గూగుల్ మీట్‌లో పెళ్లి అతిథులు.. జొమాటో ద్వారా విందు

ABN , First Publish Date - 2022-01-18T22:34:59+05:30 IST

అయితే పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ జంట తమ పెళ్లికి 450 మంది అతిథులను ఆహ్వానించింది. వీరంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పెళ్లి వేడుకకు హాజరు అవుతారు. దానికోసం కొత్త పెళ్లి జంట ఒక అద్భుతమైన ఆలోచన చేసింది..

గూగుల్ మీట్‌లో పెళ్లి అతిథులు.. జొమాటో ద్వారా విందు

కోల్‌కతా: భారతీయ సంప్రదాయంలో పెళ్లి అతిపెద్ద వేడుక. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారందరినీ పిలిచి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. ప్రపంచంలో ఏ దేశంలో పెళ్లి ఇంత పెద్ద ఎత్తున జరగదు, ఇంత మంది అతిథులు హాజరు కారు. అయితే పెళ్లిల్లపై కొవిడ్ తీవ్ర దెబ్బ కొట్టింది. ఎక్కువ మంది ఒక చోట గుమిగూడకుండా పెళ్లి చేసుకోవాలని మన ప్రభుత్వాలు షరతులు విధించాయి. దీంతో చాలా మంది తమ పెళ్లిల్లను వాయిదా వేసుకోవడం లేదంటే తక్కువ మందితో ప్లాన్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.


అయితే పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ జంట తమ పెళ్లికి 450 మంది అతిథులను ఆహ్వానించింది. వీరంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పెళ్లి వేడుకకు హాజరు అవుతారు. దానికోసం కొత్త పెళ్లి జంట ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. గూగుల్ మీట్ ద్వారా తమ పెళ్లి వేడుక చేసుకోవాలని నిర్ణయించుకుంది. వారి పెళ్లిక హాజరయ్యే అతిథులంతా గూగుల్ మీట్ ద్వారానే పెళ్లిని తిలకించి, యువజంటను ఆశీర్వదిస్తారు. ఇక పెళ్లి అనగానే విందు కూడా ఉంటుంది. భారతీయ సంప్రదాయం ప్రకారం ఏ వేడుక అయినా విందు భోజనం తప్పనిసరి. అదే పెళ్లి భోజనం అయితే మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దీనికి కూడా వారు ఏర్పాట్లు చేశారు. అతిథులందరికీ జొమాటోలో భోజనం ఆర్టర్ చేసి వారి ఇళ్లకు డెలివరి పంపించనున్నారట.


ఇంతకీ పెళ్లి చేసుకోబోతున్న ఆ యువ జంట గురించి చెప్పనేలేదు కదా.. అబ్బాయి పేరు సందీపన్ సర్కార్, అమ్మాయి అదిథి దాస్. వీరు జనవరి 24న పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే వీరి పెళ్లి ఏడాది క్రితమే జరగాల్సిందట. కానీ కొవిడ్ కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. కానీ కొవిడ్ ప్రభావం తగ్గకపోవడంతో గూగుల్ మీట్ ద్వారా అతిథుల సమక్షంలో పెళ్లికి సిద్ధమయ్యారు.

Updated Date - 2022-01-18T22:34:59+05:30 IST