అధికారానికి తలొగ్గి..

ABN , First Publish Date - 2022-01-22T06:24:15+05:30 IST

కేసినో వ్యవహారంలో నిజాన్ని నిగ్గు తేల్చేందుకు గుడివాడ వచ్చిన టీడీపీ నిజనిర్ధారణ బృందంపై వైసీపీ కార్యకర్తల దాడి రణరంగాన్ని తలపించింది.

అధికారానికి తలొగ్గి..
పోలీసు పహారాలో గుడివాడ పట్టణం

గుడివాడ పోలీసుల చూపు ఒకవైపే

ప్రదర్శన చేస్తున్న టీడీపీ నేతల అరెస్ట్‌

దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై చర్యల్లేవ్‌

పోలీసుల ఎదుటే రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు

టీడీపీ నాయకుడు రమేష్‌కు తీవ్ర గాయాలు

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిమరీ దాడికి యత్నం


గుడివాడ, జనవరి 21 : కేసినో వ్యవహారంలో నిజాన్ని నిగ్గు తేల్చేందుకు గుడివాడ వచ్చిన టీడీపీ నిజనిర్ధారణ బృందంపై వైసీపీ కార్యకర్తల దాడి రణరంగాన్ని తలపించింది. పట్టణంలో అడుగడుగునా ఏర్పాటు చేసిన పోలీసు పహారా టీడీపీ నాయకులను అడ్డుకోవడానికే పరిమితం కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రులు, శాసనసభ్యులు, మాజీ ఎంపీలతో కూడిన టీడీపీ నిజనిర్ధారణ బృందం ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసేందుకు బయలుదేరింది. వారు పోలీసుల అనుమతి తీసుకున్నా అడ్డుకుని అరెస్ట్‌ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. శాంతియుత ప్రదర్శనకు కరోనా నిబంధనలు ఒప్పుకోవని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడంపై విమర్శలు వచ్చాయి. పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కె కన్వెన్షన్‌ నుంచి వైసీపీ కార్యకర్తలు పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించి, టీడీపీ కార్యాలయంపైకి దాడికి తెగబడితే చూస్తూ ఊరుకోవడం, టీడీపీ నాయకులను నాలుగు అడుగులు వేసినా అరెస్ట్‌ చేయడం ఏ రకమైన నిష్పాక్షికతకు వస్తుందో డీఐజీ మోహనరావు చెప్పాలని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంపైకి వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లతో దాడులకు తెగబడినా, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం వెనుక ఎవరున్నారో తెలియడం లేదా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ నేతలను అరెస్ట్‌ చేసి పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌లో ఉంచితే అక్కడకు వైసీపీ కార్యకర్తలు వెళ్లి, ‘వాళ్లని బయటకు వదలండి మేము చూసుకుంటాం’ అని సవాల్‌ విసరడం వైసీపీ కార్యకర్తలు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారనడానికి నిదర్శనం. పోలీసుల వైఫల్యంతోనే తమ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలి ఇలా కొనసాగితే సామాన్యులకు అధికారపార్టీ కార్యకర్తల నుంచి రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కేసినో నడిపి వారం గడుస్తున్నా బాధ్యులను గుర్తించలేని స్థితిలో పోలీసు శాఖ ఉండటంపై విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. 


ఆగని వైసీపీ దాడులు

వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడి, స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకుడు ముళ్లపూడి రమేష్‌చౌదరిపై వైసీపీ కార్యకర్తలు మళ్లీ దాడికి యత్నించారు. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించగా, టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని నిలువరించారు. ఘటన వివరాలు తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ గోవిందరాజులు హుటాహుటిన అక్కడకు చేరుకుని నిందితులను చెదరగొట్టి రమేష్‌కు రక్షణ ఏర్పాట్లు చేశారు. కాగా రమేష్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు.

Updated Date - 2022-01-22T06:24:15+05:30 IST