పెళ్లిలో దుఃఖం ఆపుకోలేక బోరున ఏడ్చి..!

ABN , First Publish Date - 2021-01-16T22:15:24+05:30 IST

వివాహం తర్వాత అప్పగింతల సమయంలో వధువు కన్నీరు పెట్టుకోవడం పరిపాటి. పెంచి పెద్ద చేసి

పెళ్లిలో దుఃఖం ఆపుకోలేక బోరున ఏడ్చి..!

గల్ఫ్‌లో హైదరాబాదీ వరుడి భావోద్వేగం

తల్లిదండ్రులు రాలేకపోవడంతో కంటతడి


(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వివాహం తర్వాత అప్పగింతల సమయంలో వధువు కన్నీరు పెట్టుకోవడం పరిపాటి. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలి వెళ్లడమంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. కానీ.. గల్ఫ్‌లో గురువారం రాత్రి తన వివాహం సందర్భంగా వరుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. వాస్తవానికి ఎంతో ఆడంబరంగా.. తల్లిదండ్రులు, బంధువల దీవెనలతో తన పెళ్లి జరగాలని అతడు ఆశ పడ్డాడు. గతంలో ఒక సారి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు వివాహానికి ముహూర్తం కుదిరినా వీసా కారణాలతో భారత్‌లో ఉన్న తల్లిదండ్రులు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో అతడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. తల్లిదండ్రులు, బంధువులతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ బోరున ఏడ్చేశాడు ఈ ప్రవాసీ వరుడు.


హైదరాబాద్‌లోని సంతోష్‌ నగర్‌కు చెందిన మొహమ్మద్‌ ఇందాద్‌ అలీ సౌదీ అరేబియాలో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. సౌదీలో నివసిస్తున్న హైదరాబాద్‌ యువతితో ఏడాది క్రితం అతడికి పెద్దలు వివాహం నిశ్చయించారు. గత ఏడాది మార్చిలో వివాహానికి ఇరువర్గాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. కానీ, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాయిదా పడింది. మరోవైపు వధువు తండ్రి కూడా మాతృదేశానికి తిరిగి వెళ్లాలనుకొనే ప్రయత్నంలో వధువు వీసా కూడా సమస్యగా మారింది. దీంతో వరుడి తల్లిదండ్రులు లేకుండానే సౌదీలో ఉన్న కొంత మంది బంధువుల సమక్షంలో గురువారం రాత్రి పెళ్లి జరిగింది. వీడియోకాల్‌లో హైదరాబాద్‌లో ఉన్న తల్లితండ్రులు, ఇతర బంధువులను చూసిన వరుడు ఇందాద్‌ అలీ తన దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీరు మున్నీరైన దృశ్యాన్ని చూసి వచ్చిన అతిఽథులందరూ ఒక్క సారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా ప్రభావంతో గల్ఫ్‌లో పని చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రవాసీయుల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కొన్ని వివాహాలు రద్దు కాగా, మరి కొన్ని ఇలా అనూహ్య పరిస్థితుల్లో జరుగుతున్నాయి.


Updated Date - 2021-01-16T22:15:24+05:30 IST