హామీల అమలేది?

ABN , First Publish Date - 2021-04-19T05:00:48+05:30 IST

ఆమనగల్లులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే

హామీల అమలేది?

  • ఆమనగల్లుకు వరాలు కురిపించిన సీఎం కేసీఆర్‌ 
  • రెండున్నరేళ్లవుతున్నా అమలుకాని పరిస్థితి
  • చొరవ చూపని ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌
  • టీఆర్‌ఎస్‌ తీరుపై విపక్షాల విమర్శలు 

ఆమనగల్లులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. హామీలు ఇచ్చి రెండున్నరేళ్లవుతున్నా.. ఒక్కటి కూడా అమలు చేయకపోవడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుకు నిదర్శనంగా మారిందని మండిపడుతున్నారు. ఎన్నికల్లో గెలిచి గట్టెక్కగానే సరిపోదని.. హామీల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. హామీల అమలుకు అధికార పార్టీ నేతలూ చొరవ తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


ఆమనగల్లు : ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీలు గుప్పిచ్చి నేటికి రెండున్నర ఏళ్లయినా అమలుకు నోచుకోలేదు. ఆమనగల్లుకు కేసీఆర్‌ కురిపించిన వరాల జల్లు ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చినప్పటికీ, అవి అమలుకు నోచుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యమంత్రి హామీల అమలుకు దిక్కు లేకుండా పోయిందని విపక్షాలు విమర్శలు సందిస్తున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా కేసీఆర్‌ను, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌లపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్‌ హామీల అమలుకు అధికార పార్టీ నేతలు కూడా చొరవ తీసుకోక పోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలను ఆ పార్టీ స్థానిక అగ్రనేతలు ఆయన దృష్టికి తీసుకుపోతే పరిష్కారం కాకుండా పోతాయా అని ప్రజలు అభిప్రాయప డుతున్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్య తిరిగే స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సీఎం ఇచ్చిన హామీల అమలుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 


సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఇవే..

 2018 నవంబర్‌ 27న శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమనగల్లులో టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా అప్పటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ వివిధ సమస్యలను కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోయారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ఆమనగల్లుకు వరాలు కురిపిం చారు. జైపాల్‌ యాదవ్‌ ను గెలిపిస్తే 30 పడకల ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 150 పడకలకు పెంచుతామని, ఆమన గల్లు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు సొంత భవనం నిర్మిస్తామని, పాలి టెక్నిక్‌, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, ఆమనగల్లు నూతన మున్సిపాలిటీకి కావాల్సిన నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అదేవిధంగా బీడు భూములకు సాగునీరందించి రైతుల కలలు సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. 


రెండున్నరేళ్లు గడుస్తున్నా...

ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు, పిలుపుతో టీఆర్‌ఎ్‌స్‌కు ప్రయోజనం చేకూరి ఎమ్మెల్యేగా జైపాల్‌యాదవ్‌ను గెలిపించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలవుతాయని, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారు. రెండున్నరేళ్లు గడిచినా కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అలాగే మిగిలాయి. ఇతర నియోజకవర్గాల అభివృద్ధికి కేసీఆర్‌ పెద్దఎత్తున తోడ్పాటునందిస్తుంటే కల్వకుర్తి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై అనేక విమర్శలకు తావిస్తోంది. 


సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు

ముఖ్యమంత్రి హామీల అమలుపై ఆమనగల్లు పట్టణంలో సోషల్‌ మీడియా వేదికగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సభలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమనగల్లుకు ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ సీఎం హామీల అమలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమనగల్లు అభివృద్ధికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, అధికార పార్టీ నేతలు వివక్ష చూపుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయినా అధికార పార్టీలో ఎలాంటి స్పందన లేకపోవడం ఆ పార్టీ నేతల దైన్య స్థితిని, ఏమి చేయలేని నిస్సహయతను బహిర్గత పరుస్తుంది. 


ముఖ్యమంత్రి హామీలను అమలు చేయాలి

ఆమనగల్లు లో ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల సమ యంలో ఆమనగల్లుకు ఎన్నో చేస్తామని కేసీఆర్‌తో సహా ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ అనేక హామీలు ఇచ్చారు. రెండు న్నరేళ్లు గడిచింది. అయినా ఏ ఒక్కటి అమలు చేయకపోవడం ప్రజలను మోసగించడమే. హామీలు నిల బెట్టుకోకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడుతాం.

- చెక్కాల లక్ష్మణ్‌, కౌన్సిలర్‌, ఆమనగల్లు మున్సిపాలిటీ


హామీల అమలుకు ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి

స్వయాన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు కూడ అమలుకు నోచుకోక పోవడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఆమనగల్లు అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడింది. కేసీఆర్‌ హామీల అమలు విషయంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ చొరవ తీసుకోవాలి. రాజకీయ లబ్ధికి వరాలు కురిపించి వాటిని అమలు చేయకపోవడం విచారకరం. హామీలను అమలుపరచకపోతే టీఆర్‌ఎస్‌ నేతలు ప్రజాగ్రహానికి గురికాకతప్పదు. అభివృద్ధి విషయంలో రాజకీయకోణంలో చూడొద్దు.

- మండ్లీ రాములు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌- ఆమనగల్లు 


హామీల అమలుకు చర్యలు

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుంది. ఆయా అభి వృద్ధి పనుల నిర్వహణకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ జూనియర్‌ కళా శాలకు వచ్చే విద్యాసంవత్సరం నాటికి భవన నిర్మాణం చేపడుతాం. ప్రభుత్వ ఆసుపత్రిని 150 పడకల పెంపునకు, కళాశాలల ఏర్పాటు గురించి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోయారు. త్వరలోనే ఆయా హామీలు అమలవుతాయి.

- అనురాధపత్యనాయక్‌, జడ్పీటీసీ - ఆమనగల్లు 

Updated Date - 2021-04-19T05:00:48+05:30 IST