కోవిడ్ అత్యవసరాలపై జీఎస్‌టీ కౌన్సిల్ పన్ను తగ్గింపు

ABN , First Publish Date - 2021-06-12T23:29:22+05:30 IST

కోవిడ్ మెడికల్ సరఫరాలపై కేంద్రం పన్ను ఉపశమనం కలిగించింది. ఇందుకోసం ఏర్పాటు..

కోవిడ్ అత్యవసరాలపై జీఎస్‌టీ కౌన్సిల్ పన్ను తగ్గింపు

న్యూఢిల్లీ: కోవిడ్ మెడికల్ సరఫరాలపై కేంద్రం పన్ను ఉపశమనం కలిగించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) చేసిన సిఫారసులను జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదించింది. కోవిడ్ టెస్ట్ కిట్లు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, వెంటిలేటర్లపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అంబులెన్స్‌లపై జీఎస్‌టీ రేటును 28 శాతం నుంచి 12 శాతానికి, హ్యాంట్ శానిటైజర్లపై 18 శాతం నుంచి 5 శాతానికి జీఎస్‌టీ తగ్గించింది. సెప్టెంబర్ 30 వరకూ ఈ పన్ను రేట్లు అమలులో ఉంటాయని జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.


కాగా, జీఎస్‌టీ కౌన్సిల్ తాజా నిర్ణయం ప్రకారం, టెంపరేచర్ చెక్ చేసే పరికరాలపై జీఎస్‌టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. పర్సనల్ ఇంపోర్ట్స్‌తో సహా పల్స్ ఆక్సోమీటర్లపై కూడా జీఎస్‌టీ 18 నుంచి 5 శాతానికి తగ్గించారు. నిర్దిష్ట డయోగ్నోస్టిక్ కిట్లపై జీఎస్‌టీ రేటు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. క్రెమిటోరియం కోసం గ్యాస్/ఎలక్ట్రిక్/ఇతర ఫర్నెసెస్‌లపై (ఇన్‌స్టలేషన్‌తో సహా) జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.


కోవిడ్ సంబంధిత డ్రగ్స్ టోసిల్‌జుమాబ్, యాంఫోటెరిసిన్-బి పై ఎలాంటి జీఎస్‌టీ విధించరాదని జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఇంతకుముదు వీటిపై 5 శాతం జీఎస్‌టీ ఉండేది. యాంటీ కాగ్యులెంట్ (రక్తం గడ్డకట్టకుండా చేసే) మెడిసన్లయిన హెపరిన్, రెమ్‌డెసివిర్‌పై జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మా (డీఓపీ) సిఫారసు చేసే కోవిడ్ డ్రగ్‌లన్నింటిపై 5 శాతం పన్ను ఉంటుంది.


వెంటిలేటర్ మాస్క్‌లు, కాన్యులా (వాంతులు చేయించేందుకు ఉపయోగించే గొట్టం), హెల్మెట్‌లపై కూడా జీఎస్‌టీ కౌన్సిల్ ఉపశమనం కలిగించింది. వీటిపై విధిస్తు 12 శాతం పన్నును 5 శాతానికి తగ్గించింది. బిలేవెల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (బిపాప్) మెషీన్‌పై 12 నుంచి 5 శాతం, హైఫ్లో నాసల్ కాన్యులా (హెచ్ఎఫ్ఎన్‌సీ) పరికరంపై 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్‌టీ తగ్గించారు. ఆగస్టు నెలాఖరు వరకూ వీటి అమలుకు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ సిఫారసు చేసినప్పటికీ ఈ రేట్లు సెప్టెంబర్ వరకూ అమలులో ఉంటాయని నిర్మలా సీతారామన్ మీడియాకు తెలిపారు. ఈ గడువును మరింత పెంచే విషయంపై తగిన సలహాలు, రాష్ట్రాల సమాచారం తీసుకుని సెప్టెంబర్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2021-06-12T23:29:22+05:30 IST