అతిథి బోధకులూ అంతే కష్టపడతారు!

ABN , First Publish Date - 2021-07-28T08:42:38+05:30 IST

జీవనోపాధి కోసం కొందరు, ఉపాధ్యాయ వృత్తిపై మమకారంతో మరికొందరు, ఆ ఉద్యోగం రాకున్నా బోధనపై ఇష్టాన్ని వదులుకోలేక ఇంకొందరు...

అతిథి బోధకులూ అంతే కష్టపడతారు!

జీవనోపాధి కోసం కొందరు, ఉపాధ్యాయ వృత్తిపై మమకారంతో మరికొందరు, ఆ ఉద్యోగం రాకున్నా బోధనపై ఇష్టాన్ని వదులుకోలేక ఇంకొందరు... ఇలా ఎందరో విద్యావంతులు ఇంటర్‌, డిగ్రీ, పీజీ కళాశాలల్లోనూ, సాంఘిక సంక్షేమ గురుకులాల్లోనూ ఉపాధ్యాయ, అధ్యాపక వృత్తిలో ఉపాధి అవకాశాలు పొందారు, పొందుతున్నారు. వీరినే గౌరవంగా అతిథి బోధకులు అని పిలుస్తున్నారు. వీరికి రోజులో గంటకు ఇంత చొప్పున గౌరవ వేతనం పేర వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2013–14 సంవత్సరంలో సాంఘిక సంక్షేమ గురుకుల, మైనార్టీ, బీసీ గురుకులాల్లో గెస్ట్‌ టీచర్స్‌, లెక్చరర్స్‌, పి.ఇ.టి.లుగా వేలాదిమంది నిరుద్యోగులను తీసుకున్నారు. మొదట్లో కొద్దిమందితో ప్రారంభమైనా శాశ్వత ప్రాతిపాదికన ఉద్యోగాలను భర్తిచేయలేని స్థితిలో ఈ అతిథి బోధకుల సంఖ్య క్రమంగా పెరిగింది. నేడు బీసీ గురుకులాల్లో 2240 మంది, ఎస్సీ ఎస్టీ గురుకులాలల్లో 1500 మంది, మైనార్టీ గురుకులాల్లో 1500 మంది ఈ అతిథి బోధకులు ఉంటారు. ఈ గురుకులాల దైనందిన శ్రమను అతిథి అధ్యాపకులు, ఉపాధ్యాయులు సమానంగా పంచుకుంటారు. అతిథి అధ్యాపకులు విద్యార్థులకు ట్యూషన్‌ చెబుతారు. భోజన సమయాల్లో విద్యార్థుల మంచి చెడులు చూసుకుంటారు. రాత్రుళ్లు కేర్‌టేకర్‌గా ఉంటారు. ఇవేకాకుండా ఎన్నో అంశాల్లో రెగ్యులర్‌ అధ్యాపకులకు సమాన స్థాయిలో వీరి శ్రమ ఉంటుంది. అయినా వీరికి నెలలో ఒక రోజు మాత్రమే సెలవు ఇస్తారు. వేతనాల్లో అసమాన పంపిణీ జరుగుతుంది. వీరికి ప్రభుత్వం ప్రకటించిన పిఆర్‌సి ఇప్పటికీ అందలేదు. అసలు వీరికి పిఆర్‌సి వర్తిస్తుందా లేదా అనే సందిగ్ధమూ ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని అతిథి బోధకులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎన్ని సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా వారి సమస్యలు పరిష్కారమైన పాపాన పోలేదు. ఈ విద్యాసంస్థల్లో అతిథి బోధకులు ప్రధానంగా పేద, బడుగు వర్గాలవారు కావడం గమనార్హం.


అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు, బ్యూరోక్రాట్స్‌కు పెరుగుతున్న వేతనాలు ఈ అతిథి బోధకులకు మాత్రం ఎందుకు పెరగవు అనేది ప్రశ్న ఉదయిస్తుంది. రెగ్యులరైజ్‌ చేయక పోవడం వలన వీరి జీవితాలకు భద్రత లేక బతుకు భారంగా గడుపుతున్నారు. అవకాశం ఉంటేనే వీరిని విద్యాసంవత్సరం ప్రారంభంలో మళ్ళీ తీసుకోవడం జరుతుంది. రెగ్యులర్‌ బోధకులతో సమానంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్న తమను చిన్నచూపు చూడటం సరికాదని అతిథి బోధకులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ గురుకులాల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉంటున్నాయంటే అందులో అతిథి బోధకుల పాత్ర కూడా ప్రధానమైనదని గ్రహించాలి. వీరి సేవలను గుర్తించి వేతనాన్ని పెంచడంతో పాటు అది క్రమం తప్పకుండ అందేలా చూడాలి.


ఈ అతిథి బోధకులను పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్టు విధానంలోకి మార్చింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలు వీరికి ఉద్యోగ భద్రతను ఇచ్చి సర్వీసును కొనసాగిస్తున్నాయి. అంతేగాక సమాన పనికి సమాన వేతనం, 12 నెలల జీతం వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం అతిథి బోధకులను ఏకంగా రెగ్యులరైజ్‌ చేసి పూర్తి న్యాయం చేకూర్చింది. మన రాష్ట్రంలో మాత్రం వీరి జీవితాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలలో సాధ్యం అయినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యపడదు అనే ప్రశ్న ఉదయిస్తున్నది. కాబట్టి ప్రభుత్వం ఆయా రంగాల్లో ఉపాధి పొందుతున్న వారితో పాటు తెలంగాణ నిరుద్యోగ యువతకందరికీ ఉద్యోగాలు కల్పించాలి. ఈ అతిథి భోదకులకు లాక్‌డౌడ్‌ సమయంలో చెల్లించలేని వేతనాలను చెల్లించి, పిఆర్‌సి అమలు చేయాలి. నెలవారీ వేతనాలను సైతం పెంచాలి. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈ కాంట్రాక్ట్‌, ఫారం, టైమ్‌ స్కేల్‌, అన్నిరకాల అతిథి బోధకులను, పార్టుటైమ్‌, అవుట్సోర్సింగ్‌ తదితర ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి. ఈ దిశగా ఈ ఉద్యోగస్థులందరితోనూ కలిసి తెలంగాణ యావత్‌ విద్యార్థి యువత ఐక్య ఉద్యమాలను నిర్మించాలి.

పాపని నాగరాజు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక తెలంగాణ మహాసభ

Updated Date - 2021-07-28T08:42:38+05:30 IST