విద్యుత్తు సంస్థలను ప్రైవేటుకు అప్పగించడానికే..

ABN , First Publish Date - 2020-09-16T09:48:17+05:30 IST

జీఎస్టీ పరిహరం పొందే విషయంలో రాష్ట్రానికి న్యాయపోరాటం తప్ప మరో మార్గం కనిపించట్లేదు.

విద్యుత్తు సంస్థలను ప్రైవేటుకు అప్పగించడానికే..

జీఎస్టీ పరిహారంపై మిగిలింది  న్యాయ పోరాటమే

అప్పు తీసుకోవాలంటూ కేంద్రం ఇచ్చిన

రెండు ఆప్షన్లనూ వద్దనుకున్న తెలంగాణ

రాష్ట్ర లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం

రూ.8,828 కోట్లు రావాలంటున్న రాష్ట్రం

రూ.5,424 కోట్లేనని కేంద్రం ప్రకటన

కేంద్రం ఆప్షన్లనూ వద్దనుకున్న తెలంగాణ


హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ పరిహరం పొందే విషయంలో రాష్ట్రానికి న్యాయపోరాటం తప్ప మరో మార్గం కనిపించట్లేదు. జీఎస్టీ పరిహారానికి బదులు రుణాలు ఇప్పిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ప్రత్యామ్నాయాలనూ (కేంద్రమే రిజర్వు బ్యాంకు ద్వారా హేతుబద్ధమైన వడ్డీకి  రుణం ఇప్పించడం, ప్రభుత్వ బాండ్ల ద్వారా రుణాల సమీకరణ) రాష్ట్రం తిరస్కరించింది. ఈమేరకు రాష్ట్రం రాసిన లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాలు కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరించాయి. 11 రాష్ట్రాలు మొదటి ప్రతిపాదనను అంగీకరించగా, ఒక్క రాష్ట్రం మాత్రం రెండోప్రతిపాదనను అంగీకరించింది. మిగిలిన రాష్ట్రాలు ఇంకా తమ అభిప్రాయాలను తెలియజేయలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నట్టు సమాచారం. తాజా పరిణామాలతో రాష్ట్రాలకు జీఎస్టీ నష్టాన్ని నేరుగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని స్పష్టమైంది.


కేంద్రం ప్రతిపాదించిన రెండు మార్గాలనూ తెలంగాణ తిరస్కరించిన నేపథ్యంలో మిగిలిన మార్గం న్యాయపోరాటమేనని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు పలుసందర్భాల్లో చెప్పారు. తాజాగా అసెంబ్లీ, మండలి సమావేశాల్లో కూడా హరీశ్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సుమారు రూ.8,828 కోట్లు రావాల్సి ఉందని మంత్రి ప్రటించారు. ఇందులో సుమారు రూ.2,812 కోట్ల నిధులు గత మూడేళ్ల ఐజీఎస్టీ పరిహారం కాగా, రూ.6,016 కోట్ల మేర జీఎస్టీ పరిహారం రావాల్సి ఉందని పేర్కొన్నారు.


రూ.5424 కోట్లు..

రాష్ట్రానికి రావాల్సిన పరిహారం విషయంలో కేంద్రం కొంత స్పష్టత ఇచ్చింది. 2019-20వ ఆర్థిక సంవత్సరంలో రూ.3,054 కోట్ల జీఎస్టీ పరిహారాన్ని ఇచ్చామని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-జూలై కాలానికి సుమారు రూ.5,424 కోట్ల పరిహారాన్ని ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంట్‌కు సమాచారమిచ్చింది. అంటే.. రాష్ట్రానికి రూ.5,424 కోట్ల జీఎస్టీ పరిహారం ఇవ్వాల్సి ఉన్నట్టు కేంద్రం అంగీకరించింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ వల్ల ఎక్కువ నష్టం ఏప్రిల్‌, మే నెలల్లో జరిగింది. జూన్‌ నుంచి ఆదాయం కొంతమేరకు పెరిగింది. ఆగస్టులో దాదాపు అంచనా వేసిన దానిలో కొంత అటు ఇటూగా వచ్చినట్టు సమాచారం. సెప్టెంబరు నుంచి వసూళ్లు అంచనాల మేరకే ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు ప్రతిపాదనలనూ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలుస్తోంది. కేంద్రం సూచించిన ఏ ప్రతిపాదనకు ఒప్పుకొన్నా.. పైన పేర్కొన్న రూ.5,424 కోట్లను రుణం ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో జీఎస్టీ వసూళ్లు బాగానే ఉండే అవకాశం ఉన్నందున, ఇంత కంటే ఎక్కువ రుణం వచ్చే వీలు కూడా లేదు.


