దారుణ మరణాలు

ABN , First Publish Date - 2022-05-06T06:09:13+05:30 IST

‘వెనుక దగా...ముందు దగా...’ అన్న మహాకవి మాటలు అన్నదాతల విషయంలో అక్షర సత్యాలై కళ్లముందు కదలాడుతున్నాయి.

దారుణ మరణాలు

కాడి వదిలేస్తున్న కష్టజీవులు

పొలాల్లోనే అన్నదాతల ఆఖరి క్షణాలు

పెరిగిపోతున్న  రైతుల బలవన్మరణాలు

కర్షకుల కుటుంబాల్లో కన్నీటిధారలు


 ‘వెనుక దగా...ముందు దగా...’ అన్న మహాకవి మాటలు అన్నదాతల విషయంలో అక్షర సత్యాలై కళ్లముందు కదలాడుతున్నాయి. అటు ప్రకృతి కరుణించక...ఇటు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక...ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక...అన్నదాతలు కుదేలవుతున్నారు. బతుకుభారమై మృత్యువును ఆశ్రయిస్తున్నారు. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు..ఏడాదిలో 105 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. గడచిన నాలుగు నెలల్లోనే ఈ సంఖ్య 15 ఉండడం... రైతుల దుస్థితికి దర్పణం పడుతోంది.


(ఆంధ్రజ్యోతి - కర్నూలు)


మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన పుచ్చలదిన్నె ఉరుకుందు (45) మూడున్నర ఎకరాల రైతు. ఐదారేళ్లుగా పత్తి, మిరప, వేరుశనగ సాగు చేశారు. ఎరువులు, పురుగు మందులు మూడింతలు పెరగడం.. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంటలు దెబ్బతినడం.. చేతికొచ్చిన అరకొర పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.5 లక్షలు దాటాయి. వడ్డీలు కలిపితే రూ.7-8 లక్షలకు చేరాయి. అప్పు తీర్చే మార్గం కానరాక.. అప్పులు ఇచ్చిన ఆసాములకు మొహం చూపించలేక గతేడాది అక్టోబరు 21న ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రైతుకు 70 ఏళ్ల తల్లి, ఏడవ తరగతి చదివే 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన వైఎస్‌ఆర్‌ రైతు భీమా రూ.7 లక్షల సాయం నేటికీ అందలేదు. ఉరుకుందు ఒక్కరే కాదు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలీసు రికార్డుల ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో 107 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఈ ఏడాది నాలుగు నెలల్లో 15 మంది అప్పుల బాధతో బలవన్మరణం పొందారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు త్రీమెన్‌ కమిటీ సిఫార్సు మేరకు వైఎస్‌ఆర్‌ రైతు భీమా పథకం కింద రూ.7 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. గత ఏడాది అక్టోబరు వరకు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని అధికారులు తెలిపారు. ఆరు నెలలు కాలంలో బలవన్మరణం పొందిన దాదాపు 55 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా అందాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకున్న వారిలో 25-30 ఏళ్లు ఉన్న యువరైతులే అధికం. 


పోలీసు రికార్డుల ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతులు 


సంవత్సరం రైతులు

2019 108

2020 141

2021 107

2022 15 (నేటి వరకు)


 రైతుల ఆత్మహత్యలకు కారణాలు


వరుసగా వెంటాడుతున్న ప్రకృతి వైపరీత్యాలు

రైతులకు భరోసా ఇవ్వడంలో పాలకుల వైఫల్యం

పరిహారం సకారంలో అందకపోవడం

కల్తీ విత్తనాలు, పురుగు మరుగు మందుల నివారణలో సర్కారు వైఫల్యం

బ్యాంకుల్లో పంట రుణాలు అందకపోవడం 

ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయడం

గిట్టుబాటు ధర లేకపోవడం

రైతు ఆత్మహత్య నివారణ పథకాలు సక్రమంగా అమలు కాకపోవడం 

భూగర్భ జలాలు అడుగంటి ఒకే రైతు ఆరేడుకుపైగా బోర్లు తవ్వించడం

పురుగు మందులు, ఎరువులు, కూలీ రేట్లు మూడింతలు పెరగడం

సూక్ష్మపోషకాల పంపిణీని ప్రభుత్వం రద్దు  చేయడం


ఆత్మహత్యలు నివారించాలంటే ..


అప్పుల ఒత్తిళ్లతో బాధపడుతున్న రైతులను గుర్తించి వారికి మనోధైర్యం, అవగాహన కల్పించేందుకు కాల్‌సెంటర్లు ఏర్పాటు చేయాలి. 

