నిమ్మ రైతుకు కన్నీళ్లు

ABN , First Publish Date - 2020-08-10T10:44:13+05:30 IST

ఒకప్పుడు జాతీయ మార్కెట్‌ను శాసించిన గూడూరు నిమ్మ రైతులు నేడు దయనీయస్థితిలో ఉన్నారు.

నిమ్మ రైతుకు కన్నీళ్లు

లూజు బస్తా రూ. 200 నుంచి రూ. 600

ఖర్చులు కూడా రాక ఇక్కట్లు

కొంప ముంచిన కరోనా

ఇకనైనా మార్కెట్‌ పుంజుకునేనా ?

శీతల గిడ్డంగులు ఏర్పాటయ్యేనా.!?


గూడూరు, ఆగస్టు 9 : ఒకప్పుడు జాతీయ మార్కెట్‌ను శాసించిన గూడూరు నిమ్మ రైతులు నేడు దయనీయస్థితిలో  ఉన్నారు. నిమ్మకాయలు లూజు బస్తా రూ. 200 నుంచి రూ. 600 వరకు అమ్ముడు పోతుండడంతో ఖర్చులు కూడా  రాక రైతులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. చేసిన అప్పులు తీరాలంటే మార్కెట్‌ ధరలు ఎగుడుదిగుడుగా ఉంటే తట్టుకోవచ్చు . కానీ నిమ్మ ధరలు పతనావస్థకు చేరడంతో రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది.


గత ఏడాది లాభాలు

గతేడాది ఇదే సమయంలో లూజు బస్తాధర రూ. 15,500 వరకు అమ్ముడు పోయింది. దీంతో రైతులు లాభాలు గడించారు.  ఈ ఏడాది కూడా ఆ స్థాయిలో కాకపోయినా కాయల ధరలు కొంచమైన మెరుగుపడుతాయని రైతులు ఆశించారు. అయితే ఈ ఏడాది ఆరంభం మంచుకాలం వెళ్లాక ధరలు పుంజుకునే తరుణంలో కరోనా  ప్రభావంతో మార్కెట్‌ను మూసివేయాల్సి వచ్చింది. దీంతో రైతులు కాయలు మార్కెట్‌కు తరలించలేక తోటల్లోనే వదిలివేయాల్సివచ్చింది. 


 ఏం తినాలి ?

లూజుబస్తా ధర రూ. 200 నుంచి రూ. 600 ధర పలికితే తాము ఏం తినాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధరల దిగజారుడికి ఉత్తరాది మార్కెట్‌లో లాక్‌డౌన్‌ కొనసాగడం, ఇక దక్షణాదిలోని కేరళ విషయానికి వస్తే వర్షాలు మిన్నంట డమే కారణం. ధర్మపురి, కొలాం, ఎర్నాకుళం, సేలం ప్రాంతాలలో నిమ్మకాయలు అడిగేవారు లేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. లూజు బస్తా కాయలు కొయాలంటే కూలీలు రూ. 250 చెల్లించాలి. రవాణా ఖర్చు రూ. 100 అవుతుంది. గోనుసంచె ఇవన్ని చూసుకుంటే రూ. 500 వరకు అవుతుంది. కాయలు తెచ్చి ఉత్తచేతులతో ఇంటికి చేరాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిమ్మరైతులకు శీతల గోదాములు ఏర్పాటు చేస్తే వారు తేరుకునే అవకాశం ఉంది.


శీతల గోదాములు ఏర్పాటు చేయాలి.. గోపాల్‌

నిమ్మకాయలు నిల్వ చేసుకోవాలంటే శీతల గోదాములు తప్పనిసరి. దీంతో ధరలు తగ్గుముఖం పట్టినా,  మంచి దర వచ్చినప్పుడు  నిమ్మకాయలు అమ్ముకుని సొమ్ముచేసుకోవచ్చు.


వర్షాలు తగ్గేవరకు ఇంతే..సురేష్‌

నిమ్మరైతు కొంచమైనా కోలుకోవాలంటే దక్షణాది ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖం పట్టాలి. ఇప్పటికే లూజు బస్తా రూ. 400, రూ. 600లకు అమ్ముకోవాల్సి వస్తుంది.దీంతో గిట్టుబాటు కావడంలేదు.

Updated Date - 2020-08-10T10:44:13+05:30 IST