిత సమస్యతో బాధపడిందని, ఈ సమస్యకు చికిత్స అందిస్తూ వచ్చామన్నారు. అయితే తల్లి ఆరోగ్యంగానే ఉండటంతో ఆమెను డిశ్చార్జి చేశామన్నారు. ఆ శిశువుకు చికిత్సనందించే దశలో తల్లి పాలకు బదులు ఫార్ములా ఫీడ్ ఇచ్చామన్నారు. ఏప్రిల్ 5 నాటికి శిశువు ఆరోగ్యం కుదుటపడిందని, దీంతో తల్లిని పిలిపించి, ఆ శిశువుకు తల్లిపాలు ఇప్పించామన్నారు. ఏప్రిల్ 6న ఆ శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిందన్నారు. దీంతో ఆ చిన్నారికి ఎక్స్ రే తీశామన్నారు. ఏదో సమస్య ఉన్నదని గుర్తించి యాంటీజెన్ టెస్టు చేశామన్నారు. దీనిలో ఆ శిశువుకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో ఆ శిశువును వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స అందిస్తున్నామన్నారు. అలాగే ఆ చిన్నారికి రెమిడెసివిర్ ఇంజిక్షన్ ఇచ్చామన్నారు. ఆ చిన్నారికి ప్లాజ్మా చికిత్స అందించనున్నామని తెలిపారు. 

Updated Date - 2021-04-13T16:41:46+05:30 IST