గులాబీ దళంలో అసంతృప్తి గళం

ABN , First Publish Date - 2022-08-20T04:54:05+05:30 IST

టీఆర్‌ఎ్‌సకు కంచుకోటగా మారిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కొంతకాలంగా గ్రూపులు, అసంతృప్తివాదులతో పార్టీ సతమతమవుతున్నది. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి టి.హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాల్లోనే పార్టీ ఏకతాటిపై ఉన్నది. దుబ్బాకలో పార్టీ ఎమ్మెల్యే లేకపోవడంతో అక్కడ శ్రేణులను ఒక్కతాటిపైకి

గులాబీ దళంలో అసంతృప్తి గళం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గ్రూపుల గోల

ఎమ్మెల్యేల తీరుపై కార్యకర్తల్లో వ్యతిరేకత

టికెట్ల కోసం నేతల పోటాపోటీ

నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి : టీఆర్‌ఎ్‌సకు కంచుకోటగా మారిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కొంతకాలంగా గ్రూపులు, అసంతృప్తివాదులతో పార్టీ సతమతమవుతున్నది. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి టి.హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాల్లోనే పార్టీ ఏకతాటిపై ఉన్నది. దుబ్బాకలో పార్టీ ఎమ్మెల్యే లేకపోవడంతో అక్కడ శ్రేణులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మెదక్‌ ఎంపీ, సిద్దిపేట జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఇక మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్నా  వారిపై సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొన్నది.


మెదక్‌ నియోజకవర్గంలో...

మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి శేరిసుభా్‌షరెడ్డి మధ్య రాజకీయాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో వీరిద్దరిలో ఒకరు పాల్గొంటే మరొకరు పాల్గొనడం లేదు. గత నెలలో భారీ వర్షాలకు పలు చెక్‌డ్యాంలు నిండగా.. ఎవరికి వారు వేర్వేరుగా గంగమ్మ పూజలు నిర్వహించారు. తమ కృషితోనే చెక్‌డ్యాంల నిర్మాణం సాధ్యమైందని చెప్పుకున్నారు. మార్చిలో ఎమ్మెల్సీ సుభా్‌షరెడ్డి కూచన్‌పల్లిలో చండీయాగం నిర్వహించారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి భార్య, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కానీ స్థానిక ఎమ్మెల్యే పద్మారెడ్డి మాత్రం హాజరుకాలేదు. ఏడుపాయలకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రెండేళ్ల కిందట రూ.12కోట్లు మంజూరు చేయగా తామే నిధులిప్పించామని ఎవరికివారు ప్రకటనలు ఇచ్చుకున్నారు. 


నర్సాపూర్‌లో గ్రూపు రాజకీయాలు

నర్సాపూర్‌ నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి వర్గాలుగా విడిపోయింది. గతంలో సునీతారెడ్డి జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని పాంత్రాల నుంచి కార్యకర్తలను రప్పించి, భారీ ర్యాలీతో బలప్రదర్శన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మోకాలికి ఆపరేషన్‌ చేయించుకుని రెండు నెలల తర్వాత నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి తన సత్తా చూపించారు. మరోవైపు బీసీలకు పార్టీలో ప్రాధాన్యత లోపించిందని విమర్శిస్తూ నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. 


అందోలులో ఎమ్మెల్యే వర్సెస్‌ జడ్పీ చైర్‌పర్సన్‌

అందోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజశ్రీజైపాల్‌రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. క్రాంతికిరణ్‌కు, కార్యకర్తలకు మధ్య గ్యాప్‌ ఏర్పడినట్టు తెలుస్తున్నది. మండలానికో నాయకుడిని చేరదీసి వారి సూచనల మేరకే పని చేస్తున్నారన్న అసంతృప్తి కార్యకర్తల్లో ఉన్నది. మరోవైపు అధికార, అనధికార వ్యవహారాల్లో ఆయన సోదరుడు కీలకంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. 


పటాన్‌చెరులో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూటమి

పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా కూటమి ఏర్పడినట్టు తెలుస్తున్నది. జిన్నారం మండలానికి చెందిన పార్టీ నాయకుడు కొలను బాల్‌రెడ్డి, రామచంద్రాపురం మండలానికి చెందిన ముఖ్య నాయకుడొకరు, పటాన్‌చెరు మండలంలో ఇటీవలి కాలంలో వార్తల్లో కెక్కిన సర్పంచ్‌ కలిసి అంతర్గతంగా రాజకీయాలు సాగిస్తున్నట్టు ప్రచారమవుతున్నది. శాసన మండలి మాజీ ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్యెల్యే కె.సత్యనారాయణ కూడా ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. బొల్లారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్యే నిర్ణయించిన అభ్యర్థిని కాదని తన సతీమణి రోజాను చైర్‌పర్సన్‌గా చేసి బాల్‌రెడ్డి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల హామీలను నెరవేర్చలేకపోతున్నామని పార్టీకి చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లలితాసోమిరెడ్డి రెండు నెలల క్రితం తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. దీంతో ఆయా హామీలను ప్రభుత్వం నెరవేరుస్తున్నది. 


సంగారెడ్డిలో టిక్కెట్‌ లొల్లి

సంగారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్‌తో పాటు టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాజేందర్‌, సంగారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి భర్త రవి, పార్టీ నాయకుడు డాక్టర్‌ జి.శ్రీహరి, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్యయాదవ్‌, ప్రస్తుత జడ్పీటీసీ సుజాత భర్త మరోహర్‌గౌడ్‌ తదితరులు పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీని బెదిరించినంత పనిచేసి రవి తన భార్య విజయలక్ష్మిని చైర్‌పర్సన్‌ను చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వర్గీయులు చాలా వరకు టీఆర్‌ఎ్‌సలో చేరినా.. ఇప్పటికీ పలువురు ఆయనతో టచ్‌లో ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


జహీరాబాద్‌లో ఫోన్లలో రాజకీయం

జహీరాబాద్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మాణిక్‌రావు ఉన్నా.. ఈసారి టిక్కెట్టు కోసం రాష్ట్ర వైద్య సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌ ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ వర్గం ఆయనతో టచ్‌లో ఉన్నారు. ఈ విషయంపై ఎమ్యెల్యే మాణిక్‌రావు గతంలోనే మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అప్పటి నుంచి నియోజకవర్గానికి రావడం మానేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఫోన్లలోనే తనకు అనుకూలంగా నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. మరోవైపు సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్‌ ఇటీవల నియోజకవర్గం అంతటా పాదయాత్ర చేస్తున్నారు.


నారాయణఖేడ్‌లో నాయకుల్లో అసంతృప్తి

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డిపై పార్టీలో అసంతృప్తి లేకపోయినా.. చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, ఇతరాత్రా పనులు జరగకపోవడంపై కిందిస్థాయి నాయకుల్లో అసంతృప్తి ఉన్నది.అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు రావడంలేదు. మరోవైపు పంచాయతీలకు నిధులు మంజూరు కాకపోవడంపై సర్పంచ్‌లు నిరాశతో ఉన్నారు.

Updated Date - 2022-08-20T04:54:05+05:30 IST