గ్రూప్స్‌లో మెరిసిన శ్రీకర్‌

ABN , First Publish Date - 2022-07-07T06:46:34+05:30 IST

ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌) విడుదల చేసిన గ్రూప్‌-1 ఫలితాల్లో నగరానికి చెందిన యువకుడు పోలిపల్లి శ్రీకర్‌ సత్తా చాటాడు.

గ్రూప్స్‌లో మెరిసిన శ్రీకర్‌
శ్రీకర్‌ను అభినందిస్తున్న తండ్రి సత్యనారాయణ, తల్లి పద్మావతి

 సత్తా చాటిన నగర యువకుడు

- డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన పోలిపల్లి శ్రీకర్‌


వెంకోజీపాలెం, జూలై 6: ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌) విడుదల చేసిన గ్రూప్‌-1 ఫలితాల్లో నగరానికి చెందిన యువకుడు పోలిపల్లి శ్రీకర్‌ సత్తా చాటాడు. 15వ వార్డు సింహాద్రిపురం కొండవాలు ప్రాంతానికి చెందిన ఇతను డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికయ్యారు. కలెక్టర్‌ కావడమే లక్ష్యంగా ఐదేళ్లుగా సాధన చేస్తున్న శ్రీకర్‌ నాలుగుసార్లు సివిల్స్‌ రాశారు. ఆశించిన స్థాయిలో ఫలితం రానప్పటికీ నిరాశ చెందకుండా గ్రూప్‌-1కు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకి ఎంపికయ్యారు. టాప్‌-10 అభ్యర్థుల ర్యాంకులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తరువాత స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు ఎంపికైన పోస్టుల వివరాలను తెలియజేసింది. డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు జాబితాలో శ్రీకర్‌ పేరుండడంతో అతడి కుటుంబసభ్యులు, బంధువులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 


చదువులో ఎప్పుడూ ముందే.. 

శ్రీకర్‌ తండ్రి సత్యనారాయణమూర్తి ప్రైవేటు సంస్థలో సివిల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. తల్లి పద్మావతి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌. శ్రీకర్‌ పదో తరగతి వరకు కోటక్‌ స్కూల్‌లో, ఇంటర్మీడియట్‌ నారాయణలో చదివారు. అనంతరం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో సామ్‌సంగ్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికై, మూడేళ్లు బెంగళూరులో పనిచేశారు. అయితే కలెక్టర్‌ కావాలన్న లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌ శిక్షణలో చేరారు. 2017 నుంచి నాలుగుసార్లు సివిల్స్‌ రాయగా, ఒకసారి మెయిన్స్‌ వరకు వెళ్లి నిష్క్రమించారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా 2018లో గ్రూప్‌-1 పరీక్షలకు హాజరయ్యారు.  


లక్ష్యం దిశగా.. 

మన ముందు గొప్ప లక్ష్యం ఉన్నప్పుడు..ఆ దిశగా అడుగులు అంతే బలంగా పడాలని అంటున్నారు శ్రీకర్‌. కలెక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలన్నది తన లక్ష్యమని, అందుకు అనుగుణంగానే కృషిచేస్తున్నానన్నారు. తాజాగా వచ్చిన పోస్టు లక్ష్య సాధనకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చిందని, ఈ విజయంతో సివిల్స్‌లో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశారు.  


ఉమ్మడి జిల్లాలో 330 పాఠశాలలు విలీనం

ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు దూరంలో గల 279 ప్రాథమిక/యూపీ పాఠశాలలు గుర్తింపు

యూపీ పరిధిలోకి 23 ప్రాథమిక పాఠశాలలు

హైస్కూళ్లకు 3 కి.మీ. పరిధిలో ఉన్న 28 ప్రాథమికోన్నత పాఠశాలలు కూడా గుర్తింపు 


విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల విలీనంపై దాదాపు స్పష్టత వచ్చింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 330 ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలలు సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నట్టు అధికారులు చెబుతున్నారు.ఉన్నత పాఠశాలలకు ఒక కిలోమీటరు పరిధిలో 279 ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలలు వున్నట్టు గుర్తించారు. వీటన్నింటినీ విలీనం చేయనున్నారు. అలాగే మరో 23 ప్రాథమిక పాఠశాలలను కిలోమీటరు దూరంలో గల యూపీ పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ఇక ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల పరిధిలో మరో 28 ప్రాథమికోన్నత పాఠశాలలు వున్నట్టు గుర్తించారు. వీటిని కూడా విలీనం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. విలీనం కానున్న ప్రాథమిక పాఠశాలలను చూస్తే...కశింకోట, ఎస్‌.రాయవరం మండలాల్లో 18 చొప్పున, అనకాపల్లిలో 13, చోడవరంలో 12, ఆనందపురం, ఎలమంచిలి, అచ్యుతాపురం, నక్కపల్లి, గొలుగొండ మండలాల్లో 11 చొప్పున, దేవరాపల్లిలో 10, పద్మనాభం, కె.కోటపాడు, నాతవరం మండలాల్లో తొమ్మిది వంతున ఉన్నాయి. మిగిలిన మండలాల్లో నాలుగు నుంచి ఏడెనిమిది పాఠశాలలు ఉన్నాయి. కాగా యూపీ పాఠశాలలకు ఒక కిలోమీటరు దూరంలో గల 23 ప్రాథమిక పాఠశాలలను పరిశీలిస్తే అనకాపల్లిలో నాలుగు, రావికమతం, భీమిలి, దేవరాపల్లిల్లో మూడేసి, గొలుగొండ, మునగపాకలో రెండేసి, ఇంకా సబ్బవరం, కె.కోటపాడు, పద్మనాభం, నాతవరం మండలాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఏజెన్సీలో కంటే మైదాన ప్రాంతంలో ఎక్కువ పాఠశాలలు సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం కాబోతున్నాయి.


మృత్యుశకటం

రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న లారీ

ఇద్దరి మృతి...మృతుల్లో ఒకరు రైల్వేలో లోకో పైలట్‌

మరొకరు యువకుడు...ఐదు నెలల క్రితమే వివాహం


ఎన్‌ఏడీ జంక్షన్‌, జూలై 6: అదుపుతప్పిన లారీ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ దుర్ఘటన మంగళవారం అర్ధరాత్రి  బుచ్చిరాజుపాలెంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుజాతనగర్‌ సమీపంలోని పాపయ్యరాజుపాలెంలో నివాసం వుంటున్న కె.వెంకట కృష్ణమోహన్‌ (56) రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు. ఆయన విధులు ముగించుకుని మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. అలాగే పూరెడ్డి మురళీకృష్ణ (33) ఎన్‌ఏడీ జంక్షన్‌లో టిఫిన్‌ చేసి శ్రీనివాసనగర్‌లో గల తన నివాసానికి ద్విచక్ర వాహనంపై పయనమయ్యారు. ఇరువురూ ఎన్‌ఏడీ వైపు నుంచి పెందుర్తి వైపు వెళుతుండగా బుచ్చిరాజుపాలెం వద్ద ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి వీరి పైనుంచి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో కె.వెంకటకృష్ణమోహన్‌ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, తీవ్ర గాయాలకు గురైన మురళీకృష్ణను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. లారీ డ్రైవర్‌ తప్పించుకుని పారిపోయేందుకు యత్నంచగా స్థానికులు పట్టుకున్నారు. కాగా మృతిచెందిన వెంకటకృష్ణమోహన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మురళీకృష్ణకు ఐదు నెలల క్రితం వివాహమైంది. భార్య, తల్లి ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎయిర్‌పోర్టు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2022-07-07T06:46:34+05:30 IST