పత్తి రైతుల్లో గుబులు

ABN , First Publish Date - 2022-08-14T04:35:01+05:30 IST

జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రధానంగా పత్తి రైతుల గుండెల్లో గుబులు పుట్టుకుంది. జూలైలో సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షం కురిసింది.

పత్తి రైతుల్లో గుబులు
పంటలపై వేసిన ఇసుక మేటలు

- జిల్లాలో అధికంగా వర్షం పాతం నమోదు

- వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు

- ఎర్రబడుతున్న పత్తి, కంది మొక్కలు

బెజ్జూరు, ఆగస్టు 13: జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రధానంగా పత్తి రైతుల గుండెల్లో గుబులు పుట్టుకుంది. జూలైలో సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షం కురిసింది. వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలుస్తూ పత్తి, కంది పొలాల్లోని మొక్కలు వర్షపునీటికి ఎర్రబడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిసాగు చేస్తున్న రైతులకు మాత్రం వర్షం కలిసి వస్తోంది. జూన్‌లో ఆశించిన వర్షాలు కురవలేదు. మోస్తరు వర్షాలే కురిశాయి. అయితే  తర్వాత జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే అధికంగా కురవడంతో పంటలకు నష్టం వాటిల్లింది. గత మూడేళ్లలో కంటే ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదుతో పత్తిసాగు చేస్తున్న రైతులకు తీరని నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ప్రాణహిత తీరప్రాంతాల్లో తీరని నష్టం

జిల్లాలో ఈ ఏడాది అధికంగా పత్తి పంటదే సింహభాగం. ఈసారి 3,60లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగు చేశారు. సిర్పూర్‌ నియోజకవర్గంలో 42వేల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 28వేల ఎకరాలకు పైగా వర్షాలకు నీట మునిగి రైతులకు తీరని నష్టాలు మిగిల్చాయి. నియోజకవర్గంలోని బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం, చింతలమానేపల్లి, సిర్పూర్‌(టి)మండలాల సరిహద్దుల్లో ప్రాణహిత నది ప్రవహిస్తోంది. ప్రాణహిత తీరప్రాంతాల్లో ఇప్పటికే పలుమార్లు వరద నీటిలో పత్తినీట మునిగింది. ఆదిలోనే అధికంగా కురిసిన వర్షాలకు పత్తి మొలక దశలోనే రోజుల తరబడి వరదనీటిలో ఉండటంతో పూర్తిగా మురిగిపోయింది.

రెండుసార్లు విత్తుకున్న రైతులు

మొదట సాగు చేసిన పంటలు వరదనీటికి కొట్టుకపోగా తిరిగి రెండో సారి కూడా రైతులు పత్తిని విత్తుకున్నారు. అది కూడా ప్రస్తుతం కురిసిన వర్షాలకు ప్రాణహిత బ్యాక్‌వాటర్‌ చేరి నీటిలో ఉండటంతో నష్టాల పాలు చేసిందని ఆందోళన చెందుతున్నారు. మూడురోజులుగా ఆయా మండలాల సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహితనది ఉగ్రరూపం దాల్చడంతో భారీగా బ్యాక్‌వాటర్‌ పంటపొలాల్లోకి చేరింది. దీంతో ఉన్న పంట కాస్తా తుడిచి పెట్టుకపోవడంతో రైతుల్లో గుబులుపట్టుకుంది. ఇప్పటికే సాగు కోసం వేల రూపాయలు ఖర్చుచేశామని ఈసారి కనీసం పెట్టుబడులు కూడా వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు.

పత్తికి తెగుళ్ల ముప్పు 

భారీ వర్షాలకు చేలల్లో వరదనీరు నిలిచి మొక్కలు ఎర్రబారుతున్నాయి. దీంతో పత్తికి తెగుళ్లు పెరుగుతున్నాయి. రోజుల తరబడి పంటనీటిలో ఉండటంతో మొక్క దశలోనే కుళ్లిపోయి అన్నదాతలకు తీరనినష్టాలు మిగిల్చాయి.

ఊసెత్తని నష్టపరిహారం

భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రతీ ఏటా ప్రాణహిత తీరప్రాంతాల్లో  పంటలు నీటమునిగి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం మాత్రం రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదు. నామమాత్రపు సర్వేలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఇలా ఏటా తీర ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పంటలకు వరద నీటి కారణంగా నష్టాలు సంభవిస్తున్నా ప్రభుత్వం నుంచి వచ్చేది ఏమి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ హయాంలో రైతులు సాగు చేసిన పంటలకు నష్టపరిహారం వచ్చేదని ప్రస్తుతం ఎలాంటి సాయం అందడం లేదని రైతులు వాపోతున్నారు. 

30ఎకరాల్లో పత్తి సాగు చేశాను

- గెడెం శంకర్‌, రైతు, పాపనపేట

ఈ ఏడాది 30ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. భారీ వర్షాల కారణంగా ప్రాణహిత తీరప్రాంతంలో భూమి ఉండడంతో బ్యాక్‌ వాటర్‌ కారణంగా సాగు చేసిన పత్తి పలుమార్లు నీటిలో మునిగింది. రెండు సార్లు పత్తి విత్తుకున్నాను. వరదల కారణంగా రెండు సార్లూ వరద నీటిలో మునిగి పత్తి మొలక దశలోనే కుళ్లి పోయింది.

ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి

- మడప తిరుపతి, నందిగాం, పెంచికలపేట

భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరద రూపంలో సర్వం కోల్పోయాము. పెట్టుబడి కోసం లక్షలు ఖర్చు చేశాం, అధికారులు సర్వేలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు.

Updated Date - 2022-08-14T04:35:01+05:30 IST