పెరుగుతున్న ఉద్యాన సాగు

ABN , First Publish Date - 2021-04-14T05:46:54+05:30 IST

అరటి, చీనీ ఉద్యాన పంటలకు పులివెందుల ప్రాంతం పెట్టింది పేరు. పులివెందుల, లింగాల, వేముల, వేంపల్లె మండలాల్లో అరటి పంట విస్తారంగా సాగవుతుంది.

పెరుగుతున్న ఉద్యాన సాగు
లింగాలలో సాగైన అరటి

కృష్ణా జలాలతో పెరిగిన భూగర్భ జలాలు

విస్తారంగా సాగైన అరటి, చీనీ, దానిమ్మ 

రాయితీ డ్రిప్‌ పరికరాలు అందక పెరిగిన సాగు భారం


పులివెందుల ప్రాంతం ఉద్యాన వన పంటలకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. అందులోను ముఖ్యంగా అరటి, చీనీ పంటలను అధికంగా సాగు చేస్తారు. లక్షలు ఖర్చు చేసి ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల క్రితం వరకు వేసవి అంటేనే ఉద్యాన పంటల రైతులు హడలిపోయేవారు. కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా కృష్ణా జలాలు రావడం, ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో ఉద్యాన పంటల సాగుకు రైతులు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు. 


పులివెందుల, ఏప్రిల్‌ 13: అరటి, చీనీ ఉద్యాన పంటలకు పులివెందుల ప్రాంతం పెట్టింది పేరు. పులివెందుల, లింగాల, వేముల, వేంపల్లె మండలాల్లో అరటి పంట విస్తారంగా సాగవుతుంది. వేంపల్లె, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల తదితర మండలాల్లో చీనీ పంట అధికంగా సాగు చేస్తారు. ప్రస్తుతం నియోజకవర్గంలో అరటి పంట దాదాపు 28,200 ఎకరాల్లో సాగైంది. చీనీ పంట 32,500 ఎకరాల్లో, దానిమ్మ పంట దాదాపు 1200 ఎకరాల్లో సాగులో ఉంది. వేంపల్లె, వేముల, లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు మండలాల్లో 61,900 ఎకరాల్లో ఉద్యానపంటలు సాగులో ఉన్నాయి. కానీ ఈ ఒక్క ఏడాదే కొత్తగా అరటి 3200 ఎకరాల్లోను, చీనీ 2500 ఎకరాల్లోను, దానిమ్మ 100 ఎకరాల్లోను సాగైంది. గత రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు చీనీ, అరటి రైతులు వేసవిలో హడలిపోయేవారు. భూగర్భజలాలు అడుగంటి తోటలకు నీరు అందించలేక లక్షలు ఖర్చు చేసి కొత్త బోర్లు తవ్వి పంటలు దక్కించుకోలేక రైతులు అప్పుల పాలయ్యేవారు. కొందరు రైతులు తోటల వద్దే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉండేవి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఏడాదికేడాది కొత్త సాగు మాత్రం రైతులు ఆపకుండా చేస్తున్నారు. ఈ ఏడాది అటు పైడిపాళెంలో 6 టీఎంసీలు, ఇటు చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో భూగర్భజలాలు బాగా పెరిగాయి. దీంతో రైతులు ఉద్యానపంటల సాగుకు పెద్దఎత్తున ముందుకొచ్చారు. వేసవిలో కూడా భూగర్భజలాలు తగ్గకుండా రైతులను ఆదుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఉద్యాన పంటలకు ప్రధాన సమస్య రాయితీ డ్రిప్‌ పరికరాలు అందక రైతులకు కొంత సాగుభారం పెరిగింది. గత కొన్నేళ్లుగా రైతులకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు అందలేదు. దీంతో రైతులే పూర్తిగా డ్రిప్‌ పరికరాలకు డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఒక ఎకరానికి డ్రిప్‌ పరికరాలు సమకూర్చాలంటే దాదాపు రూ.50 వేలు ఖర్చు అవుతుంది. చీనీ పంటకు ఎకరానికి డ్రిప్‌ అమర్చాలంటే రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు అందిస్తే మరికొంత మంది రైతులు ఉద్యానపంటల సాగుకు సిద్ధమవుతారు. ఏది ఏమైనా పులివెందుల ప్రాంతంలో ఉద్యానపంటల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారన్నది నగ్నసత్యం. 


సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు అందించాలి..

చీనీ, అరటి పంటలు సాగు చేసే రైతులకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు అందించాలి. నాకున్న పొలంలో 4 ఎకరాల్లో అరటి, 3 ఎకరాల్లో చీనీ పంట సాగు చేశాను. వీటికి డ్రిప్‌ అమర్చుకునేందుకు సబ్సిడీపై ప్రభుత్వం డ్రిప్‌ అందించకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. డ్రిప్‌ కోసం డీడీ చెల్లించి కూడా ఏడాది అవుతున్నా సబ్సిడీపై పరికరాలు అందలేదు. ప్రభుత్వం వెంటనే అందిస్తే ఎంతో మేలు జరుగుతుంది. 

- గోపాల్‌రెడ్డి, రైతు లింగాల

Updated Date - 2021-04-14T05:46:54+05:30 IST