కరోనా తర్వాత.. వృద్ధి రేటు భేష్ : మూడీస్

ABN , First Publish Date - 2021-02-27T00:27:41+05:30 IST

ప్రస్తుత(2021-22) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధిరేటును అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సవరించింది. భారత జీడీపీ 13.7 శాతం వృద్ధి రేటును నమోదు చేయవచ్చునని పేర్కొంది.

కరోనా తర్వాత.. వృద్ధి రేటు భేష్ : మూడీస్

న్యూయార్క్ : ప్రస్తుత(2021-22) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధిరేటును అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సవరించింది. భారత జీడీపీ 13.7 శాతం వృద్ధి రేటును నమోదు చేయవచ్చునని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7 శాతంగా ఉండవచ్చునని పేర్కొంది. కరోనా వ్యాక్సీన్‌తో మార్కెట్‌లో మందగమనం తగ్గుముఖం పడుతోందని, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ తెలిపింది. 


కొంత సానుకూలం.... 

భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మైనస్ 10.6 శాతంగా ఉండవచ్చునని, 2022 లో 10.8 శాతం వృద్ధి రేటు ఉండవచ్చని గతేడాది నవంబరులో

 అంచనా వేసింది. తాజాగా వీటిని సవరించింది. తాజా అంచనాల్లో వృద్ధిరేటు 3.1 శాతం పెరగగా, 2021 ఆర్ధిక సంవత్సరం మైనస్ శాతం 3.6 శాతం మేర తగ్గింది. సార్వభౌమ గ్రేడింగ్‌కు సంబంధించి మూడీస్ సహా ఇతర అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రేటింగ్ విషయంలో ఏజెన్సీలు పారదర్శకత పాటించాలని, మరింత మెరుగ్గా ఉండాలని సూచించింది.


కేంద్రం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను మూడీస్ ప్రశంసించింది. భారత్‌లో ఇటీవలి పరిణామాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు పేర్కొంది. రాబోయే సంవత్సరానికి గాను కేంద్రం అధిక రుణాలు తీసుకోవాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ భారత ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని మూడీస్ పేర్కొంది. బడ్జెట్‌లో ద్రవ్యలోటు అంచనాలకు మించిందని, కానీ లోటు లక్ష్యం వాస్తవికంగా ఉందని పేర్కొంది.


రిటైల్ లోన్ పైన ప్రభావం... 

రిటైల్ లోన్‌ల పై కరోనా ప్రభావం ఇంకా కనిపిస్తోందని మూడీస్ ఉపాధ్యక్షుడు వడ్లమాని శ్రీకాంత్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... భారత ఆర్థిక రికవరీ వేగవంతంగా కనిపిస్తోందని ‘ఇక్రా’ కూడా వెల్లడించింది. ఈ డొమెస్టిక్ రేటింగ్ ఏజెన్సీ 2022 ఆర్ధిక సంవత్సరంలో భారత రియల్ జీడీపీని 10.5 శాతంగా అంచనా వేసింది. 

Updated Date - 2021-02-27T00:27:41+05:30 IST