నిరుద్యోగులకు మరో శుభవార్త.. నెలాఖరులోగా గ్రూపు-4 నోటిఫికేషన్‌!

ABN , First Publish Date - 2022-05-20T15:47:49+05:30 IST

రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. ఖాళీగా ఉన్న గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను నెలాఖరులోగా జారీ చేయాలని భావిస్తోంది. సుమారు 9,168 పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలను...

నిరుద్యోగులకు మరో శుభవార్త.. నెలాఖరులోగా గ్రూపు-4 నోటిఫికేషన్‌!

9,168 పోస్టుల భర్తీకి సన్నద్ధం

29వతేదీ లోగా రోస్టర్‌ పాయింట్ల వివరాలివ్వాలి

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియామకాలు

అన్ని శాఖల అధిపతులతో సీఎస్‌ సోమేశ్‌ సమీక్ష


హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. ఖాళీగా ఉన్న గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను నెలాఖరులోగా జారీ చేయాలని భావిస్తోంది. సుమారు 9,168 పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలను  అధికారులు తీసుకుంటున్నారు. గ్రూప్‌-4 పోస్టుల నోటిఫికేషన్‌ జారీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డితోపాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రూప్‌-4 కేడర్‌ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం పోస్టులు స్థానికులకే కేటాయిస్తామని, మిగిలిన 5 శాతం కూడా స్థానికులకే దక్కుతాయని ఈ సందర్భంగా సీఎస్‌ చెప్పారు. ఇటీవల, గ్రూప్‌-1 కింద 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించిందన్నారు. 


పోలీసు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ కూడా కొనసాగుతుండగా, టెట్‌ నిర్వహణకోసం విద్యాశాఖకు కూడా క్లియరెన్స్‌ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గ్రూప్‌-4 కు సంబంధించి రోస్టర్‌ పాయింట్ల వివరాలతో పాటు సంబంధిత సమాచారాన్ని ఈ నెల 29లోగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అందజేయాలని అధికారులను సీఎస్‌ సోమేశ్‌ ఆదేశించారు. అన్ని జూనియర్‌ అసిస్టెంట్‌ లేదా తత్సమాన పోస్టులకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ క్యాడర్‌లలో ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి, తద్వారా ఏర్పడ్డ జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలను కూడా నోటిఫై చేయాలని పేర్కొన్నారు. అన్ని విభాగాల నుంచి సమాచారం వస్తే....ఈ నెలాఖరులోగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా, ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ అంజనీ కుమార్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ శివశంకర్‌, టీఎ్‌సపీఎస్సీ కార్యదర్శి  అనితా రామచంద్రన్‌, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, ఎస్సీ అభివృద్థి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, అటవీ శాఖ పీసీసీఎఫ్‌ డోబ్రియల్‌, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T15:47:49+05:30 IST