Covid lockdowns: జీ జిన్‌‌పింగ్‌పై చైనీయుల్లో పెరుగుతున్న అసమ్మతి

ABN , First Publish Date - 2022-08-05T15:18:22+05:30 IST

చైనా కమ్యూనిస్టు పార్టీ (China Communist Party) పాలనపై ప్రజల్లో

Covid lockdowns: జీ జిన్‌‌పింగ్‌పై చైనీయుల్లో పెరుగుతున్న అసమ్మతి

బీజింగ్ : చైనా కమ్యూనిస్టు పార్టీ (China Communist Party) పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవుతోంది. ప్రధాన నగరాల్లో ప్రజలు వీథుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వారిని ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచివేస్తోంది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సంబంధిత ఆంక్షలపై ప్రజలు విసుగెత్తిపోతున్నారు. అష్టదిగ్బంధనాల వల్ల తమ జీతాలు ఆలస్యమైపోతున్నాయని, నిత్యావసరాలు అందుబాటులో ఉండటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రజల మధ్య రణరంగం వంటి పరిస్థితులు ఉన్న నగరాల్లో షాంఘై, షాండోంగ్, బీజింగ్, హాంగ్ కాంగ్, అన్హుయి (Shanghai, Shandong, Beijing, Hong Kong, Anhui) ఉన్నాయి. 


చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) పాలనలో అసమ్మతి, నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు వీథుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జీ జిన్‌పింగ్ ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో దేశ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నిక కాబోతున్న సమయంలో ప్రభుత్వంపై ఇటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుండటం అధికార పక్షానికి మింగుడు పడటం లేదు. 


భారత దేశం, అమెరికా, యూరోప్ దేశాల్లో మాదిరిగా చైనాలో నిరసనల గురించి స్పష్టంగా బయటపడదు. అయితే విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 400కుపైగా ప్రజా ఉద్యమాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటిలో సుమారు 120 నిరసనలపై ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడినట్లు తెలుస్తోంది. దీనినిబట్టి జిన్‌పింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రమవుతున్నట్లు స్పష్టమవుతోంది. కొన్నిచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారినట్లు, వాటిపై ప్రభుత్వం అమితమైన నిర్బంధం విధించినట్లు తెలుస్తోంది. దీంతో హింస, అసమ్మతి రోజు రోజుకూ పెరుగుతున్నాయని సమాచారం. 


విరాళంగా వచ్చిన ఆహార విక్రయం

లాక్‌డౌన్ ఆంక్షలు పొడిగించడంతో షాంఘైలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వీరిపై ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరించింది. బీజింగ్‌లో కొందరు నిరసనకారులు కిడ్నాప్‌లకు గురయ్యారు. హాంగ్ కాంగ్‌లో నిరసనకారులపై స్థానిక యంత్రాంగం విరుచుకుపడింది. ప్రజా సేవలను నిలిపేసింది. షాంఘైలోని ఆరు మునిసిపల్ జిల్లాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. 2022 మే 3న కింగ్‌పు జిల్లా టౌన్‌షిప్‌లో పదుల సంఖ్యలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. విరాళాల రూపంలో వచ్చిన ఆహార పదార్థాలను ఓ సూపర్ మార్కెట్ తిరిగి అమ్ముతోందని ఆరోపిస్తూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. 


నిర్బంధ ఓవర్‌టైమ్ డ్యూటీ

సోంగ్‌జియాంగ్ జిల్లాలో లాక్‌డౌన్ సమయంలో నిర్బంధించి, ఓవర్‌టైమ్ పని చేయిస్తున్నందుకు సుమారు 100 మంది కార్మికులు ఓ యాపిల్ సప్లయర్ కంపెనీపై రాళ్ళదాడి చేశారు. కోవిడ్ నిరోధక చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని, అందుకే తమలో చాలా మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని వీరు ఆరోపించారు. 


ప్రొఫెసర్‌ను చితకబాదిన పోలీసులు

పుడోంగ్ జిల్లాలో ఓ ప్రొఫెసర్ ఆహార పదార్థాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళినందుకు, కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయనను చితకబాదారు. దీంతో ఆయన మెదడు, కళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నాయి. షాండోంగ్ ప్రావిన్స్‌లో ఫ్యాక్టరీ వర్కర్లు, ఇతర ఇండస్ట్రీ యూనియన్లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. తమకు జీతాలు ఆలస్యమవుతున్నాయని వీరు ఆరోపించారు. వీరిపై ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడింది. అరెస్టు చేస్తామని పోలీసులు బెదిరించారు. లైషాన్ జిల్లాలో నిరసన తెలుపుతున్న టీచర్లను అరెస్టు చేయడంతో నిరసన ప్రదర్శనలు పెరిగాయి. 


మానవ హక్కుల ఉద్యమకారిణిని అడ్డుకున్న అధికారులు

చైనా రాజధాని నగరం బీజింగ్‌లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిరసనకారులను ప్రభుత్వం కిడ్నాప్ చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. జూలై 20న ఓ మానవ హక్కుల ఉద్యమకారిణి రైలు ఎక్కుతుండగా, ఆమెను ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారు. 


జాతీయ భద్రత చట్టం అమలుతో...

Factwire అనే ఇన్వెస్టిగేటివ్ న్యూస్ ఏజెన్సీ తెరమరుగైంది. దీనికి కారణాలేమిఃటో వెల్లడికాలేదు. ది హాస్పిటల్ అథారిటీ ఎంప్లాయీస్ అలయెన్స్ అనే ప్రజాస్వామ్య అనుకూల సంస్థ కూడా ఒత్తిళ్ళకు గురై కార్యకలాపాలను నిలిపేసింది. జాతీయ భద్రతా చట్టం ఆమోదం పొందిన తర్వాత నుంచి ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. 


Updated Date - 2022-08-05T15:18:22+05:30 IST