హామీలు కొండంత.. అమలు గోరంత

ABN , First Publish Date - 2022-08-15T05:42:59+05:30 IST

హామీలు కొండంత.. అమలు గోరంత

హామీలు కొండంత.. అమలు గోరంత
25-11-2018లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎంకు నర్సింగ్‌, మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని రాతపూర్వకంగా విన్నవిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి (ఫైల్‌)

  • 2014, 2018లో తాండూరులో సీఎం ఇచ్చిన హామీలేమయ్యాయి?
  • మెడికల్‌, నర్సింగ్‌, ఎంబీఏ  కళాశాలల ఏర్పాటు ఎక్కడ? 
  • కంది బోర్డు ఏర్పాటు, నాపరాయిపై రాయల్టీ తగ్గింపు ఊసేలేదు..
  • నత్తనడకన బైపాస్‌ రోడ్డు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం 
  • రేపు సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా హామీలపై స్పందించేనా!

తాండూరు, ఆగస్టు 14 : సీఎం కేసీఆర్‌ 2014, 2018 ఎన్నికల సమయంలో తాండూరుకు వచ్చి కొండంత హామీలిచ్చినప్పటికీ గోరంత అమలు కూడా జరగలేదు. మొట్టమొదటగా 2014లో గులాబి దళాధిపతిగా తాండూరుకు వచ్చిన కేసీఆర్‌.. తాండూరులో ఆరు ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు కందిపప్పు అంటే తాను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తానని, కందిపప్పుకు ప్రాధాన్యత కల్పించేందుకు ఈ ప్రాంతంలో కంది పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కర్ణాటక నాపరాయి రాయల్టీ విషయంలో మన రాష్ట్రం కంటే రూపాయి తక్కువ ఉందని, తాండూరు నాపరాయి వ్యాపారం గట్టెక్కించేందుకు కర్ణాటక కంటే రూపాయి రాయల్టీ తగ్గిస్తానని హామీ ఇచ్చారు. పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు పాలమురు ఎత్తిపోతల పథకాన్ని తెస్తానని, గీతా కార్మికుల సొసైటీని పునరుద్ధరిస్తానని చెప్పగా.. ఆ హామీలు అమలు కాలేదు. తాండూరులో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామని హామీ ఇచ్చారు. ఇందులో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం మాత్రం కొనసాగుతుండగా, మిగతా హామీలకు మాత్రం మోక్షం లభించలేదు. అదేవిధంగా 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన కేసీఆర్‌కు ఎన్నికల బహిరంగ సభలో తాండూరులో మెడికల్‌, నర్సింగ్‌, ఎంబీఏ కళాశాలలు ఏర్పాటు చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి రాతపూర్వకంగా విన్నవించారు. ఇందుకు సీఎం స్పందిస్తూ.. మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, వికారాబాద్‌కు మాత్రమే మెడికల్‌ కళాశాల మంజూరుచేసి తాండూరుకు మొండిచెయ్యి చూపించారు.  అదే సమయంలో తాండూరులో ఏడాది లోపు నాపరాతి పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇటీవల స్థల కేటాయింపునకు క్యాబినెట్‌లో ఆమోదం తెలిపారు. తాండూరులో రూ.100కోట్లతో బైపాస్‌ రోడ్డు హామీ ఇవ్వగా, ప్రస్తుతం ఆ రోడ్డు పనులు ప్రారంభమై నత్తనడకన కొనసాగుతున్నాయి. కాగా, రేపు సీఎం కేసీఆర్‌ జిల్లాకు వస్తుండటంతో హామీలపై ఏం మాట్లాడతారోనని జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2022-08-15T05:42:59+05:30 IST