హామీల వంచన!

ABN , First Publish Date - 2022-01-18T06:23:48+05:30 IST

కర్ర రైతు సమస్య రోజురోజుకూ జటిలమవుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర ఇస్తామన్న హామీని జగన్‌ సర్కారు గాలికొదిలేసింది.

హామీల వంచన!

కర్ర రైతులను పట్టించుకోని ప్రభుత్వం 

మొత్తం సాగులో జిల్లా వాటా 45 శాతం

నానాటికీ దిగజారుతున్న జామాయిల్‌, సుబాబుల్‌ ధరలు

అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు

ఇటీవలే తాడేపల్లికి వెళ్లి నిరసన తెలిపిన రైతు సంఘాలు

అయినా స్పందించని సర్కారు, అధికారులు

కర్ర రైతు కష్టాలు రెట్టింపవుతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారిపోతోంది. కొనేవారు కనిపించక, వచ్చినకాడికి తెగనమ్మలేక అల్లాడుతున్నారు. అధికారంలోకి రాగానే టన్నుకు రూ.5వేలు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆ హామీకి కొనసాగింపుగా జామాయిల్‌, సుబాబుల్‌ రైతుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆశించిన ధర లేక కర్ర రైతులు నష్టపోతున్నారని, కొన్ని పరిశ్రమలు ట్రేడర్లతో కుమ్మక్కై అన్నదాతలను వంచిస్తున్నా యని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. అవసరమైతే ప్రభుత్వమే కర్రను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కూడా మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. ఉపసంఘం ఏర్పాటు చేయడం, అది నివేదిక ఇవ్వడం ఇదంతా ఏడాది కిందటి మాట. ప్రస్తుతం ఇస్తామన్న ధరా లేదు... ఉపసంఘం నివేదిక ఏమైందో తెలియదు... కానీ కర్ర రైతు సమస్య మాత్రం తీరలేదు. టన్నుకు కనీసం రూ.1200 కూడా చేతికి రాక రైతులు నానాటికీ అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. సర్కారు ఆదుకుంటుందన్న  నమ్మకం  కూడా సన్నగిల్లింది. 

ఒంగోలు(జడ్పీ), జనవరి 17: కర్ర రైతు సమస్య రోజురోజుకూ జటిలమవుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర ఇస్తామన్న హామీని జగన్‌ సర్కారు గాలికొదిలేసింది. కనీసం మంత్రివర్గ ఉపసంఘం నివేదికను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. దీంతో కంపెనీలు చెప్పిందే తూకం, ఇచ్చిందే ధర అన్నట్లు పరిస్థితి తయారైంది. చివరకు కర్రను కొనాలన్నా సిఫార్సులు చేయించాల్సిన పరిస్థితి. పక్క జిల్లాకు చెందిన ఒకే ఒక్క కాంట్రాక్టరు స్థానికంగా కొనుగోళ్ల విషయంలో చక్రం తిప్పుతున్నాడు. దీంతో కంపెనీలు ఇచ్చేదే అరకొర అయితే మధ్యలో అతని పెత్తనంతో రైతుకు దక్కేది మరింత దిగజారిపోతోంది. దీంతో కర్ర రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రవ్యాప్తంగా సాగయ్యే జామాయిల్‌, సుబాబుల్‌ విస్తీర్ణంలో జిల్లా వాటానే 45శాతం దాకా  గతంలో ఉండేది. దీనిని బట్టి ఇక్కడ రైతాంగం కర్ర సాగుపై ఎంత ఆధారపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మూడేళ్లుగా కర్ర కొనుగోళ్లు లేవు. ఉన్నా అది అరకొరనే. పైగా గత ప్రభుత్వ హ యాంలో చేసుకున్న ఒప్పంద ధరను కంపెనీలు అమలు చేయడం లేదు. గట్టి మాట్లాడితే కొనుగోళ్లు నిలిపే స్తున్నారు. అధికా రులు చోద్యం చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం చేసేది లేక చివరి ప్రయత్నంగా తమ కష్టా లను ముఖ్యమంత్రికి విన్నవించుకోవాలని జవనరి 10న విజ్ఞాపన యాత్ర పేరుతో తాడేపల్లికి తరలివెళ్లారు. దా నిని మధ్యలోనే పోలీసులు భగ్నం చేశారు. అయితే నా డు ప్రతిపక్ష నేతగా జగన్‌ కర్ర రైతులకు ఇచ్చిన హామీ లను నెరవేర్చే వరకు తమ పోరాటాన్ని వివిధ రూపా ల్లో కొనసాగిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి.


