చేనేతపై జీఎస్టీ పిడుగు

ABN , First Publish Date - 2021-12-13T05:43:57+05:30 IST

చేనేత రంగంపై కరోనా రెండేళ్లుగా తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగమైన చేనేత వృత్తిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆ చేనేత వృత్తి ప్రస్తుత పరిస్థితుల్లో పస్తులుంచుతోంది. కోవిడ్‌ ధాటికి వస్త్ర దుకాణాలు మూతపడి, ఉన్న ఉత్పత్తులు విక్రయించుకోలేక ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.300కోట్ల విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి.

చేనేతపై జీఎస్టీ పిడుగు

రెండేళ్లుగా ‘కరోనా’తో కొనసాగని వ్యాపారాలు

ఉమ్మడి జిల్లాలో పేరుకుపోతున్న వస్త్ర నిల్వలు

పని కల్పించలేని స్థితిలో మాస్టర్‌ వీవర్లు 

పనులు లేక పస్తులుంటున్న చేనేత కార్మికులు 


చేనేత రంగంపై కరోనా రెండేళ్లుగా తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగమైన చేనేత వృత్తిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆ చేనేత వృత్తి ప్రస్తుత పరిస్థితుల్లో పస్తులుంచుతోంది. కోవిడ్‌ ధాటికి వస్త్ర దుకాణాలు మూతపడి, ఉన్న ఉత్పత్తులు విక్రయించుకోలేక ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.300కోట్ల విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. మాస్టర్‌ వీవర్ల నుంచి కొనుగోలు చేసిన చీరలకు వస్త్ర వ్యాపారులు డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే కొంత ఉపశమనం కలిగి కరోనా నుంచి తేరుకుని రిటైల్‌ అమ్మకాలతో వ్యాపారాలు సాగిస్తున్న చేనేత వస్త్ర వ్యాపారులపై జీఎస్టీ పిడుగు పడనుంది. చేనేత వస్త్రాలపై ఐదు నుంచి 12 శాతం జీఎస్టీని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని, దీంతో చేనేత వస్త్ర పరిశ్రమ కునారిల్లే ప్రమాదం పొంచి ఉందని కార్మికులు, చేనేత నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 12 : టైఅండ్‌డై చేనేత ఇక్కత్‌ వస్త్రాల తయారీ కేంద్రంగా పోచంపల్లి పేరొందింది. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత అతి పెద్దరంగంగా నేతన్నల కడుపు నింపుతోంది. కాగా, ఈ రంగానికి నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకత పాటించకపోవడంతో కుదేలవుతోంది. గత ఐదేళ్లుగా ప్రభుత్వం చేనేత రంగానికి రూ.300కోట్ల పైచిలుకు కేటాయించగా, ఇందులో 95శాతం పవర్‌లూమ్‌ పరిశ్రమలకే మళ్లుతున్నాయి. అదికూడా మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పరిధిలోని పవర్‌లూమ్‌ పరిశ్రమకు బతుకమ్మ చీరల పేరుతో కేటాయింపు చేస్తున్నారు. దీంతో హ్యాండ్లూమ్‌ పరిశ్రమకు సహకారం లేక నష్టాల్లో కూరుకుపోతోంది. ఇదిలా ఉండగా, కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో చేనేత కార్మికులకు పనులేక పస్తులున్నారు. అదేవిధంగా చేనేత సహకార సంఘాల్లో పేరుకుపోయిన వందల కోట్ల వస్త్ర నిల్వలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కో కొనుగోలు చేయకపోవడంతో సంఘాలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఓ వైపు పనిలేక పస్తులుంటున్న చేనేత కార్మికులను మరో పిడుగులాంటి వార్త కలచివేస్తోంది. సహకారేతర రంగంలోని చేనేత కార్మికుల పరిస్థితి కరోనా దెబ్బకు కుదేలవుతున్న పరిస్థితిలో చేనేత వస్త్ర వ్యాపారంపై ఐదు నుంచి 12శాతం జీఎస్టీని విధించేందుకు రంగం సిద్ధమైంది. దీంతో చేనేత పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ..

