కస్తూర్బాల్లో ‘కిరాణా’ కక్కుర్తి!

ABN , First Publish Date - 2021-10-02T04:30:30+05:30 IST

కస్తూర్బా పాఠశాలల్లో అవినీతి రాజ్యమేలుతోంది. విద్యార్థులకు అందించే పుస్తకాలు, దుస్తులతో పాటు ఆహార పదార్థాల పంపిణీలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. కొంతమంది నేతల జోక్యంతో తాత్కాలిక టెండర్లతో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. వసతిగృహాలకు నాసిరకం సరుకులు అందజేస్తూ.. కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు.

కస్తూర్బాల్లో ‘కిరాణా’ కక్కుర్తి!
కస్తూర్బా పాఠశాల

- తాత్కాలిక టెండర్లతో కాలయాపన

- ఐదు రోజుల్లోనే ఆర్డర్ల మార్పు

- నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు

- వసతిగృహాలకు నాసిరకం సరుకుల పంపిణీ

(కలెక్టరేట్‌)

కస్తూర్బా పాఠశాలల్లో అవినీతి రాజ్యమేలుతోంది. విద్యార్థులకు అందించే పుస్తకాలు, దుస్తులతో పాటు ఆహార పదార్థాల పంపిణీలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. కొంతమంది నేతల జోక్యంతో తాత్కాలిక టెండర్లతో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. వసతిగృహాలకు నాసిరకం సరుకులు అందజేస్తూ.. కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో సమగ్ర శిక్షాభియాన్‌ ఆధ్వర్యంలో 32 కస్తూర్బా పాఠశాలలు, 14 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో వసతిగృహాలకు కూరగాయలు, పప్పులు, ఉప్పులు, కారం, పసుపు, నూనె, ఇతర కిరాణా సామగ్రి సరఫరాకు ఏడాదికోసారి టెండర్లు పిలవాలి. అధికారులు టెండర్లు వేయకుండా కాలయాపన చేస్తున్నారు. కూరగాయలకు మాత్రమే టెండర్లు పిలిచారు. పప్పులు, ఉప్పులు తదితర కిరాణా సామగ్రికి సంబంధించి రెండేళ్లుగా(2018-19 నుంచి) టెండర్లు వేయడం లేదు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో టెండర్లు వాయిదా పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబరు 4న పప్పులు, ఉప్పులకు సంబంధించి సాయిహారిక కేటరింగ్‌, శ్రీగురు రాఘవేంధ్ర  ట్రేడర్స్‌, శ్రీ సాయి మణికంఠ ట్రేడర్స్‌కు తాత్కాలిక ఆర్డర్స్‌ అందించారు. ఐదు రోజుల వ్యవధిలోనే అధికారులు వాటిని కాదని 9న శివగంగా ట్రేడర్స్‌, జయలక్ష్మి ట్రేడర్స్‌, అనంత రామకృష్ణ ఏజెన్సీలకు కొత్తగా తాత్కాలిక ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. ఐదురోజుల వ్యవధిలోనే ఆర్డర్లు రద్దు చేయడంతో కొంతమంది కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. టెండర్ల వెనుక కొంతమంది అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ఒక కీలక నేత కుమారుడు అధికారులపై ఒత్తిడి పెంచి టెండర్లు వేయకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. తమకు కావాల్సిన వారికే తాత్కాలిక టెండర్లు అందించి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా టెండర్‌లో ధరలు కోట్‌ చేయాలి. కస్తూర్బా పాఠశాలల్లో ఎస్‌వోలు(ప్రత్యేకాధికారులు), ఆదర్శ పాఠశాలల్లో ప్రిన్సిపాల్స్‌ ఆధ్వర్యంలో సరుకులు అందజేయాలి. పాత ధరలకు టెండర్లు వేస్తూ.. కస్తూర్బాలో ప్రత్యేకాధికారులతో కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం వస్తువులు అందిస్తున్నారు. అత్యధికంగా బిల్లులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా తాత్కాలిక టెండర్లతోనే కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. తాత్కాలిక టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు. కొత్తగా టెండర్లు పిలిచి.. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా... కాంట్రాక్టర్లు కొంతమంది నేతల ఇళ్లకు ప్రతినెలా నాణ్యమైన సరుకులు అందజేసి.. వసతిగృహాలకు  నాసిరకమైనవి సరఫరా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


 అక్రమాలను సహించేది లేదు

తాత్కాలిక టెండర్లలో అక్రమాలు జరిగితే సహించేది లేదు.  టెండర్లు వేసినవారు ముందుకు రాలేదు. దీంతో వాటిని రద్దు చేసి కొత్తవారికి తాత్కాలిక టెండర్లు  ఇచ్చాం. మరికొద్ది రోజుల్లో టెండర్లు పిలుస్తాం.  

- తిరుమల చైతన్య, పీవో, సమగ్ర శిక్షాభియాన్‌

Updated Date - 2021-10-02T04:30:30+05:30 IST