కలబంద కూరతోజీవకణాల వృద్ధి

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

కలబంద ప్రతీ ఇంట్లో కుండీల్లో పెరిగే మొక్కే! అలొవెరా అనే వృక్షనామంతో

కలబంద కూరతోజీవకణాల వృద్ధి

కలబంద ప్రతీ ఇంట్లో కుండీల్లో పెరిగే మొక్కే! అలొవెరా అనే వృక్షనామంతో ఇది ప్రసిద్ధి. ఆది నుంచి ఇది మందు మొక్కగానే ప్రపంచానికి తెలుసు. ప్రాచీన ఈజిప్షియన్లు దీన్ని వాపు, నొప్పి తగ్గించే ఔషధంగా వాడేవారు. ఈ నాటికీ కాలేయం, ప్లీహం, క్లోమం, మూత్రపిండాల్లాంటి సున్నిత అవయవాల్లో ఏర్పడే వాపుని తగ్గించే ఔషధంగా ఆయుర్వేదంలో వాడుతుంటారు


తెలుగులో ‘బందన’ అంటే జిగురుగా ఉండే పదార్థం అని! మట్టలోపల జెల్లీ (జిగురు) లాంటి పదార్థం కలిగినది కాబట్టి దీన్ని కలబంద అన్నారు. దీనికి గల చేదు రుచి వలన మనుషులుగానీ, జంతువులుగానీ నేరుగా తినే అవకాశం లేని మొక్క ఇది. ఔషధ విలువలు కలిగిన ద్రవ్యాలను ఆహారపదార్ధాలుగా  మార్చి ఆరోగ్య పరిరక్షణ కలిగించటమే ధ్యేయంగా నలుడు పాకదర్పణం అనే గ్రంథాన్ని ఎన్నో ఏళ్ల క్రితం రాశాడు. కలబంద గుజ్జుని ఆహార పదార్ధంగా ఎలా వండుకోవాలో అందులో వివరించాడు.


ఇలా తయారుచేసుకోవాలి

లేత కలబంద మట్టను తీసుకొని ఉప్పు నీటిలో కొద్దిసేపు నానబెట్టి, దాని నాలుగు వైపులా ఉన్న తొక్కని కత్తితో తొలగించాలి, మట్టలోపల పేరిననెయ్యిలా ఉన్న గుజ్జును తీసుకోండి. ఈ గుజ్జుకు సమానంగా లేత తాటి చెట్టు ఆకుల్ని చిన్నవిగా తరిగి కలిపి కొద్దిగా నీళ్లుపోసి ఉడికిస్తే కలబంద జిగురులో ఉండే చేదు చాలావరకూ పోతుంది. తరువాత నీటిని వార్చేయండి. తాటాకు ముక్కల్ని వేరుచేయండి. ఆ మిగిలిన కలబంద ముద్దలో తగినంత సైంధవలవణం, నెయ్యి వేసి దోరగా వేగే వరకూ వేయించండి. అందులో  అల్లం, వెల్లుల్లి, ధనియాలు జీలకర్ర వగైరా సుగంధ ద్రవ్యాలను మీ రుచికొద్దీ కలిపి మరికొద్దిసేపు ఉడికించండి. ఉల్లి, వెల్లుల్లి తినని వారుంటారు... అందుకని, ఏయే సుగంధద్రవ్యాలను ఎంతెంత మోతాదులో కలపాలో వండేవారి నైపుణ్యానికి వదిలేశాడు నలుడు. ఇలా ఉడికి వేగిన కలబంద గుజ్జుని గుండ్రంగా చాక్‌ పీసుల అకారంలో చేసి, చిన్న ముక్కలుగా తరగండి. బాగా చల్లారాక పచ్చకర్పూరం కలిపి. ఒక గుడ్డలో మూటగట్టి వేడినేతిలో ఉంచి తినేటప్పుడు బైటకు తీసి వడ్డించుకోవలన్నాడు నలుడు. 


ప్రయోజనాలివి!

ఇది ఇమ్యూనిటీని పెంచే ఔషధం. రుచిని పుట్టిస్తుంది. బలకరం. రక్తం, మాంసం, ఎముకల్లాంటి శరీర ధాతువులన్నీ పెరిగేలా చేస్తుందన్నాడు నలుడు. దీనికి విరేచనం ఫ్రీగా అయ్యేలా చేసే గుణం ఉంది. వయో వృద్ధులు, మొలలు, మలబద్ధతతో బాధపడేవారికి కలబంద గుజ్జు బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని పీచుపదార్థాలవలన, చేదు రుచి వలన, కొలెస్ట్రాల్‌ తగ్గడానికి తోడ్పడుతుంది. రక్తంలోకి షుగరు ప్రవేశాన్ని ఆపగలుగుతుంది. గర్భాశయ దోషాలను పోగొడుతుంది. ’రజఃప్రవర్తని వటి‘ అనే ఆయుర్వేదం ఔషధంలో కలబంద గుజ్జు ప్రధానంగా కలుస్తుంది అందుకే కడుపులో నులిపురుగుల్ని చంపుతుంది. అన్ని చర్మ వ్యాధుల్లోనూ ఇది పనిచేస్తుంది. ఆస్తమా, దగ్గు జలుబులను తగ్గిస్తుంది. వేడిని తగ్గించి, అరికాళ్లు, అరిచేతుల్లో మంటల్ని పోగొడుతుంది. దీనికి లైంగికశక్తిని పెంచే గుణం, పురుషుల్లో జీవకణాలను పెంపొందించే గుణం కూడా ఉన్నాయి. సంతానలేమితో బాధపడేవారికి ఇది దివ్యౌషధమే! కలబంద గుజ్జుని తలకు, ముఖానికి పట్టించే అలవాటు మంచిదే! మొటిమలను నివారిస్తుంది. జుత్తుని మెత్తబరుస్తుంది. చర్మానికి కాంతినిస్తుంది.



చిన్నపిల్లలు, గర్భవతులు దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే విరేచనాలు కావటం, అధిక రక్తస్రావం అనేవి దీనివలన కలిగే ప్రమాదం ఉంటుంది. తక్కినవారు మోతాదెరిగి వాడుకోవటం మంచిది. కలబంద మనతో కలిసిపోయే మొక్క.  

- గంగరాజు అరుణాదేవి




Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST