రిజర్వేషన్లు లేకుండానే గెస్ట్‌ ఫ్యాకల్టీ

ABN , First Publish Date - 2020-07-11T08:36:17+05:30 IST

రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలు రిజర్వేషన్లు పాటించకుండా గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాలకు తెరలేపాయి. ప్రభుత్వ అభిమతానికి విరుద్ధంగా

రిజర్వేషన్లు లేకుండానే గెస్ట్‌ ఫ్యాకల్టీ

  • మెరిట్‌ లేకపోయినా రెన్యువల్‌ 
  • ప్రభుత్వ అభిమతానికి విరుద్ధంగా వర్సిటీలు
  • అయిన వారితో పోస్టులు నింపుతున్న వైనం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం

అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలు రిజర్వేషన్లు పాటించకుండా గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాలకు తెరలేపాయి. ప్రభుత్వ అభిమతానికి విరుద్ధంగా చేతివాటం ప్రదర్శిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మెరిట్‌ని పక్కన పెట్టి, దొంగదారిన నియమితులైన గెస్ట్‌ ఫ్యాకల్టీని రెన్యువల్‌ చేస్తూ బోధన నాణ్యతను పట్టించుకోకపోవడం కేవలం రాష్ట్రంలోని వర్సిటీల్లో మాత్రమే జరుగుతోంది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ నియామకాల్లో సైతం వివక్షకు తావులేకుండా 50శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వాలని, వాటన్నింటిలోనూ 50 శాతం మహిళలు ఉండాలంటూ ఒకవైపు ముఖ్యమంత్రి జగన్‌ చెప్తుంటే... మరోవైపు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. వర్సిటీల్లో ఫుల్‌టైమ్‌ గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాలు ఎటువంటి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ పాటించకుండానే చేస్తున్నారు.


దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.  ఇటీవల జరిగిన ఓ విశ్వవిద్యాలయ పాలకమండలి సమావేశంలో ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు తీర్చడం కష్టమని, కొత్తగా ఎటువంటి కాంట్రాక్టు అధ్యాపక నియామకాలు చేపట్టరాదని ప్రభుత్వ సభ్యులు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వర్సిటీలు తమ అనుయాయులతో గెస్ట్‌ ఫ్యాకల్టీని నింపడానికి తెరలేపాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కొన్ని సామాజిక వర్గాలకు మేలు చేకూరే విధంగా ఈ గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2020-07-11T08:36:17+05:30 IST