తగ్గేదేలే..!

ABN , First Publish Date - 2022-05-09T06:11:53+05:30 IST

తగ్గేదేలే..!

తగ్గేదేలే..!
ప్రభుత్వ స్థలంలో కొనసాగుతున్న చెరువు తవ్వకాలు

గుడివాడలో ఆగని కడప కబ్జా

శనివారం రాత్రి నుంచి యథేచ్ఛగా తవ్వకాలు

కాపలా పెట్టి మరీ టన్నులకొద్దీ మట్టి లూటీ

జిల్లా ఉన్నతాధికారి సహా అందరూ గప్‌చుప్‌

మాజీమంత్రి సహకారంతో రెచ్చిపోతున్న అక్రమార్కులు


గుడివాడ, మే 8 : నందివాడ మండలం పుట్టగుంట రెవెన్యూ పరిధిలోని రూ.5 కోట్ల విలువైన తొమ్మిది ఎకరాల అస్వాధీన ప్రభుత్వ అసైన్డ్‌ భూమిలో మట్టి మాఫియా ఆదివారం కూడా బరితెగించింది. తమను ఎవరూ ఏమీ చేయలేరంటూ కాపలాదారులను ఉంచి మరీ అక్రమ తవ్వకాలు సాగించింది. కలెక్టర్‌ రంజిత్‌ బాషా సీరియస్‌గా ఉన్నా.. ఏమీ పట్టకుండా చేపల చెరువు తవ్వకాలను కొనసాగించారు. అనుమతులు ఉన్నాయంటూ భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టి టన్నులకొద్దీ మట్టిని లూటీ చేస్తున్నారు. ప్రభుత్వ భూమిపై గతంలోనే కన్నేసి దొంగ పట్టాలు పుట్టించిన కడప గూండాలకు గుడివాడ అధికార పార్టీ నాయకులు వత్తాసు పలకడమే ఇందుకు కారణం.

కబ్జాకోరుల సేవలో అధికారులు  

అన్ని శాఖల అధికారులు కబ్జాకోరుల సేవలో తరిస్తున్నారు. గుడివాడ పట్టణంలోని ఓ భారీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ మెరక చేసేందుకు టిప్పర్లతో శనివారం రాత్రి నుంచి నిరాటంకంగా మట్టిని తరలిస్తూనే ఉన్నారు. మైనింగ్‌, రెవెన్యూ ఫిషరీస్‌, డ్రెయినేజీ.. ఇలా ఎవరికి వారు తమ పరిధి కాదంటే తమది కాదని పేర్కొంటూ కబ్జాకోరులకు అండగా నిలుస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ప్రభుత్వ భూమిని కాజేస్తున్నా ఎవరూ అదేమని అడిగిన పాపాన పోలేదు. అధికారం మాది.. ఏమైనా చేస్తాం.. అడ్డుకోవడానికి ఎవరూ రావద్దు.. వస్తే పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది.. అని గతంలో అధికార పార్టీ గుడివాడ అధినాయకత్వం చేసిన హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే జంకుతున్నారు. ప్రభుత్వ భూమిలో చేపల చెరువు తవ్వేస్తున్నా రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన మాజీమంత్రి మట్టి మాఫియాకు వత్తాసు పలకడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.    

రికార్డులు తనిఖీ చేస్తే సరి

రెవెన్యూ అధికారులు భూమి రికార్డులు తనిఖీ చేస్తే కబ్జా పర్వం వెలుగుచూస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. 1972 నుంచి పుట్టగుంట ఆర్‌ఎస్‌ఆర్‌లో ఆయా సర్వే నెంబర్లలోని భూమి ల్యాండ్‌ సీలింగ్‌ యాక్టులో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదిగా రికార్డయింది. అదే భూమిని 1975లో పుట్టగుంటకు చెందిన వ్యవసాయ కార్మికులకు సాగుకోసం అసైన్‌ చేసి పంపిణీ చేశారు. అసైన్‌మెంట్‌ చట్టం నిబంధనల ప్రకారం ఆ భూమి అమ్మకూడడు. ఎవరూ కొనకూడదు. మూడు దశాబ్దాల నుంచి సాగులో లేని ఈ భూమిపై సర్వహక్కులు ప్రభుత్వానికి ఉంటాయి. ఈ క్రమంలో స్థానిక రెవెన్యూ అధికారుల వ్యవహారశైలి అనుమానా స్పదంగా తయారైంది. అసలే ప్రభుత్వ భూమి తక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో... తమ గ్రామం లోని ఉన్నత పాఠశాల ఆటస్థలం, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, హెల్త్‌ సబ్‌ సెంటర్లకు కేటాయించిన భూమిని చేపల చెరువుగా మార్చేస్తుంటే అధికారులు అడ్డుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం తహసీల్దార్‌ రెహ్మాన్‌ బహిరంగ విచారణ చేపట్టి రికార్డులు తనిఖీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read more