జీఎస్టీ పరిహార సెస్‌ను మళ్లించలేదు : ఆర్థిక శాఖ

ABN , First Publish Date - 2020-09-28T00:09:18+05:30 IST

జీఎస్టీ పరిహార సెస్‌ను మళ్లించలేదని కేంద్రం స్పష్టం చేసింది. కాగ్ నివేదిక నేపధ్యంలో కేంద్రం ఈ మేరకు స్పందించింది. వివరాలు... 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ. 47,272 కోట్ల మొత్తం పరిహారాన్ని కేంద్రం తన వద్దే ఉంచుకొని, ఇతర అవసరాలకు వినియోగించిందని కాగ్ ఇటీవల నివేదికనిచ్చిన విషయం తెలిసిందే.

జీఎస్టీ పరిహార సెస్‌ను మళ్లించలేదు : ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ :  జీఎస్టీ పరిహార సెస్‌ను మళ్లించలేదని కేంద్రం స్పష్టం చేసింది. కాగ్ నివేదిక నేపధ్యంలో కేంద్రం ఈ మేరకు స్పందించింది. వివరాలు... 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ. 47,272 కోట్ల మొత్తం పరిహారాన్ని కేంద్రం తన వద్దే ఉంచుకొని, ఇతర అవసరాలకు వినియోగించిందని కాగ్ ఇటీవల నివేదికనిచ్చిన విషయం తెలిసిందే.


కాగా... నిధులు తాత్కాలికంగానైనా అట్టిపెట్టుకోవడమంటే ఇతర అవసరాలకు మళ్లించినట్లు కాదని ఆర్థిక శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి. 


జీఎస్టీ అమలు కారణంగా ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు పరిహారంగా సెస్సును కేంద్రం ఇవ్వాల్సి ఉందని కాగ్ పేర్కొంది. సెస్‌ల రూపంలో వసూలైన మొత్తాన్ని కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా(సీఎఫ్‌ఐ)కు బదలీ చేయాల్సి ఉందని తెలిపింది. ఇక... 2017-18 లో రూ. 62,612 కోట్ల సెస్ వసూలు కాగా, రూ. 56,146 కోట్లు ఆ నిధికి బదలీ చేశారని, 2018-19లో రూ. 95,081 కోట్లు వసూలు కాగా, రూ. 54,275 కోట్లు బదలీ అయ్యాయని పేర్కొంది.


ఆ రెండేళ్లలో రూ. 47,272 కోట్లు తక్కువగా ఆ నిధికి బదలీ అయ్యాయని కాగ్ పేర్కొంది. ఈ నిధులను కేంద్రం ఇతర అవసరాలకు వినియోగించినట్లు నివేదికలో వెల్లడించింది. 


రెండేళ్లలో తగ్గుదల ఇలా ... ది జీఎస్టీ కంపెన్షేషన్ సెస్ యాక్ట్ 2017 కింద విధించిన సెస్‌ను జీఎస్టీ అమలు కారణంగా ఆదాయ నష్టం కలిగిన రాష్ట్రాలకు పరిహారంగా ఇవ్వాలని కాగ్ పేర్కొన్న విషయం తెలిసింపదే. ఈ క్రమంలో... 2017-18లో రూ. 6,466 కోట్లు, 2018-19 లో రూ. 40,806 కోట్లు తక్కువగా బదలీ అయినట్లు తెలిపింది.


అంటే మొత్తం రూ. 47,272 కోట్లు తక్కువగా బదలీ అయినట్లు తెలిపింది. ఈ నిధులను కేంద్రం ఇతర అవసరాలకు వినియోగించిందని, దీంతో ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు, ద్రవ్యలోటు తక్కువగా నమోదైనట్లు తెలిపింది. 


అయితే ఈ విషయంపై కేంద్రం స్పందిస్తూ ‘అంతకంటే ఎక్కువ చెల్లింపులు జరిగాయి’ అని వెల్లడించింది.  అంతేకాకుండా... ఆ రెండు సంవత్సరాలకు సంబంధించిన జీఎస్టీ పరిహారాన్ని కూడా రాష్ట్రాలకు చెల్లించినట్లు వెల్లడించింది. ఇక... 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 95,444 కోట్లు వసూలు కాగా, రాష్ట్రాలకు అంతకంటే ఎక్కువగా, అంటే... రూ. 1,65,302 కోట్లను కేంద్రం విడుదల చేసిందని గుర్తు చేసింది.


నిధుల సర్దుబాటు కారణంగా తాత్కాలికంగా అట్టిపెట్టుకుంటే నిధులు మళ్లించినట్లు పేర్కొనడం సరికాదని తెలిపింది. కాగా... ఈ అంశానికి సంబంధించి కేంద్రం తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి. 


Updated Date - 2020-09-28T00:09:18+05:30 IST