ఆన్‌లైన్‌ చదువుకు అయిదు సూత్రాలు

ABN , First Publish Date - 2020-07-16T05:30:00+05:30 IST

కరోనా కారణంగా విద్యారంగం అనిశ్చితిలో ఉంది. పాఠశాలలూ, కళాశాలలూ ఎప్పుడు తెరుస్తారో తెలీదు. మరోవైపు ఆన్‌లైన్‌ తరగతులకు అలవాటు పడలేక విద్యార్థులు సతమతమవుతున్నారు. పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలన్న ప్రతిపాదనలు వారిపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి...

ఆన్‌లైన్‌ చదువుకు అయిదు సూత్రాలు

కరోనా కారణంగా విద్యారంగం అనిశ్చితిలో ఉంది. పాఠశాలలూ, కళాశాలలూ ఎప్పుడు తెరుస్తారో తెలీదు. మరోవైపు ఆన్‌లైన్‌ తరగతులకు అలవాటు పడలేక విద్యార్థులు సతమతమవుతున్నారు. పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలన్న ప్రతిపాదనలు వారిపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ పరిస్థితులను పిల్లలు ఎలా ఎదుర్కోవాలి? అన్‌లైన్‌ పాఠాలకూ, పరీక్షలకూ ఎలా సిద్ధం కావాలి? నిపుణులు చెబుతున్న పంచసూత్ర ప్రణాళిక ఇది.


విద్యార్థి, అధ్యాపకుడు, తరగతి గది... వీటిని విడివిడిగా ఊహించుకోలేం. కానీ ‘కొవిడ్‌-19’ విజృంభణతో కనీసం రాబోయే కొద్దికాలం వీటిని కలిపి ఊహించుకొనే అవకాశాలు లేవు. భౌతిక దూరం, శానిటైజేషన్‌ పాటించక తప్పని స్థితిలో పిల్లలకు ఆన్‌లైన్‌ బోధన తప్ప మరో మార్గం లేదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పరీక్షలు కూడా అన్‌లైన్‌లోనే నిర్వహించాలన్న ఆలోచనలు సైతం ముందుకు వస్తున్నాయి. ఇంటి దగ్గరే చదువుకొని, ఇంట్లోనే కూర్చొని పరీక్షలు రాయడం విద్యార్థులకు కత్తి మీద సామే! అది వారి మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి మానసిక వైద్యులు చెబుతున్న కొన్ని సూచనలు...


అనవసర భయాలు వద్దు

స్కూలులో తోటి విద్యార్థుల మధ్య ఉన్నప్పుడు తాము ఏ స్థాయిలో ఉన్నామో, ఇంకా ఎంత మెరుగుపరుచుకోవాలో పిల్లలకు అంచనా ఉంటుంది. ఇంట్లోనే చదువు కొనసాగిస్తున్నప్పుడు, ‘సరిగ్గా చదువుతున్నామా లేక వెనుకబడిపోతున్నామా?’ అనే భయాలు పిల్లల్లో తలెత్తుతాయి. ఒక విషయం గుర్తుంచుకోండి... పాఠశాలకు వెళ్ళి, వచ్చే సమయం మీకు కలిసి వచ్చింది. ఆన్‌లైన్‌ పాఠాలు విన్న తరువాత వాటిని పునశ్చరణ చేస్తే బాగా గుర్తుంటాయి. పాఠాల మీద అవగాహన వస్తుంది. అది వచ్చినప్పుడు మీలో భయం ఉండదు.


లక్ష్యాలు నిర్ణయించుకోండి

‘ఏ రోజు ఏం చదవాలి, వారంలో ఎన్ని పాఠాలు కవర్‌ చెయ్యాలి?’ అని నిర్ణయించుకోండి. ఆ ప్రకారం చేయండి. రోజువారీ లక్ష్యాలను సాధించినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తరువాత చేసే అభ్యాసం మరింత సులువవుతుంది. మీరు వేసుకున్న షెడ్యూల్‌ మీరు ఏం చెయ్యాలో మాత్రమే చెబుతుంది. దాన్ని అనుసరించి, ఫలితాలు సాధించాల్సిన బాధ్యత మీదే. 


పరిస్థితిని ఆమోదించండి

కరోనా కారణంగా విద్యారంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆమోదించడం అవసరం. అందరికీ ఇదో కొత్త అనుభవం. మొదట్లో ఇబ్బందిగానే ఉన్నా క్రమంగా సర్దుబాటు అవుతుంది. బడి నుంచి వచ్చిన తరువాత పిల్లలను చదివించడం వేరు. రోజంతా ఇంట్లోనే ఉంటున్న పిల్లల పురోగతి ఎలా ఉంటోందో అనుక్షణం పర్యవేక్షించడం వేరు. అలాగే విద్యార్థులకు కూడా ఇల్లంటే ఆటవిడుపుగా ఉంటుంది కానీ బడి వాతావరణం ఉండదు. కొన్నాళ్ళు ‘ఇల్లే బడి’ అనే నిశ్చయాన్ని మనసులో చేసుకోవాలి. ఆలోచనా విధానాన్ని దానికి అనుగుణంగా మార్చుకోవాలి. 


విరామం తీసుకోండి

ఇంట్లో కూర్చొని చదవడం కొంత విసుగెత్తే వ్యవహారమే! ఏకాగ్రత కుదరడం కష్టమవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు విరామం తీసుకొండి. మీకు సంబంధించిన ఇతర పనులు చేసుకోండి. 

ఆ సంగతి స్పష్టంగా చెప్పండి: స్కూలుకో, కాలేజీకో వెళ్ళాల్సిన అవసరం లేనంత మాత్రాన మీరు చదువు ఆపేసినట్టు కాదు. ఇంటి దగ్గర చదవడానికి మీకు తగిన వాతావరణం కావాలి. మీ ఆన్‌లైన్‌ తరగతుల సమయంలో, అనంతరం చదివే సమయంలో వీలైనంత వరకూ మీ ఏకాగ్రతకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీ కుటుంబం మీద ఉంటుంది. ఆ సంగతి వారికి స్పష్టంగా తెలియజేయండి. వారి సహకారం తీసుకోండి.


ప్రణాళిక వేసుకోండి

మీరు చేయాల్సిన పనుల జాబితా తయారు చేసుకోండి. ఆన్‌లైన్‌ తరగతుల తరువాత మీరు చదువుకు కేటాయించాల్సిన సమయం ఎంతనేది నిర్ణయించుకోండి. కాలం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారనేది మీ మీదే ఆధారపడి ఉంది. ‘ఇంట్లోనే ఉన్నాం కదా!’ అని తేలికగా తీసుకుంటే చదువులో వెనుకబడతారు. కాబట్టి మీరు వేసుకున్న ప్రణాళికను కచ్చితంగా అమలుపరచండి.


Updated Date - 2020-07-16T05:30:00+05:30 IST