అడుగంటుతున్న భూగర్భజలాలు

ABN , First Publish Date - 2022-05-26T06:01:48+05:30 IST

వర్షాకాలంలో పైకి ఉబికి వచ్చిన భూగర్భజలాలు రోహిణికార్తె వచ్చేసరికి పాతాళానికి పడిపోతున్నాయి. రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతుండడంతో బోరుబావులన్నీ వట్టిపోతున్నాయి.

అడుగంటుతున్న భూగర్భజలాలు

 - గంగాధర మండలంలో 23.53 మీ.కు పడిపోయిన నీటిమట్టం

- చొప్పదండిలో 13.16, సైదాపూర్‌లో 12.36 మీ. లోతున నీరు

- పట్టణ ప్రాంతాల్లో ఎండిపోతున్న బోర్లు

- వాటర్‌ ట్యాంకర్లను ఆశ్రయించే పరిస్థితి 

- రోహిణిలో మరింత పెరుగనున్న నీటి కొరత 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వర్షాకాలంలో పైకి ఉబికి వచ్చిన భూగర్భజలాలు రోహిణికార్తె వచ్చేసరికి పాతాళానికి పడిపోతున్నాయి. రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతుండడంతో బోరుబావులన్నీ వట్టిపోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయి ప్రజలు ప్రైవేట్‌ వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఏప్రిల్‌ నెలలో జిల్లాలో గరిష్టంగా 23.53 మీటర్ల లోతుకు, సగటున 8.16 మీటర్ల లోతుకు పడిపోయాయి. జిల్లాలోని గంగాధర మండలంలో భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ మండలంలో జనవరిలో 14.87 మీటర్ల లోతున నీళ్లు లభించగా, ఫిబ్రవరిలో 16.28 మీటర్ల లోతుకు, మార్చిలో 19.26 మీటర్ల లోతుకు, ఏప్రిల్‌లో 23.53 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. అలాగే చొప్పదండి మండలంలో 13.16 మీటర్లు, సైదాపూర్‌ మండలంలో 12.36 మీటర్లు, తిమ్మాపూర్‌ మండలంలో 11.33 మీటర్లు, చిగురుమామిడి మండలంలో 11.03 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడంతో అక్కడ బోరుబావులు త్వరితగతిన ఎండిపోతున్నాయి. వరి కోతలు పూర్తయినా భూగర్భజలాలు గతేడాదికన్నా మరింత లోతుకు వెళ్లడం జిల్లాలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయని స్పష్టమవుతున్నది. గత సంవత్సరం ఏప్రిల్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొనగా ఈసారి మరింత ఎక్కువ తీవ్రత ఉన్నది. 


రానున్న రోజుల్లో మరింత లోతుకు భూగర్భ జలాలు


ప్రస్తుతం జిల్లాలోని జమ్మికుంట మండలంలో 9.72, ఇల్లందకుంటలో 7.40 మీటర్లు, గన్నేరువరంలో 5.78 మీటర్లు, హుజూరాబాద్‌లో 5.22 మీటర్లు, శంకరపట్నంలో 5 మీటర్లు, కరీంనగర్‌ మండలంలో 9.02, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 3.42 మీటర్లు, మానకొండూర్‌లో 1.80 మీటర్లు, రామడుగులో 8.43 మీటర్లు, తిమ్మాపూర్‌లో 6.15 మీటర్లు, వీణవంకలో 3.90 మీటర్లకు భూగర్భజలాలు పడిపోయాయి. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మరింత తీవ్రమయ్యాయి. ఎండ 40 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతున్న దాని తీవ్రతమాత్రం 45 నుంచి 48 సెల్సియస్‌ ఉన్నప్పటి ప్రభావం  ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటున్నది. ఎండలు మరింత పెరగడంతో భూగర్భ జలాలు వచ్చే 15 రోజుల్లో గరిష్ట స్థాయికి పడిపోవచ్చని, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బోరుబావుల కింద సేద్యం చేసేవారు వరినార్లు పోసుకోవడానికి ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు. మృగశిర ప్రారంభం తర్వాత వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు పెరిగి నార్లు పోసుకోవడానికి వీలవుతుంది. నైరుతీ రుతుపవనాలు అండమాన్‌ దీవులకు వచ్చి ఆ తర్వాత కదలిక లేకపోవడంతో కేరళకు చేరడానికి ఎన్ని రోజులు పడుతుందో ఆ తర్వాత అవి దేశవ్యాప్తంగా ఎప్పుడు విస్తరిస్తాయో ఇప్పుడిప్పుడే తెలియడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో నీటి కటకట తప్పకపోవచ్చు. మిషన్‌ భగీరథ ఉన్న గ్రామాల్లో సమస్య తీవ్రత పెద్దగా లేకపోయినా ఆ పథకం పూర్తికాని జనావాసాల్లో, మరమ్మతులు జరుగుతున్న గ్రామాల్లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధానంగా పట్టణ, మండల కేంద్రాల్లో బోరుబావులు వినియోగించుకునేవారు నీటి తీవ్రతను ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-05-26T06:01:48+05:30 IST