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని 48 గంటల్లోగా ప్రభుత్వ యంత్రాంగం సంప్రదించి తక్షణ సాయంగా వైఎస్‌ఆర్‌ రైతు బీమా సాయం రూ.7 లక్షలు అందించాలి. అందులో రూ.2 లక్షలు రుణాలు చెల్లించి.. మిలిగిన మొత్తం రైతు కుటంబానికి ఇవ్వాలి. ఆ తర్వాత వడ్డీ వ్యాపారులు ఒత్తిడి తెస్తే వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి. 

కలెక్టర్‌ అధ్యక్షతన వ్యవసాయ నిపుణులు, స్వచ్ఛంద సంస్థలతో వ్యవసాయ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకోసారి చట్టబద్ధమైన సమావేశం నిర్వహించాలి. వ్యవసాయ పంట ఉత్పత్తులు, ధరలు, వ్యవసాయంలో వచ్చే మార్పులు, రైతులకు జరుగుతున్న మోసాలపై చర్చించాలి. 

ఆత్మహత్య చేసుకున్న రైతు భార్యా పిల్లలకు తక్షణమే భూమి హక్కు కల్పించాలి. 

పొలంలో విద్యుత్‌ ప్రమాదం వల్ల చనిపోయే రైతులకు సైతం ఇదే పరిహారం అందించాలి.

బోర్ల తవ్వకాలను నివారించేందుకు వాల్టా చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి.

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు సంస్థాగత రుణాలు ఇవ్వాలి. 

మహిళా రైతులను గుర్తించి వారికి కూడా రుణ సౌకర్యం కల్పించాలి. 


 మార్కెట్‌ యార్డులో మోసాలు


రైతు పంట అమ్మిన మొత్తంలో కమీషన్‌ ఏజెంట్లు నూటికి రూ.2లు మాత్రమే దళాలి (కమీషన్‌) తీసుకోవాలి. జిల్లాలో కొన్ని మార్కెట్లలో కమీషన్‌తోపాటు డబుల్‌ దళాలి పేరుతో మరో రూ.2 కలిపి నూటికి రూ.4, పెట్టుబడికి అప్పు చేసి ఉంటే మరో రూ.3 వసూలు చేస్తున్నారు. అంటే నూటికి రూ.7 మార్కెట్‌ మాయగాళ్లు కాజేస్తున్నారు. తూకాల్లో మోసాలు సరేసరి. ఆదోని లాంటి పత్తి మార్కెట్‌లో బాదు పేరుతో క్వింటాలుకు రెండు కిలోలు కోత పెడుతున్నారు. వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గించి దగా చేస్తున్న సందర్బాలు ఎన్నో ఉన్నాయి. రైతు ఆత్మహత్యలకు మార్కెట్లో జరిగే మోసాలు, దోపిడీలు కూడా ఓ కారణమే అని రైతు స్వరాజ్‌ వేదిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


ఆదోని, మే 5: చిప్పగిరి మండలం దౌల్తాపురం గ్రామానికి చెందిన బండ అనంతప్ప, నెట్టెప్ప దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో చిన్నరాముడు (26) యువ రైతు. 2002 జనవరి 29న ఆలూరు మండలం మొలగవల్లికి చెందిన సావిత్రమ్మతో వివాహమైంది. చిన్నరాముడుకు ఉన్న రెండు ఎకరాలతోపాటు మరో 29 ఎకరాలను ఎకరాకు రూ.10 వేల ప్రకారం కౌలుకు తీసుకున్నాడు. 14 ఎకరాల్లో మిరప, 17 ఎకరాల్లో పప్పుశనగ సాగు చేశాడు. భారీ వర్షాలకు పప్పుశనగ పంట చేతికి రాకపోగా మిరపకు సైతం తెగుళ్లు సోకి కళ్లెదుటే నాశనమైపోయింది. పంటల పెట్టుబడి కోసం రూ.8లక్షల అప్పు చేశాడు. నాలుగేళ్లుగా పంటలు సక్రమంగా చేతికి అందక పెట్టిన పెట్టుబడులు సరిగా రాలేదు. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించక 2022 ఫిబ్రవరి 26న పంట పొలంలోనే విషగుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు.


