టీఏ కోసం గ్రేహౌండ్స్‌ ఎదురుచూపులు!

ABN , First Publish Date - 2020-07-11T08:49:57+05:30 IST

గడచిన 8నెలలుగా ప్రయాణ భత్యం(టీఏ) అందకపోవడంతో గ్రేహౌండ్స్‌ బలగాలు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

టీఏ కోసం గ్రేహౌండ్స్‌ ఎదురుచూపులు!

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): గడచిన 8నెలలుగా ప్రయాణ భత్యం(టీఏ) అందకపోవడంతో గ్రేహౌండ్స్‌ బలగాలు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కానిస్టేబుల్‌ స్థాయి నుంచి అధికారుల స్థాయి వరకూ.. వారి విధి నిర్వహణ విభాగాలు, హోదాల ప్రకారం రూ. 4వేల నుంచి రూ. 7వేల వరకూ ప్రతి నెలా టీఏ అందుతుంది. అయితే.. నిధుల కొరత కారణంగా గడచిన 8నెలలుగా వారికి అలవెన్సులు అందలేదు. ఇతర పోలీసు విభాగాలతో పోలిస్తే.. గ్రేహౌండ్స్‌ విధులు కఠినంగా ఉంటాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా సరిహద్దు జిల్లాలు, అటవీ ప్రాంతాల్లో ఈ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుంటాయి.


సీఎంతో పాటు ఇతర ప్రముఖుల పర్యటనల సమయంలోనూ అవసరాన్ని బట్టి మొహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో వీరికి వేతనం, భత్యాలు ఎక్కువగానే లభిస్తాయి. సుమారు 2 వేల మంది గ్రేహౌండ్స్‌ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేస్తుంది. గత బడ్జెట్‌లో నిధులు సరిపోకపోవడంతో వీరి టీఏ నిలిచిపోయింది. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ గ్రేహౌండ్స్‌ సిబ్బంది ఎదురుచూపులకు నిరాశే ఎదురైంది. కానిేస్టబుల్‌ స్థాయిలో ఒక్కొక్కరికి రూ. 30 వేలకు పైగానే బకాయిలు రావాల్సి ఉంది. కరోనా కారణంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో.. టీఏలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2020-07-11T08:49:57+05:30 IST