నిత్యావసరాలపై జీఎస్టీ మోత

ABN , First Publish Date - 2022-07-04T07:03:05+05:30 IST

సామాన్యుడికి ఊరట కలిగించేలా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై సానుకూల నిర్ణయం వెలువడుతుందనుకుంటే, అది చర్చకు రాకపోగా కొత్త వాటిపై పన్ను విధింపు, ఉన్న వాటిపై పెంచుతూ తీసుకున్న నిర్ణయాలు షాక్‌ను ఇచ్చాయి. వీటివల్ల ప్రజలపై భారం పడుతుంది.

నిత్యావసరాలపై జీఎస్టీ మోత

  • పెరుగు.. మజ్జిగ.. అప్పడాలు.. గోధుమపిండి
  • దేన్నీ వదలలేదు.. జీఎస్టీ బాదుడు
  • ప్యాక్‌ చేసి లేబుల్‌ వేస్తే 5శాతం పన్ను వాత
  • కత్తులు, షార్ప్‌నర్లకు 18శాతం ట్యాక్స్‌
  • ప్రజలపై పెనుభారం

ప్రజలు నిత్యం వినియోగించే పెరుగు, మజ్జిగ, అప్పడాలు, గోధుమపిండి తదితరాలు.. ఇలా దేన్నీ వదలలేదు.. పన్ను మోత మోగించారు.. ఏదొక అవసరం నిమిత్తం వినియోగించే కత్తులు.. విద్యార్థులు ఉపయోగించే షార్పెనర్లు.. ప్రతి ఇంటిలో కనిపించే ఎల్‌ఈడీ లైట్లు వంటి వాటిపై పన్నును పెంచారు.. కొత్తగా పన్నుల విధింపు, పెంపు నిర్ణయాలతో ప్రజలపై పెనుభారం పడనుంది.

పిఠాపురం, జూలై 3: సామాన్యుడికి ఊరట కలిగించేలా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై సానుకూల నిర్ణయం వెలువడుతుందనుకుంటే, అది చర్చకు రాకపోగా కొత్త వాటిపై పన్ను విధింపు, ఉన్న వాటిపై పెంచుతూ తీసుకున్న నిర్ణయాలు షాక్‌ను ఇచ్చాయి. వీటివల్ల ప్రజలపై భారం పడుతుంది. మరిన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి పన్ను ఆదాయాన్ని మరింత పెంచుకునే లక్ష్యంగా జీఎస్టీ మండలి నిర్ణయాలు తీసుకుంది. దీనిలోభాగంగా ప్యాకింగ్‌ చేసి లేబుల్‌ వేసే పెరుగు, మజ్జిగ, అప్పడాలు, గోధుమపిండి, గోధుమలు, పన్నీరు, బార్లీ, ఓట్స్‌, చేపలు, మాంసం, తేనె, ఎండు చిక్కుళ్లు-మఖానా, మొక్కజొన్న తదితర వస్తువులపై కొత్తగా 5శాతం పన్ను విధించారు. ప్యాక్‌ చేయని అన్‌బ్రాండెడ్‌, లేబుల్‌ వేయని ఉత్పత్తులకు మాత్రం జీఎస్టీనుంచి మినహాయింపు ఉంటుంది. మార్కెట్‌లో లభించే పెరుగు, మజ్జిగ, పన్నీరు, ఓట్స్‌, గోధుమపిండి, అప్పడాలు అన్ని బ్రాండ్‌ పేర్లతో ప్యాక్‌ చేసి వస్తున్న నేపథ్యంలో అన్నింటిపై ప్రజలు 5శాతం పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కత్తులు, కటింగ్‌బ్లేడ్లు, విద్యార్థులు వినియోగించే షార్ప్‌నర్లపై 18శాతం పన్ను విధించారు.


కాంట్రాక్టు పనులకు తప్పనిపోటు

రోడ్లు, వంతెనలు, రైల్వేలు, మెట్రో, శ్మశానవాటికలు తదితర కాంట్రాక్టు పనులపై ప్రస్తుతం ఉన్న 12శాతం జీఎస్టీని 18శాతానికి పెంచారు. చెక్కులు జారీ చేసినందుకు బ్యాంకులు వసూలు చేసే చార్జీలపై 18శాతం జీఎస్టీగా చెల్లించాల్సి ఉంటుంది. చెప్పులు, తోలు ఉత్పత్తుల తయారీ జాబ్‌వర్క్‌లపై 5శాతం ఉన్న పన్నును 12శాతానికి పెంచారు. ఫలితంగా చెప్పుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు పెరిగిన కరెంటు చార్జీలతో ప్రజలు ఎక్కువగా సోలార్‌ వాటర్‌ హీటర్లపై మొగ్గుచూపుతున్నారు. ఈ తరుణంలో సోలార్‌ వాటర్‌ హీటింగ్‌ సిస్టంపై ఉన్న ఉన్న పన్నును 5 నుంచి 12శాతానికి పెంచారు. దీనివల్ల వీటి ఉత్పత్తుల విక్రయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎల్‌ఈడీ లైట్లు, ఫిక్సర్‌, వాటికి వినియోగించే మెటల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులపై పన్నును 12నుంచి 18శాతానికి పెంచారు. కట్‌ అండ్‌ ఫాలిషిడ్‌ వజ్రాలపై పన్ను 0.25శాతం నుంచి 1.5శాతానికి పెరిగింది. వ్యాపార సంస్థలకు ఇచ్చే నివాసాలకు జీఎస్టీ వర్తిస్తుంది. ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏ, సెబీ వంటి నియంత్రణ సంస్థల సేవలపై పన్ను విధిస్తారు. 



కొంత ఊరట

ఆర్థోపెడిక్‌ ఉపకరణాల పన్ను రేటును 12నుంచి 5శాతానికి, రోప్‌వేల ద్వారా ప్రయాణికులు, సరుకు చేరవేత సేవలపై ఉన్న పన్నును 18 నుంచి 5శాతానికి, ట్రక్కులు, సరుకు రవాణా అద్దెలపై పన్నును 18 నుంచి 12శాతానికి తగ్గించారు. పెంచిన పన్నుల భారంతో పోల్చుకుంటే ఇది అతి స్వల్పమేనని చెబుతున్నారు. పెట్రోలు, డీజిల్‌ తదితరాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు ఊరటనిస్తారని అందరూ ఆశించగా దానిపై చర్చ జరగకపోవడం ప్రజలకు నిరాశనే మిగిల్చింది. జీఎస్టీ పరిధిలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గణనీయంగా తగ్గుతాయి. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా కొత్తగా మరిన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో మరింత భారం మోపినట్లయింది.

Updated Date - 2022-07-04T07:03:05+05:30 IST