ఒప్పంద ధరల మాటే  మరచిన సర్కారు

గత ప్రభుత్వం టన్ను జామాయిల్‌కు రూ.4,400, సుబాబుల్‌కు రూ.4,200 ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అప్పట్లో కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదిరాయి. క్రమేణా ఆ ఒప్పందాలకు కంపెనీలు తూట్లు పొడుస్తూ దళారీల ద్వారా అతి తక్కువ ధరకే కర్రను కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా వంచించడం ప్రారంభించాయి.  ప్రస్తుతం టన్నుకు రూ.1200 కూడా చేతికి రావడం లేదని, వాటిని తొలగించి వేరే పంట సాగు చేద్దామన్నా కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కాని స్థితిలో ఉన్నామని కర్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అధికారంలోకి వస్తే రూ.5వేలు ఇస్తామన్న హామీ హుళక్కి

తాము అధికారంలోకి వస్తే టన్నుకు రూ.5వేలు ధర వచ్చేలా చూస్తామని నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నమ్మబలికారని, ప్రస్తుతం టన్నుకు రూ.1200కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ కమిటీల ద్వారా కొనుగోలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం చెప్పిందని అవేవీ ఆచరణలోకి రాకపోగా ధర సైతం గతంలో ఎన్నడూ లేనంత దిగువకు పడిపోయిందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.


గతంలో భారీగా సాగు

రాష్ట్రవ్యాప్తంగా సాగయ్యే విస్తీర్ణంలో జిల్లా వాటానే 45శాతం దాకా గతంలో ఉండేది. దాదాపు మూడు లక్షల ఎకరాల్లో ఇంతకుముందు కర్ర సాగును జిల్లా రైతాంగం చేపట్టేది. కానీ ప్రస్తుతం అది లక్షన్నర ఎకరా లకు పడిపోయింది. చీమకుర్తి, అద్దంకి, కందుకూరు, సంతనూతలపాడు తదితర ప్రాంతాల్లో ఎర్ర నేలలు అధికంగా ఉండటంతో అక్కడి రైతాంగం ఎక్కువగా జామాయిల్‌ సాగును, నల్లరేగడి భూముల్లో అధికంగా సుబాబుల్‌ సాగును రైతులు చేపడుతూ వస్తున్నారు.


గత ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమ సైతం వెనక్కి

గుడ్లూరు మండలం చేవూరు సమీపంలో పేపర్‌ పరిశ్రమ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కొన్ని అడుగులు వేసింది. ప్రభుత్వం మారగానే భూకేటాయింపుల విషయంలో ఏర్పడిన సమస్యల మూలంగా ఆ పరిశ్రమ వెనక్కి వెళ్లిపోయింది. ఆ పరిశ్రమ ఏర్పాటు పూర్తయినా తమకు ఎంతోకొంత మేలు జరిగే ఉండేదని కర్ర రైతులు అంటున్నారు.


కంపెనీలే మోసానికి పాల్పడుతున్నాయి

పేపర్‌ కంపెనీలే రైతులను నిలువునా వంచిస్తున్నా యని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయు. పేపర్‌ ధర మాత్రంపైకి ఎగబాకుతుంటే దానికి ఉపయోగించే ముడిసరుకు అయిన కర్ర ధర మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారైంది. దీని వెనక కంపెనీల గత్తాధిపత్యమే కారణమని రైతుసంఘాలు విమర్శిస్తున్నాయి. క్రయవిక్రయాలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో దళారులను అడ్డం పెట్టుకుని తాము చెప్పిందే ధరగా చెలామణి చేస్తూ రైతుల ప్రయోజనాలకు కంపెనీలు పాతరేస్తున్నాయని వివిధ సంఘాలు మండిపడుతున్నాయి.



Updated Date - 2022-01-18T06:23:48+05:30 IST