రూ.5,424 కోట్ల కోసం కేంద్రం ప్రతిపాదనలకు అంగీకరించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కావాలంటే.. ఈ రూ.5 వేల కోట్లను నేరుగానే రాష్ట్రం రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది. ఎలాగూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచడంతో రుణ పరిమితి పెరగనుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించినట్టు సమాచారం. ఆ నిధులను రాబట్టుకోవడానికి న్యాయపోరాటానికి దిగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించిన మిగతా రాష్ట్రాలూ న్యాయపోరాటానికి దిగే అవకాశం ఉంది.


ఇష్టారీతిన రుణాలు తీసుకోలేం!

‘‘రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అప్పులు తెస్తోందని విమర్శలు చేస్తున్నారు. ఆర్టికల్‌ 293 ప్రకారం రాష్ట్రాల రుణ పరిమితిని కేంద్రమే నిర్ణయిస్తుందని.. ఆ విమర్శలు చేసే వాళ్లు గుర్తుంచుకోవాలి’’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. రాష్ట్రాల అప్పులకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన జాబితాలో తెలంగాణ చివరి నుంచి రెండో రెండో స్థానంలో ఉందన్నారు. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు నిలిపేశారని, తెలంగాణలో అలా చేయలేదన్నారు. క్లిష్టసమయంలో కూడా రూ.7,254 కోట్లు రైతుల కోసం విడుదల చేశామన్నారు. రైతు రుణమాఫీ, బీమా, విద్యుత్‌ రాయితీ, ఆసరా పెన్షన్‌.. ఇలా ఎన్నో పథకాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామన్నారు. దాదాపు అయిదు నెలల కాలంలో రూ.55,638 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.


కేంద్రం షరతులను ఒప్పుకోం.. శాసన మండలిలో మంత్రి హరీశ్‌రావు


‘‘కరోనా ప్రభావం వల్ల కాకుండా రాష్ట్రంలోనూ ఆర్థిక మందగమనం వచ్చింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని 3 నుంచి 5 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే అప్పులు తీసుకునేందుకు కేంద్రం విధించిన షరతులను అంగీకరించేది లేదు’’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, గోడౌన్ల నిర్మాణం, ఉచిత విద్యుత్తు.. ఇలా ఎన్నో పథకాలతో రైతులను సంపన్నులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ సమయంలో రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా కేంద్రం విధించిన షరతులను అమలు చేసేది లేదని స్పష్టంచేశారు.


వ్యవసాయ పంపుసెట్లు వాడే చోట మీటర్లు పెడితేనే అప్పు ఇస్తామని కేంద్రం మెలిక పెడితే.. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటూ ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారని గుర్తు చేశారు. 2018-19 సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.1435 కోట్లను కేంద్రం ఇవ్వలేదని, పైగా అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇస్తున్నామని చెప్పిందని పేర్కొన్నారు. ‘ది తెలంగాణ ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ 2020’పై చర్చ సందర్భంగా హరీశ్‌ మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో దేశ జీడీపీ తగ్గుతోందని, కానీ, రాష్ట్ర జీఎ్‌సడీపీ మాత్రం రెండంకెల వృద్ధి జరుగుతోందని అన్నారు.

Updated Date - 2020-09-16T09:48:17+05:30 IST