జీఎస్‌టీ వసూళ్ల జోరు

ABN , First Publish Date - 2021-12-02T06:11:30+05:30 IST

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు జోరందుకున్నాయి. నవంబరులో జీఎస్‌టీ స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగి...

జీఎస్‌టీ వసూళ్ల జోరు

నవంబరులో రూ.1.31 లక్షల కోట్లు .. రెండో అత్యధిక ఆదాయంగా రికార్డు 


న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు జోరందుకున్నాయి. నవంబరులో జీఎస్‌టీ స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగి రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయి. 2017 జూలైలో ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రెండో అత్యధిక నెలవారీ వసూళ్లు ఇవి. దేశంలో వ్యాపార కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ బాట పట్టడంతో పాటు పన్ను చెల్లింపుదారులు నిబంధనలకు లోబడే తత్వం పెరిగిందనడానికి ఇదే సంకేతమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. జీఎ్‌సటీ స్థూల వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైగా నమోదవడం వరుసగా ఇది ఐదో నెల. ఈ ఏడాది అక్టోబరులోనూ ప్రభుత్వానికి రూ.1.30 లక్షల కోట్ల జీఎ్‌సటీ ఆదాయం లభించింది. కాగా, ఈ ఏప్రిల్‌లో వసూళ్లు ఆల్‌టైం అత్యధిక స్థాయి రూ.1.39 లక్షల కోట్లు (సవరించిన గణాంకాలు)గా నమోదయ్యా యి. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు గాను ప్రభుత్వం జీఎ్‌సటీ వసూళ్లను తొలుత ప్రకటించిన స్థాయితో పోలిస్తే భారీగా తగ్గించింది. 


2019 నవంబరుతో పోలిస్తే 27 శాతం వృద్ధి 

నవంబరు నెలకు స్థూల వసూళ్ల మొత్తం రూ.1,31,526 కోట్లు గా నమోదు కాగా.. సెంట్రల్‌ జీఎ్‌సటీ (సీజీఎస్‌టీ) ద్వారా రూ.23,978 కోట్లు, స్టేట్‌ జీఎ్‌సటీ (ఎస్‌జీఎస్‌టీ) ద్వారా రూ.31,127 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ (ఐజీఎస్‌టీ) ద్వారా రూ.66,815 కోట్లు, సెస్‌ రూపంలో మరో రూ.9,606 కోట్లు సమకూరింది. గత నెల జీఎ్‌సటీ ఆదాయం 2020 నవంబరుతో పోలిస్తే, 25 శాతం అధికం. 2019 నవంబరుతో పోలిస్తే 27 శాతం వృద్ధి నమోదైంది. 

Updated Date - 2021-12-02T06:11:30+05:30 IST