జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2020-12-02T06:26:36+05:30 IST

వస్తు,సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వరుసగా మూడో నెలలోనూ వృద్ధి చెందాయి. నవంబరులో జీఎ్‌సటీ ఆదాయం రూ.1,04,963 కోట్లుగా నమోదైందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది...

జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లు

  • వరుసగా మూడో నెలా వృద్ధిపథంలో..
  • రూ.లక్ష కోట్లు దాటడం రెండోసారి
  • ఎకానమీ రికవరీకి సంకేతం: విశ్లేషకులు 
  • తెలంగాణలో రూ.174 కోట్లు తగ్గిన వసూళ్లు 
  • ఏపీలో మాత్రం 12 శాతం వృద్ధి 


న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): వస్తు,సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వరుసగా మూడో నెలలోనూ వృద్ధి చెందాయి. నవంబరులో జీఎ్‌సటీ ఆదాయం రూ.1,04,963 కోట్లుగా నమోదైందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2019 నవంబరులో సమకూరిన రూ.1.03 లక్షల కోట్లతో పోలిస్తే 1.4 శాతం అధికం. జీఎ్‌సటీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం వరుసగా ఇది రెండో నెల. అంతేకాదు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎ్‌సటీ ఆదాయం రూ.లక్ష కోట్లు మించడం ఇది రెండోసారి. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో మార్కెట్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటుండటం ఇందుకు దోహదపడింది. ప్రస్తుత జీఎ్‌సటీ వసూళ్ల ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఆర్థిక వ్యవస్థ మళ్లీ పునరుద్ధరణ బాటలో పయనిస్తున్నట్లుగా కన్పిస్తోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.




నవంబరు నెల జీఎ్‌సటీ ఆదాయంలో సెంట్రల్‌ జీఎ్‌సటీ (సీజీఎ్‌సటీ) వసూళ్లు రూ.19,189 కోట్లు. కాగా, స్టేట్‌ జీఎ్‌సటీ (ఎస్‌జీఎ్‌సటీ) రూ.25,540 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ (ఐజీఎ్‌సటీ) రూ.51,992 కోట్లుగా ఉంది. ఈ ఐజీఎ్‌సటీలో రూ.22,078 కోట్లు వస్తు దిగుమతులపై వసూలు కాగా, సెస్‌ రూపంలో రూ.8,242 కోట్లు, దిగుమతి వస్తువులపై పన్ను విధింపు ద్వారా మరో రూ.809 కోట్లు సమకూరాయి. ఐజీఎ్‌సటీ ఆదాయం పంప కంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.22,293 కోట్లు సీజీఎ్‌సటీకి, రూ.16,286 కోట్లు ఎస్‌జీఎ్‌సటీకి జమ చేసింది. ఈ సెటిల్‌మెంట్‌ తర్వాత సీజీఎ్‌సటీ ఆదాయం రూ.41,482 కోట్లు, ఎస్‌జీఎ్‌సటీ రూ.41,826 కోట్లకు చేరుకుంది. 


82 లక్షల రిటర్నులు దాఖలు 

గత నెల చివరి నాటికి 82 లక్షల జీఎ్‌సటీఆర్‌-3బీ రిటర్నులు దాఖలైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. రూ.5 కోట్లకు మించి వార్షిక టర్నోవర్‌ కలిగిన వ్యాపారులు నెలవారీగా సేల్స్‌ రిటర్ను (జీఎ్‌సటీఆర్‌-3బీ) సమర్పించాల్సి ఉంటుంది. ఒక నెల సేల్స్‌ రిటర్నును ఆ తర్వాత నెల 20వ తేదీకల్లా ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. 





తెలంగాణలో తగ్గిన వసూళ్లు 

తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబరు లో జీఎ్‌సటీ వసూళ్లు రూ.174 కోట్లు (మైనస్‌ 5.19 శాతం) తగ్గి రూ.3,175 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.3,349 కోట్లుగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో జీఎ్‌సటీ ద్వారా రూ.32,671 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా కేవలం రూ.8,224 కోట్లు (-74.82ు) మాత్రమే వచ్చాయి. 


Updated Date - 2020-12-02T06:26:36+05:30 IST