వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు తగదు

ABN , First Publish Date - 2021-12-20T08:45:09+05:30 IST

చేనేత, వస్త్ర పరిశ్రమపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రాన్ని కోరారు.

వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు తగదు

  • ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి..
  • చేనేత రంగాన్ని ప్రోత్సహించండి
  • కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ.. 
  • నేడు గ్రామగ్రామానా టీఆర్‌ఎస్‌ నిరసనలు 


హైదరాబాద్‌,  డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): చేనేత, వస్త్ర పరిశ్రమపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రాన్ని కోరారు. జనవరి 1 నుంచి పెంచాలన్న కేంద్ర ప్రతిపాదనను తక్షణం నిలిపివేయాలని  కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆదివారం ఆయన ఒక లేఖ రాశారు. వస్త్ర రంగం.. ముఖ్యంగా చేనేత రంగం గత రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితిలో జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడం ఆ పరిశ్రమను చావుదెబ్బ కొడుతుందని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. ‘దేశ చరిత్రలో ఎన్నడూ చేనేత ఉత్పత్తులపై పన్ను లేదు. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ ద్వారా తొలిసారి 5% పన్ను విధించింది. అప్పుడే చేనేత రంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది’ అని కేటీఆర్‌ తన లేఖలో గుర్తుచేశారు. తెలంగాణలో అద్భుతమైన చేనేత సాంప్రదాయం ఉందని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీరలను ఇక్కడ రూపొందిస్తారని.. జీఎస్టీ పెంపు నిర్ణయంతో నేతన్నల్లో తీవ్ర ఆందోళన మొదలైందన్నారు. చేనేత రంగంలో 5ు కంటే తక్కువ లాభం ఉంటుందని, ఈ నేపథ్యంలో 7% టాక్స్‌ను పెంచడం వల్ల ఆ రంగంలోని నేతన్నలు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. పరిమిత మార్కెటింగ్‌ ఉన్న చేనేత రంగంపై అదనపు భారం మోపితే మరింత డిమాండ్‌ తగ్గే ప్రమాదం ఉందని, ఏడాది కాలంలో కాటన్‌, యార్న్‌ వంటి ముడి సరుకుల ధరలు 30-40% పెరిగాయని, కరోనా సంక్షోభం వల్ల చైనా వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులు తగ్గి పరిశ్రమకు అవసరమైన రసాయనాల ధరలు సైతం భారీగా పెరిగిన నేపథ్యంలో 7% పన్ను పెంపు వల్ల అనేక చిన్న తరహా టెక్స్‌టైల్‌, హ్యాండ్‌ యూనిట్లు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని వివరించారు.  


కొత్త తరం రావాలంటే..

దేశవ్యాప్తంగా చేనేత రంగంలో పనిచేస్తున్న 67ు కుటుంబాల ఆదాయం ప్రతి నెలా రూ.5వేల కన్నా తక్కువ.. 26ు  కుటుంబాల ఆదాయం రూ.10 వేల కన్నా తక్కువగా ఉంటోందని, ఈ పరిస్థితిలో వారి ఉత్పత్తులపై పన్ను భారాన్ని పెంచడం సరికాదన్నారు. కొత్త తరం చేనేత రంగానికి దూరమవుతోందని, 2011 లెక్కల ప్రకారం 43.3 లక్షల కుటుంబాలు చేనేత రంగంలో ఉంటే తాజా లెక్కల ప్రకారం 30.44 లక్షల కుటుంబాలు మాత్రమే చేనేత రంగంలో ఉన్నట్లు తెలిపారు.  బలహీన వర్గాలకు బలమైన ప్రోత్సాహకాలిచ్చి అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. చేనేత, పర్యావరణ హిత వస్త్రాలకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగాన్ని బలోపేతం చేస్తే భారతదేశ వస్త్ర ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ చేసేందుకు కేంద్రం ప్రతిపాదించిన ఎగుమతుల లక్ష్యం చేరుకోగలమన్నారు. చేనేత రంగానికి చేయూతనందిస్తామని 2015లో ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకోవాలని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు.  ప్రస్తుత చేనేత రంగానికి మరింత అదనపు ప్రోత్సాహం ఇస్తేనే అది సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. 2017 మే 18న జీఎస్టీ కౌన్సిల్‌ చేనేత ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు లేకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కేటీఆర్‌ కోరారు. జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని కేంద్రం విరమించుకోకుంటే ప్రస్తుతం ఉన్న రూ.20 లక్షల జీఎస్టీ స్లాబ్‌ను చేనేత, పవర్లూమ్‌ కార్మికులకు రూ.50 లక్షల వరకు పెంచాలని డిమాండ్‌ చేశారు.  


జీఎస్టీని తగ్గించాలని కేంద్ర మంత్రికి వినతి

రాంగోపాల్‌పేట్‌/హైదరాబాద్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్టేట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ అసోసియేషన్స్‌ సభ్యులు ఆదివారం కేంద్ర మంత్రి గంగారపు కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. జౌళిపై జీఎస్టీ కౌన్సిల్‌ పెంచిన పన్నును వెంటనే తగ్గించాల్సిందిగా మంత్రిని కోరామని ఫెడరేషన్‌ అధ్యక్షుడు ప్రకాష్‌ అమ్మనబోలు చెప్పారు. టెక్స్‌టైల్‌ సామన్యుడి వస్తువు కావడం వల్ల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చిస్తానని,  ఆర్థిక శాఖ మంత్రితోనూ మాట్లాడి 12ు నుంచి తిరిగి 5 శాతానికి తగ్గించేలా కృషి చేస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు.   


ఎన్నికలుంటే ఇలా...

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్‌ సెటైర్లు

ఎన్నికలు ఉంటే ఇలా.. కూలీలతో కలిసి భోజనం చేస్తారు.. ఎన్నికలు లేకుంటే వలస కూలీలను గాలికొదిలేసి ప్రత్యక్ష నరకం చూపించారంటూ ప్రధాని మోదీపై కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా సెటైర్లు వేశారు. ఇటీవల వారాణసీలో కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రారంభ ంలో కూలీలతో కలిసి మోదీ భోజనం చేసిన దృశ్యాలను, లాక్‌డౌన్‌లో వలస కూలీలు కాలినడకన వెళ్తున్న దృశ్యాలను ట్వీట్‌ చేశారు. 


6 లక్షల మంది కార్మికులు లాక్‌డౌన్‌తో వందల కిలోమీటర్లు నడిచినప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. వలస కూలీలను   స్వస్థలాలకు పంపించడానికి శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసిన కేంద్రం బలవంతంగా చార్జీలను వసూలు చేసిందని కేటీఆర్‌ గుర్తు చేశారు.

Updated Date - 2021-12-20T08:45:09+05:30 IST