చెక్‌డ్యాంల నిర్మాణంతోనే భూగర్భ జలాల పెరుగుదల

ABN , First Publish Date - 2022-06-23T05:36:22+05:30 IST

మంజీరా నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంల నిర్మాణాలతో బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాలకు వరం లాంటిదని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

చెక్‌డ్యాంల నిర్మాణంతోనే భూగర్భ జలాల పెరుగుదల
బాన్సువాడ శివారులోని చింతల్‌నాగారం వద్ద చెక్‌ డ్యాం నిర్మాణ పనులను పరిశీలిస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

- 365 రోజులు నీటితో నిండుగా చెక్‌డ్యాంలు

- చెక్‌డ్యాంలతో భూగర్భ జలాలు పెరిగి వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి

- రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి


బాన్సువాడ, జూన్‌ 22: మంజీరా నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంల నిర్మాణాలతో బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాలకు వరం లాంటిదని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణ శివారులోని చింతల్‌ నాగారం వద్ద రూ.15కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్‌డ్యాంల నిర్మాణాలతో మంజీరా నదిలో 365 రోజులు నీటితో నిండుగా ఉంటుందన్నారు. నది నుంచి ఇరువైపుల 1 కిలో మీటరు దూరం వరకు భూగర్భ జలాలు పెరిగి వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. స్థానికంగా వచ్చిన వర్షాల నీరు నదిలో నిలువకుండా గోదావరిలోకి వృథాగా వెళ్లిపోయేవని ఇప్పుడు చెక్‌డ్యాంల నిర్మాణంతో నీటితో నిండుగా ఉంటున్నాయన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల రైతులకు ఇక నీటి కొరత ఉండదన్నారు. మంజీరా నదిపై బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో మొత్తం 6 చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నామన్నారు. ఏడాది పొడవునా నీటితో నిండుగా ఉంటుందన్నారు. గతంలో భారీ వర్షాలు వరదలు వచ్చి నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు తెరిచిన సమయంలోనే మంజీరా నదిలో నీరు ఉండేదని ఇప్పుడు ఏళ్ల తరబడి నీటి నిలువ ఉంటుందన్నారు. రైతులకు ఇదొక మంచి వరం లాంటిదని రెండు పంటలకు నీరు పుష్కలంగా అందుతుందని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-06-23T05:36:22+05:30 IST