గోరింటా పండింది... ‘గిన్నిస్‌’కు ఎక్కింది

ABN , First Publish Date - 2022-01-20T05:27:16+05:30 IST

అతివ అరచేతిలో పండిన గోరింట ఇప్పుడు గిన్నిస్‌ రికార్డులకెక్కింది. కేరళలోని కొళికోడ్‌ ఇందుకు వేదిక అయింది. ఇంతకీ ఏమిటా రికార్డు? ఎవరిదా ఘనత?

గోరింటా పండింది... ‘గిన్నిస్‌’కు ఎక్కింది

అతివ అరచేతిలో పండిన గోరింట ఇప్పుడు గిన్నిస్‌ రికార్డులకెక్కింది. కేరళలోని కొళికోడ్‌ ఇందుకు వేదిక అయింది. ఇంతకీ ఏమిటా రికార్డు? ఎవరిదా ఘనత? 

ఆదిత్య నిధిన్‌... పాతికేళ్ల ఈ కొళికోడ్‌ అమ్మాయి స్వతహాగా మెహందీ ఆర్టిస్ట్‌. ఆమె పేరు అక్కడి మహిళలందరికీ సుపరిచయం. ఎందుకంటే... పండగలు, ఇతర శుభకార్యాల్లో మగువల మెహందీ ముచ్చట తీర్చేది తనే. కోరుకున్న డిజైన్లను క్షణాల్లో చేతులపై ప్రత్యక్షం చేయడం నిధిన్‌ ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే ఆమెలో వినూత్న ఆలోచనకు బీజం వేసింది. చేసే పనిలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. అదెలా? అందుకే ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’పై కన్నేసింది. లక్ష్యం పెద్దది. దాన్ని చేరుకోవడం అంత సులువు కాదని తెలుసు. కానీ పట్టుదలగా ప్రయత్నిస్తే సాధ్యంకానిదేముంటుంది! ఇదే ఆలోచన ఆమెలో. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. కాలం వృథా పోనివ్వలేదు. వెంటనే హెన్నా ఆర్ట్‌లో గత రికార్డులు తిరగేసింది. అందులో బ్రిటన్‌కు చెందిన సమీనా హుసేన్‌ పేరిట ప్రపంచ రికార్డు ఉన్నట్టు గమనించింది. ఆమె గంటలో 600 చేతులపై మెహందీ ఆర్ట్‌ వేసింది. కనుక లక్ష్యం ఏమిటన్నదానిపై ముందే ఓ స్పష్టత వచ్చేసింది. ఇక కావల్సింది దాన్ని అధిగమించడానికి ఒక పక్కా ప్రణాళిక. తగిన సన్నద్ధత. 


‘‘చిన్నప్పటి నుంచి మెహందీ కళంటే నాకు చాలా ఇష్టం. దాంతో ఈ రంగంలో నా గురించి నలుగురూ గొప్పగా చెప్పుకొనేలా ఏదైనా చేయాలనుకునేదాన్ని. దీనికి సంబంధించి ఎక్కడైనా ఏవైనా పోటీలు జరుగుతున్నాయా... అని ఇంటర్‌నెట్‌లో వెతికాను. పోటీల్లాంటివేవీ కనిపించలేదు కానీ... ఇందులో రికార్డులు నెలకొల్పిన కొంతమంది కళాకారుల పేర్లు మాత్రం దొరికాయి. ఆ క్షణమే నిర్ణయించుకున్నా... ఎలాగైనా గిన్నిస్‌ రికార్డు బద్దలు కొట్టాలని! కేవలం గత రికార్డుని అధిగమించడమొక్కటే కాకుండా... నేను సాధించే ఘనత పది కాలాల పాటు పదిలంగా నిలిచిపోవాలనుకున్నా’’ అంటున్న నిధిన్‌ పేరిట గతంలో కూడా ఓ రికార్డు ఉంది. చేతిపై ప్రపంచంలోని ఏడు వింతలను కేవలం 12 నిమిషాల్లో మెహందీతో చిత్రించి ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించింది. 


ఆ ఉత్సాహంతో క్లిష్టమైన ‘గిన్నిస్‌’ ఘనతకు సిద్ధమైంది నిధిన్‌. రోజూ చేసే పనే అయినా... అనుకున్న సమయంలో పూర్తి చేయాలంటే కచ్చితత్వం రావాలి. ఏకాగ్రత కుదరాలి. ఒత్తిడిని జయించాలి. అందుకు చాలా రోజులు శ్రమించింది తను. చివరకు ఎన్నాళ్లో వేచిన ఆ సమయం రానే వచ్చింది. కొత్త సంవత్సర వేడుకల తరువాత... కొళికోడ్‌ వాసులకు మరో సంబరం మొదలైంది. 


‘‘కొళికోడ్‌లోని సీహెచ్‌ఎంసీ మైదానం కిక్కిరిసిపోయింది. వాళ్లంతా నా ఫీట్‌ను ప్రత్యక్షంగా చూడడానికి వచ్చినవాళ్లు. మా ఊరి వాళ్లు. అందులో మావారు కూడా ఉన్నారు. సొంతవారి ముందు ప్రదర్శన ఇస్తున్న అనుభూతి. ఏదో తెలియని భావోద్వేగానికి లోనయ్యాను. వారంతా నన్ను ఎంతో ప్రోత్సహించారు. రికార్డు బద్దలు కొట్టడానికి కావల్సినంత ఆత్మవిశ్వాసాన్ని నింపారు’’ అంటూ ఆ మధుర క్షణాల గురించి చెప్పిన ఆదిత్య నిధిన్‌ అనుకున్నట్టుగానే ‘గిన్నిస్‌ బుక్‌’లో తన పేరు లిఖించుకుంది. గంటలో అత్యధికంగా 910 చేతులపై మెహందీతో డిజైన్లు వేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. వాస్తవానికి నిధిన్‌ 37వ నిమిషంలోనే గత రికార్డును అధిగమించింది. ‘‘అన్నిటి కంటే నన్ను బాగా ఇబ్బంది పెట్టింది, ఉత్సుకతకు లోను చేసింది అక్కడున్న గడియారం. నిమిష నిమిషానికీ నిర్వాహకులు కరిగిపోయిన సమయం ప్రకటించినప్పుడల్లా నా గుండె వేగంగా కొట్టుకొనేది’’ అంటూ చెప్పుకొచ్చిన ఆదిత్య నిధిన్‌... పోటీ అయిపోయాక ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోయింది.

Updated Date - 2022-01-20T05:27:16+05:30 IST