వ్యాపారం తగ్గితే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకోవచ్చా ?

ABN , First Publish Date - 2020-06-07T05:57:23+05:30 IST

జీఎస్‌టీలో రిజిస్ట్రేషన్‌ తీసుకోవటానికి సాధారణంగా టర్నోవర్‌ రూ.20 లక్షలుగా చెప్పుకున్నాం. ఈ విధంగా రిజిస్ట్రేషన్‌ తీసుకున్న తర్వాత వ్యాపారం పడిపోతే అంటే టర్నోవర్‌ రూ.20 లక్షల కంటే తగ్గితే ...

వ్యాపారం తగ్గితే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకోవచ్చా ?

జీఎస్‌టీలో రిజిస్ట్రేషన్‌ తీసుకోవటానికి సాధారణంగా టర్నోవర్‌ రూ.20 లక్షలుగా చెప్పుకున్నాం. ఈ విధంగా రిజిస్ట్రేషన్‌ తీసుకున్న తర్వాత వ్యాపారం పడిపోతే అంటే టర్నోవర్‌ రూ.20 లక్షల కంటే తగ్గితే రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకోవచ్చా? లేదా కచ్చితంగా కొనసాగించాలా ? అనే సందేహం... అనేక మంది వ్యాపారుల్లో ముఖ్యంగా చిరు, మధ్య తరహా వ్యాపారాలు నిర్వహించే వ్యక్తుల్లో ఉంది. అలాగే రిజిస్ట్రేషన్‌ పొందిన వ్యక్తి ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు రిజిస్ట్రేషన్లు రద్దవుతుంటాయి. దీనికి కారణమేమిటి? మొదలైన విషయాలు మీ కోసం...


జీఎస్‌టీలో సాధారణ రిజిస్ట్రేషన్‌ తీసుకోవటానికి టర్నోవర్‌ పరిమితి రూ.20 లక్షలు. అయితే, కేవలం వస్తు సరఫరా మాత్రమే చేస్తుంటే.. అంటే సర్వీస్‌ కాకుండా ట్రేడింగ్‌ మాత్రమే చేస్తుంటే ఆ పరిమితి (లిమిట్‌)ని రూ.40 లక్షలకు పెంచే అధికారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్‌టీ మండలి కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విధానాన్ని ఆమోదించగా తెలంగాణలో మాత్రం ఇంకా పాత విధానమే కొనసాగుతోంది. అలాగే టర్నోవర్‌తో సంబంధం లేకుండా కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ తీసుకోవాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు అంతఃరాష్ట్ర సరఫరా చేస్తున్నా, రివర్స్‌ చార్జ్‌ మెకానిజంలో పన్ను చెల్లించాల్సి ఉన్నటువంటి మొదలైన సందర్భాల్లో టర్నోవర్‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది.


ఏదిఏమైనా ఒకసారి రిజిస్ట్రేషన్‌ పొందిన తర్వాత తనకు నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని భావిస్తే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ రద్దు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అప్పటి వరకు చెల్లించవలసిన పన్నులు చెల్లించటం, రిటర్నులు దాఖలు చేయటం తప్పనిసరి. ఒకవేళ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకుని ఉంటే నిబంధనల ప్రకారం మిగిలిన సరుకు లేదా యంత్ర సామాగ్రికి సంబంధించిన క్రెడిట్‌ను రివర్స్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్‌ రద్దు అయిన మూడు నెలలలోపు ఫైనల్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయటం తప్పనిసరి. 


ఇక, ఒక్కొక్కసారి వ్యాపారుల ప్రమేయం లేకుండానే అధికారులు వారి రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. ముఖ్య కారణం మాత్రం సదరు వ్యాపారి ఆరు నెలల పాటు రిటర్నులు దాఖలు చేయకపోవటం. ఇలాంటప్పుడు వెంటనే దాఖలు చేయాల్సిన రిటర్నులను దాఖలు చేసి చెల్లించాల్సిన పన్ను, వడ్డీతో కలిపి చెల్లించి రిజిస్ట్రేషన్‌ పునరుద్దరణ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ రద్దు చేసినప్పటికీ తాను కట్టాల్సిన పన్ను నుంచి ఎలాంటి మినహాయింపు లభించదని గుర్తు పెట్టుకోవాలి. అంతేకాకుండా ఒకసారి రిజిస్ట్రేషన్‌ రద్దయితే సదరు వ్యాపారి ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ తీసుకోలేడు. అలాగే కొనుగోలుదారుల నుంచి పన్ను వసూలు చేయకూడదు.  


గమనిక: ఈ వ్యాసాల ద్వారా ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పాఠకులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత చట్టాలు/నిబంధనలను కూలంకషంగా పరిశీలించాలి.


రాంబాబు గొండాల

Updated Date - 2020-06-07T05:57:23+05:30 IST