మంత్రాలయం, మే 5: పై ఫొటోలో కనిపిస్తున్న మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన గుంజుపల్లి వెంకటేష్‌ (49) అనే రైతు అప్పుల బాధ తాళలేక గత ఏడాది జూలై 4న ఆత్మహత్య చేసుకున్నాడు. 2.50 ఎకరాల సొంత భూమి, మరో పదెకరాలను కౌలుకు తీసుకొని సాగు చేశాడు. ఇందుకు పెట్టుబడిగా దాదాపు రూ.7.29 లక్షలు అప్పు చేశాడు. వరి, వేరుశనగ, పత్తి పంటలను సాగు చేసినా  మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించం లేదు. దీంతో అప్పులు తీర్చేదారిలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు పెళ్లి చేయాలంటే.. కష్టంగా మారిందని, భూములను అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నానని భార్య లక్ష్మి వాపోయింది. 


సాయం అందక.. పొలం అమ్మకానికి 


డోన్‌, మే 5: డోన్‌ మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లుకు రెండు ఎకరాల పొలం ఉంది. భార్య మల్లేశ్వరమ్మ కొడుకు మధు వెంకటేశ్వర్లు, కూతురు రమాదేవి, తల్లితో సహా ఉన్నారు. పొలం మీదనే ఆధారపడి కంది, వేరుశనగ పంటలు సాగు చేస్తూ వచ్చాడు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు వడ్డీలతో పెరిగిపోయాయి. దీంతో అప్పు రూ.8 లక్షలకు చేరింది. అప్పుల బాధలు ఎక్కువ కావడంతో 2019 అక్టోబరు 20వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లలు చదువులు మానేయాల్సి వచ్చింది. ఈ విషాద ఘటనకు ముందే అప్పుల బాధలు భరించలేక తల్లి మహేశ్వరమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో డోన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదివే మధు వెంకటేశ్వర్లు చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. కంబళపాడు గురుకుల పాఠశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదివే కూతురు రమాదేవి కూడా చదువు మానేయాల్సి వచ్చింది. దీంతో ఉన్న రెండెకరాల పొలంలోనే మధువెంకటేశ్వర్లు వ్యవసాయం చేస్తూ వస్తున్నాడు. పెళ్లి చేసుకోవడంతో ఆరు నెలల కుమారుడు ఉన్నారు. రమాదేవికి పెళ్లి చేసేందుకు రూ.లక్ష అప్పు చేయాల్సి వచ్చింది. నాయనమ్మ కూడా అతని దగ్గరే ఉంటోంది. దీంతో కుటుంబ భారాన్ని అంతా మోస్తూ మధు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. అప్పుల గుదిబండ రూ.10లక్షలకు చేరింది. వెంకటేశ్వర్లు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఉన్న రెండెకరాల పొలాన్ని అమ్మేసి అప్పులు తీరుస్తామని మధు వెంకటేశ్వర్లు బోరున విలపిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. 



బాధిత కుటుంబానికి అందని పరిహారం


వీధిన పడిన వీరయ్య కుటుంబం


జూపాడుబంగ్లా, మే 5 : మండలంలోని తూడిచర్ల గ్రామానికి చెందిన వీరయ్య అనే కౌలు రైతు గత ఏడాది డిసెంబరు 27న పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి ఏడాది 14 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న, మినుము, ఉల్లిగడ్డ పంటలను సాగు చేసేవాడు. పంటలు సరిగా పండక, గిట్టుబాటు ధర లేకపోవడంతోపాటు ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేయడంతో దాదాపు రూ. 19 లక్షలు అప్పు అయింది. తమకున్న సొంత పొలం మూడు ఎకరాలు అమ్మి కొంత అప్పు తీర్చాడు. మిగిలిన అప్పు తీర్చేందుకు ఒత్తిళ్లు పెరగడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ చదివే కొడుకును కాలేజీ మాన్పించాల్సి వచ్చిందని ఆయన భార్య రామసుబ్బమ్మ తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఓ హోటల్‌లో పని చేస్తూ తమను పోషిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.



అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య 


రుద్రవరం, మే 5: నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రానికి చెందిన పోలా రామకృష్ణ అనే రైతు బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పది ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వరి, మినుము, మొక్కజొన్న సాగు చేశాడు. సాగు కోసం తెచ్చిన అప్పు వడ్డీతో కలిసి రూ.12 లక్షలకు చేరింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో అర్థంగాక గురువారం ఇంట్లో పురుగులు మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య భారతి, ఐదేళ్ల వయస్సు కలిగిన ఆనంద్‌, మూడేళ్ల వయసు కలిగిన రవితేజ అనే చిన్నారులు ఉన్నారు. తండ్రి మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబ యజమానిని కోల్పోవడంతో చిన్న పిల్లలు, భార్య, బంధువులు శోకసంద్రంలో మునిగారు. భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్‌ఐ బాలన్న తెలిపారు.

Read more