GST: జీఎస్టీ మండలి సమావేశంలోని కీలక నిర్ణయాలివే.. ఇకపై ఈ సేవలపై కూడా జీఎస్టీ వడ్డన..

ABN , First Publish Date - 2022-06-29T03:17:53+05:30 IST

జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పలు వస్తువులపై పన్ను రేట్లను జీఎస్టీ మండలి సవరించింది. మరికొన్ని వస్తువులపై పన్ను మినహాయింపులను..

GST: జీఎస్టీ మండలి సమావేశంలోని కీలక నిర్ణయాలివే.. ఇకపై ఈ సేవలపై కూడా జీఎస్టీ వడ్డన..

న్యూఢిల్లీ: జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పలు వస్తువులపై పన్ను రేట్లను జీఎస్టీ మండలి సవరించింది. మరికొన్ని వస్తువులపై పన్ను మినహాయింపులను ఎత్తేసింది. బంగారం, విలువైన రాళ్ల అంతర్​రాష్ట్ర రవాణాపై 'ఈ-వే' బిల్లు జారీ చేసేందుకు రాష్ట్రాలకు జీఎస్టీ అనుమతించింది. రోజుకు వెయ్యి రూపాయల లోపు రుసుము వసూలు చేసే హోటల్ వసతిని పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకూ వెయ్యి రూపాయల లోపు లభించే హోటల్ గది అద్దెపై జీఎస్టీ వసూలు చేయలేదు. ఇకపై ఈ సేవలపై 12 శాతం పన్ను విధించాలని జీఎస్టీ మండలికి మంత్రుల బృందం సూచించింది. ఆస్పత్రిలో రోజుకు రూ.5 వేల కన్నా అధికంగా అద్దె ఉంటే ఇకపై 5 శాతం జీఎస్టీ వసూలు చేయాల్సి ఉంటుంది. చెక్కులపై 18 శాతం పన్ను విధించాలని మంత్రుల బృందం ప్రతిపాదన చేసింది. రిస్కు అధికంగా ఉన్న పన్ను చెల్లింపుదారుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు మరిన్ని వెరిఫికేషన్ ప్రక్రియలు చేపట్టాలని మంత్రుల బృందం ప్రతిపాదన చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. జీఎస్టీ పరిహార సుంకాన్ని మరో నాలుగేళ్లపాటు కొనసాగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.



2022 జూన్‌ 30తో ముగియనున్న ఈ పరిహార సుంకం విధింపు గడువును 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కరోనా సంక్షోభ ప్రభావంతో గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏర్పడిన జీఎస్టీ ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు పరిహార సుంకాన్ని కొనసాగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్న జీఎస్టీ మండలి నిర్ణయించింది. జీఎస్టీ అమలు కారణంగా ప్రతినెలా ఏర్పడే పన్ను ఆదాయ లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిహారం చెల్లించే పద్ధతి 2022 జూన్‌తో ముగుస్తుందని గత ఏడాది సెప్టెంబరులో లఖ్‌నవూలో జరిగిన 45వ జీఎస్టీ మండలి సమావేశం అనంతరం సీతారామన్‌ తెలిపారు. అయితే, రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు కార్ల వంటి విలాస వస్తువులతో పాటు సిగరెట్‌, పాన్‌ మసాలా వంటి అనారోగ్యకారక ఉత్పత్తులపైన మాత్రం ఈ సుంకాన్ని 2026 మార్చి వరకు కొనసాగిస్తామని మంత్రి వెల్లడించారు.



రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్ల రుణాలు తీసుకుంది. ఈ రుణాలపై 2021-22లో రూ.7,500 కోట్ల వడ్డీ చెల్లించిన కేంద్ర సర్కారు.. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో రూ.14,000 కోట్లు కట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) నుంచి ప్రారంభం కానున్న ‘అసలు’ బాకీ చెల్లింపులు 2026 మార్చి వరకు కొనసాగనున్నాయి. దేశంలో ఏకరీతి పరోక్ష పన్ను విధానాన్ని ప్రవేశపెట్టేందు మోదీ ప్రభుత్వం 2017 జూలై 1 నుంచి జీఎస్‌టీ చట్టాన్ని అమలులోకి తెచ్చింది.

Updated Date - 2022-06-29T03:17:53+05:30 IST