ఉమ్మడి జిల్లాలో సహకార, సహకారేతర రంగంలోని పెద్దసంఖ్యలో చేనేత కార్మికులు మగ్గాలపై జీవనం సాగిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో సుమారు 5వేల మగ్గాలున్నాయి. అనుబంధంగా 11వేల మందికిపైగా నేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 1918 మగ్గాలుండగా, వీటిపై ఆధారపడి 5000మంది కార్మికులు, సూర్యాపేట జిల్లాలో 60 మగ్గాలుండగా, 150 మంది మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం 16,150 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. సహకారేతర రంగంలో మరో 10వేల మందికి పైగా చేనేత కార్మికులు అతి భారంగా బతుకులీడుస్తున్నారు.


పేరుకుపోతున్న వస్త్ర నిల్వలు 

యాదాద్రి జిల్లాలో పోచంపల్లితోపాటు చేనేత కేంద్రాల్లో మొత్తం రూ.200కోట్లకు పైగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.300కోట్లకు పైగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ షాపింగ్‌ కాంప్లెక్స్‌తోపాటు పట్టణంలో 100కు పైగా చేనేత పట్టు వస్త్రాల దుకాణాలున్నాయి. మాస్టర్‌ వీవర్స్‌ వద్ద, ప్రైవేటు దుకాణాల్లో మరో రూ.70కోట్ల మేర వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. చేనేత సహకార సంఘాల్లో రూ.100కోట్లకు పైగా వస్త్ర నిల్వలు ఉన్నాయి. టైఅండ్‌డై అసోసియేషన్‌ పరిధిలో పోచంపల్లిలో, కొత్తపేట పీవీటీ మార్కెట్‌లో 180 దుకాణాలు ఉండగా, ఇక్కడ రూ.90 కోట్ల నిల్వలు ఉన్నాయి. కొయ్యలగూడెం, సిరిపురం, వెల్లంకి, గట్టుప్పల్‌, పుట్టపాక, ఆలేరు, గుండాల తదితర ప్రాంతాల్లో సుమారు రూ.70కోట్లు, సహకార సంఘాల్లో రూ.20కోట్లకు పైగా వస్త్ర నిల్వలు ఉన్నాయి. ఓ వైపు మార్కెట్‌ లేక మరోవైపు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ భారాన్ని విధించడం తగదని చేనేత కార్మికులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


నూలు ధరలపై నియంత్రణ  ఏదీ?

 కరోనాతో చైనా నుంచి నూలు ముడి సరుకు దిగుమతి నిలిచింది. దీంతో బెంగుళూరు కేంద్రం గా సరఫరా అయ్యే నూలుకు డిమాండ్‌ పెరిగి ధర రెట్టింపైంది. గతంలో కిలో పట్టు వార్పు రూ.3,200 ఉండగా, ప్రస్తుతం రూ.5,000కు పెరిగింది. గతంలో వెప్ట్‌ కిలో రూ.3,500 ఉండగా, రూ.5,350కు వరకు చేరింది. సిల్కు యారన్‌తోపాటు రంగులు, రసాయనాల ధరలు విపరీతం గా పెరిగాయి. వార్పు (7 చీరలకు) రూ.15వేల వరకు ధర పెరిగింది. ముందుగా డబ్బు చెల్లిస్తేనే యారన్‌ సరఫరా చేస్తున్నారు. దీంతో మాస్టర్‌ వీవర్లపై పెనుభారం పడింది. పెరిగిన నూలు ధరలకు అనుగుణంగా చీరల ధరలు పెంచితే మార్కెట్లో కొనుగోలుదారులు వస్త్రాలను కొనలేని పరిస్థితి. గతంలో విక్రయించిన వాటికి డబ్బు రాకపోవడంతో మాస్టర్‌ వీవర్స్‌ కార్మికులకు పనికల్పించలేకపోతున్నారు. ప్రభుత్వం చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు నూలు ధరలను నియంత్రించాలని వ్యాపారులు కోరుతున్నారు.


