గుడ్డిపలో సచివాలయ భవన నిర్మాణంపై వివాదం

ABN , First Publish Date - 2020-08-11T14:41:52+05:30 IST

గ్రామ సచివాలయ భవన నిర్మాణ స్థలం విషయమై గుడ్డిప గ్రామంలో సోమవారం..

గుడ్డిపలో సచివాలయ భవన నిర్మాణంపై వివాదం

పోలీసుల రంగం ప్రవేశంతో శాంతించిన ఇరువర్గాలు


రావికమతం(విశాఖపట్నం): గ్రామ సచివాలయ భవన నిర్మాణ స్థలం విషయమై గుడ్డిప గ్రామంలో సోమవారం ఇరువర్గాల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, తాత్కాలికంగా పనులు నిలిపి వేయించారు. గ్రామాన్ని ఆనుకొని సర్వే నంబరు 148లో 2.47 ఎకరాల భూమి (పూర్వం చెరువు)  ఉంది. ఇది పూర్తిగా పూడికపోయి వృథాగా మారింది. దీనిలో కొంత భూమి  పాఠశాలకు కేటాయించారు. ఇంకొంత  స్థలాన్ని గ్రామానికి చెందిన గీతకార్మికులకు  ప్రభుత్వమే కేటాయించింది. మరికొంత ఆక్రమణలకు గురికావడంతో రెండేళ్ల క్రితం గత ప్రభుత్వ హయంలో ఇక్కడ కల్యాణ మండపం నిర్మించాలని భావించి ఆక్రమణలు తొలగించి చదును చేయించారు.


ప్రస్తుత అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌ అడ్డూరి సత్యారావు, మాజీ ఎంపీటీసీ డి.బాలరాజు మరికొంతమంది ఈ ఖాళీ స్థలంలో సచివాలయ భవన నిర్మాణానికి సోమవారం పూనుకున్నారు. దీనిని  వ్యతిరేకిస్తూ అదే గ్రామానికి చెందిన యన్నంశెట్టి నాగరాజు, పిల్ల అచ్చిమినాయుడు, పెద్దాడ అప్పారావు తదితరులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి గ్రామంలోకి వచ్చి ఇరువర్గాలకు స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు.  మూడు రోజులపాటు ఆ స్థలంలోకి ఎవరూ వెళ్ల వద్దని చెపుతూ, ఉన్న ఆధారాలు చూపాలని ఇరువర్గాలకు సూచించారు.


Updated Date - 2020-08-11T14:41:52+05:30 IST