ముంచుతున్నా..పట్టించుకోరు!

ABN , First Publish Date - 2022-06-29T06:55:26+05:30 IST

ఆరుగాలం శ్రమించే రైతుకు కష్టాలు తప్పడంలేదు. ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

ముంచుతున్నా..పట్టించుకోరు!
శిథిలావస్థలో దిగువాలా గ్రోయిన్స్‌ (ఫైల్‌ ఫొటో)

  శిథిలావస్థకు చేరిన గ్రోయిన్స్‌
  ఏటా పంటలు అంతంత మాత్రమే
 ప్రభుత్వాలు మారినా ఎవరికీ పట్టదు
  గ్రోయిన్స్‌ పాడై సముద్రంలోకి వృథాగా నీరు
  ఇసుక తవ్వకాలతోనూ గ్రోయిన్స్‌కు దెబ్బ

కోటనందూరు, జూన్‌ 28: ఆరుగాలం శ్రమించే రైతుకు కష్టాలు తప్పడంలేదు. ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మండలంలోని రైతులు  33,500 ఎకరాల్లో సాగు చేస్తుండగా, అందులో తాండవ రిజర్వాయర్‌ ద్వారా 18 వేల ఎకరాలు, వర్షాధారం ద్వారా 15,500 ఎకరాలకు నీరందుతోంది. నిజానికి తాండవ నది ఆధారంగానే పంటలకు సమృద్ధిగా నీరు అందించాలనే లక్ష్యంతో పలు ఆయకట్టులు ఏర్పాటుచేశారు. అయితే గత దశాబ్దాకాలం నుంచి తుఫాన్ల దెబ్బకు వాటి గ్రోయిన్స్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా తాండవ నదిపై నిమ్మకట్టు ద్వారా 5 వేల ఎకరాలు, అల్లిపూడి గ్రోయిన్‌ ద్వారా 1350 ఎకరాలు, కామినీడు గ్రోయిన్‌ ద్వారా 1322 ఎకరాలు, కొట్టాం గ్రోయిన్‌ ద్వారా 1400 ఎకరాలు, దిగవాలా గ్రోయిన్‌ ద్వారా 1300 ఎకరాలకు కోటనందూరు గ్రోయిన్‌ ద్వారా 1400 ఎకరాలకు సాగునీరు తాండవ రిజర్వాయర్‌ ద్వారా మళ్లిస్తున్నారు. ఇక ఈ గ్రోయిన్స్‌ను శాశ్వతంగా నిర్మించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్ల నిధులతో లోపభూష్ట నిర్మాణాలు చేపట్టడంతో నిధులు నీటిలో కలిసిపోయాయి. అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రెండు కోట్ల రూపాయల తో పనులు చేపట్టారు. కానీ 2019 వరదలకు గ్రోయిన్స్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ మూడే ళ్ల హయాంలో దెబ్బతిన్న గ్రోయిన్స్‌కు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. ఖరీ్‌ఫ వచ్చిందంటే రైతుకు కష్టాలు తప్పడంలేదు. నీరంతా సముద్రంలోకిపోవడంతో రైతులు వర్షాధారంపైనే ఆధారపడాల్సి వస్తోంది.
ఇసుక తవ్వకాలతో గ్రోయిన్స్‌ శిథిలం
ఇసుక మాఫియా తాండవ నదిలోని ఇసుకను విక్రయించడం ద్వారా గత మూడేళ్లుగా కోట్లు గడిస్తున్నారు. రైతులకు సాగు నీరందించే గ్రోయిన్స్‌కు అటుఇటు విచ్చలవిడిగా ఇసుక తవ్వేస్తుడడంతో గ్రోయిన్స్‌ బలహీనపడుతున్నాయి. కనీసం పది మీటర్ల నిబంధన ఉన్నప్పటికీ యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇలా చేయడం వల్ల గ్రోయిన్స్‌కు గండ్లు పడి కొట్టుకుపోతున్నాయి. భారీఎత్తున ఇసుక దందా జరుగుతున్నా గ్రోయిన్స్‌ను పరిరక్షించవలసిన ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో విమర్ళలు వెలువెత్తుతున్నాయి. అధికారులు వీటిపై దృష్టి సారించి రైతుల ప్రయోజనాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.
 రూ.1.8 కోట్లతో గ్రోయిన్స్‌ ఆధునికీకరణకు చర్యలు
తాండవనదిపై నిర్మించిన గ్రోయిన్స్‌ ఆధునికీకరణకు రూ1.80 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. కలెక్టర్‌ అనుమతి కోసం చూస్తున్నాం. వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తాం. అందులో కామినీడు గ్రోయిన్‌కు రూ.1.30 కోట్లు, అల్లిపూడి గ్రోయిన్స్‌కు రూ. 30 లక్షలు, దిగువాలా గ్రోయిన్స్‌కు రూ. 34 లక్ష లతో పనులు చేస్తాం. ప్రసుత్తం అవసరాలకోసం తాత్కాలికంగా ఇసుక మూటలు వేసి నీరందించే ఏర్పాట్లు చేస్తాం.
-కిషోర్‌కుమార్‌, ఏఈ ఇరిగేషన్‌

Updated Date - 2022-06-29T06:55:26+05:30 IST