మగ్గాలపై 100 కుటుంబాలు ఆధారపడ్డాయి : రాపోలు శ్రీనివాస్‌, మగ్గాల యజమాని

నేను 20ఏళ్లుగా మగ్గాలు నేయిస్తున్నా. నా వద్ద 60 మగ్గాలపై కూలీలు నేస్తున్నారు. మొత్తం 100 కుటుంబాలు, సుమారు 250 మంది కార్మికులు జీవనం సాగిస్తున్నాయి. రెండేళ్లుగా కరోనాతోపాటు వస్త్ర వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సుమారు రూ.50లక్షలకు పైగా వస్త్రాలు పేరుకుపోయాయి. దీంతో మగ్గాలు బందు పెట్టాం. కార్మికులకు పని లేదు. సిల్కు యారన్‌ ఇచ్చిన యజమానులు డబ్బు కోసం ప్రశ్నిస్తున్నారు. పెరిగిన నూలు, రంగులు, రసాయనాలతో వస్త్ర తయారీ భారంగా మారింది. ప్రభుత్వం తక్షణమే వస్త్ర నిల్వలు కొనుగోలు చేసి ఆదుకోవాలి. 


జీఎస్టీ ఎత్తివేసి జీవనభృతి కల్పించాలి : తడక రమేష్‌, పోచంపల్లి టైఅండ్‌డై అసోసియేషన్‌ అధ్యక్షుడు 

కరోనాతోపాటు పలు కారణాలతో పనులు లేక నష్టపోతున్న నిరుపేద చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ప్రతి నెల రూ.10వేల చొప్పున జీవనభృతి చెల్లించాలి. ప్రస్తుతం మార్కెట్లో పేరుకుపోయిన వస్త్రాలను ప్రభుత్వం వెంటనే టెస్కో ద్వారా ఖరీదు చేయాలి. దీంతో మార్కెట్‌ తిరిగి పుంజుకుంటుంది. మాస్టర్‌ వీవర్స్‌ను, ఇటు వస్త్ర వ్యాపారులతోపాటు కార్మికులను ఆదుకునే చర్యలు తీసుకోవాలి. చేనేత వ్యాపారంపై జీఎస్టీని ఎత్తివేయాలి.


సంక్షోభంలో ఉన్న చేనేతను ఆదుకోవాలి : తడక యాదగిరి, ఆలిండియా హ్యాండ్లూమ్‌బోర్డు మాజీ డైరెక్టర్‌ 

ప్రభుత్వాలు చేనేత రంగంలోని హ్యాండ్లూమ్‌ పరిశ్రమను నిర్లక్ష్యం చేయడం శ్రేయస్కరం కాదు. ఇప్పటికే కరోనా తొలి, రెండో దశల నేపథ్యంలో లాక్‌డౌన్‌తో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కరోనా కారణంగా నష్టపోతున్న హ్యాండ్లూమ్‌ పరిశ్రమను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆదుకోవాలి. వస్త్ర నిల్వలను ఈసారి ప్రభుత్వం ఖరీదు చేస్తేనే పరిశ్రమకు జీవనం పోసినట్లు అవుతుంది. నేరుగా చేనేత కార్మికులకు 40శాతం యారన్‌ సబ్సిడీ అందించి, కార్మికులకు జీవనభృతి ఇవ్వాలి. చేనేత రంగంపై జీఎస్టీ భారం వేయకూడదు. చేనేత రంగాన్ని పరిరక్షించాల్సిన బాఽధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.


Updated Date - 2021-12-13T05:43:57+05:30 IST