వాన కురిసిందంటే గుబులే!

ABN , First Publish Date - 2021-07-31T05:09:08+05:30 IST

హుస్నాబాద్‌ డివిజన్‌లో ప్రధాన రహదారులపై నిర్మించిన వంతెనలు ప్రమాదకరంగా మారాయి

వాన కురిసిందంటే గుబులే!
బెజ్జంకి, బేగంపేట గ్రామాల మధ్య ప్రమాదకరంగా మారిన కల్వర్టు

 ప్రమాదకరంగా వంతెనలు..రాకపోకలకు అవస్థలు

వర్షం వస్తే బస్వాపూర్‌ వద్ద రాకపోకలు బంద్‌

ఎల్లమ్మ చెరువు మత్తడి దూకితే మరో దారే దిక్కు

శిథిలావస్థకు చేరుకున్న బెజ్జంకి, బేగంపేట కల్వర్టు

కోతకు గురైన గుగ్గిళ్ల పిల్లివాగు వంతెన 

ప్రమాదకరంగా గాంధీనగర్‌,పోతారం కల్వర్టులు

ప్రాణనష్టం జరిగినా పట్టించుకోని అధికారులు!! 


హుస్నాబాద్‌,జూలై 30: హుస్నాబాద్‌ డివిజన్‌లో ప్రధాన రహదారులపై నిర్మించిన వంతెనలు ప్రమాదకరంగా మారాయి. వర్షం వచ్చిందంటే చాలు ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజల్లో గుబులు మొదలవుతుంది. కొన్ని కల్వర్టులు శిథిలావస్థకు చేరుకోగా మరికొన్ని గుంతలతో ఇంకొన్ని కోతకు గురై ఎప్పుడు ప్రమాదం ముంచుకోస్తుందోనని ప్రజలు జంకుతున్నారు. ప్రమాదకరమైన వంతెనలతో ప్రాణ నష్టం జరిగినా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఆర్‌అండ్‌బీ రోడ్లలో వాగులపై నిర్మించిన వంతెనలు చాలాకాలం క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరుకుని చిన్నవర్షానికే రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 


 సిద్దిపేట-హన్మకొండకు రాకపోకలు బంద్‌

వర్షం కురిస్తే చాలు కోహెడ మండలం బస్వాపూర్‌ సమీపంలో సిద్దిపేట-హన్మకొండ ప్రధాన రహదారి మోయతుమ్మెద వాగుపై ఉన్న వంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోతాయి. లోలెవల్‌ వంతెన కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గతేడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు లారీతో పాటు డ్రైవర్‌ గల్లంతయ్యాడు. హైలెవల్‌ వంతెన నిర్మించాలని అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. హన్మకొండ-సిద్దిపేట రహదారిని ఇటీవలే జాతీయ రహదారిగా గుర్తించి నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు. ఈ నిర్మాణం జరిగే వరకు ఈ ఇబ్బందులు పడాల్సిందేనా..?అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. 


వాగు ప్రవహిస్తే బాహ్య ప్రపంచానికి విజయనగర కాలనీ దూరం 

రేణుకా ఎల్లమ్మ వాగు ప్రవహిస్తే కోహెడ మం డలం విజయనగరకాలనీ వాసులు బాహ్యప్రపంచానికి దూరవుతున్నారు. ఏటా వర్షాకాలంలో కనీసం మం డల కేంద్రానికి కూడా రాలేని పరిస్థితి. ఈ వాగుపై వం తెన నిర్మించాలన్న గ్రామస్తుల విన్నపం నెరవేరడం లేదు. 


బెజ్జంకిలో శిథిలావస్థకు చేరిన కల్వర్టులు

బెజ్జంకి మండలంలో పలు కల్వర్టులు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. పోతారం నుంచి బెజ్జంకి మధ్య ఉన్న రెండు కల్వర్టులు గుంతలు పడి ప్రమాదకరంగా తయారయ్యాయి. గుగ్గిళ్ల, తంగళ్లపల్లి గ్రామాల మధ్య పిల్లివాగుపై నిర్మించిన వంతెన గతేడాది వర్షాలకు కోతకు గురై నెలల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్ర శివారులోని ఊర చెరువు సమీపంలో కల్వర్టు వరద ఉధృతికి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. కల్లెపల్లి శివారులో కాజ్‌వే పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.


 మరో రూటు వెతుక్కోవాలి

హుస్నాబాద్‌ ఎల్లమ్మ చెరువు మత్తడి పడితే మాలపల్లి, బొడిగపల్లి, రామవరం వైపు వెళ్లే ప్రజలు వ్యయప్రయాసలకు ఓర్చి వేరే మార్గంలో వెళ్లాల్సిందే.  ఈ చెరువు మత్తడి వద్ద లోలెవల్‌ వంతెన కావడంతో ప్రతీ ఏటా వర్షాకాలంలో కొన్నిరోజుల పాటు రాకపోకలు నిలిచిపోతాయి. హుస్నాబాద్‌ మండలం గాంధీనగర్‌ వద్ద ఆర్‌అండ్‌బీ బ్రిడ్జి అధ్వానంగా మారింది. మద్దూరు మండలం బెక్కల్‌ నుంచి కూటిగల్‌కు వెళ్లే దారిలో కల్వర్టు కూలిపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ప్రమాదకరంగా మారిన కల్వర్టులకు నిధులు మంజూరు చేసి నూతనంగా నిర్మాణాలు చేపట్టాలని డివిజన్‌ ప్రజలు కోరుతున్నారు. 



Updated Date - 2021-07-31T05:09:08+05:30 IST