నిర్లక్ష్యం.. పొరపాటు

ABN , First Publish Date - 2020-12-03T05:46:51+05:30 IST

ఎన్నికల నిర్వహణలో జీహెచ్‌ఎంసీ వైఫల్యం మరోసారి తేటతెల్లమైంది.

నిర్లక్ష్యం.. పొరపాటు

ఎన్నికల నిర్వహణలో జీహెచ్‌ఎంసీ వైఫల్యం

ఏర్పాట్ల నుంచి పోలింగ్‌ లెక్కల 

వరకు అంతా గందరగోళం

బుధవారం కూడా మూడు సార్లు సవరణ

మొదటి నాలుగు గంటలు 11.62 శాతమే

చివరి గంటలో 10 నుంచి 12 శాతం

శిక్షణ లేని పోలింగ్‌ సిబ్బందితో విధులు

లెక్కలు చేయడంలో కొందరు విఫలం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణలో జీహెచ్‌ఎంసీ వైఫల్యం మరోసారి తేటతెల్లమైంది. ఉన్నతస్థాయిలో చెప్పే మాటలు, చేసే ప్రకటనలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండదని స్పష్టమైంది. సిబ్బందిని సమీకరించాం, శిక్షణ ఇచ్చాం, పారదర్శకంగా పోలింగ్‌ జరుగుతుందని చెప్పినా, తుదకు అదే నిర్లక్ష్యం కనిపించింది. చివరి నిమిషంలో సిబ్బంది లేకపోవడంతో 17యేళ్ల బాలుడికి(మైనర్‌) పోలింగ్‌ విధులు అప్పగించిన అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక, గంటల వారీగా పోలింగ్‌ శాతం వివరాలు వెల్లడించడం నుంచి తుది పోలింగ్‌ శాతం ప్రకటించడం వరకు అంతా గందరగోళంగా మారింది. ప్రత్యేక పరిస్థితులు, ఉద్విగ్న వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం మరింత అధికమైంది. పోలింగ్‌ శాతం తగ్గుతోంది,  ఓటర్లు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదన్న ప్రచారం రోజంతా జరిగింది. దీంతో హైదరాబాద్‌కు ఏమైంది, ఓట్లు ఎందుకు వేయడం లేదన్న చర్చ మొదలైంది. బుధవారం ఈసీ విడుదల చేసిన తుది పోలింగ్‌ శాతం వివరాలను పరిశీలిస్తే 2016 ఎన్నికల కంటే ఎక్కువ ఓటింగ్‌ జరిగింది. సాధారణంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే గ్రేటర్‌ పోలింగ్‌ తక్కువగా ఉంటుంది అని ఒక వాదన. కానీ, రెండు దశాబ్దాలతో పోలిస్తే ప్రస్తుతం నమోదైన 46.55 శాతం అధికం కావడం గమనార్హం. 2016లో 45.29 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఇప్పుడు 1.26 శాతం పెరిగింది. మొదట్లో తక్కువగా ఉన్న పోలింగ్‌ మధ్యాహ్నం తర్వాత పెరిగిందా, లేక పోలింగ్‌ కేంద్రాల నుంచి కచ్చితమైన సమాచారం రాలేదా, అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు చెబుతున్నట్టు సాయం త్రం పోలింగ్‌ శాతం పెరిగిందన్నది నిజమనుకుంటే, సాయం త్రం 6 గంటల తర్వాత ఎక్కడా పెద్దగా బారులు తీరి ఓటర్లు కనిపించలేదు. మొదటి మూడు, నాలుగు గంటలపాటు.. గంటకు మూడు, నాలుగు శాతం పోలింగ్‌ మించలేదు. అదే సమయంలో చివరి రెండు గంటల్లో మాత్రం 20-25 శాతం వరకు నమోదైంది.? ఎక్కడా ఓటర్ల క్యూలు కనిపించకుండా ఇంత పోలింగ్‌ ఎలా పెరిగింది..? అన్న ప్రశ్నకు అధికారులు కచ్చితమైన సమాధానం చెప్పడం లేదు. ఈవీఎంల బదులు కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ ఎన్నికలను బ్యాలెట్‌ ద్వారా నిర్వహించారు. అయినా, అనూహ్యస్థాయిలో చివరి గంటల్లో పోలింగ్‌ ఎందుకు పెరిగిందన్నది చర్చనీయాంశంగా మారింది. 


రిజర్వు సిబ్బంది ఎక్కడ..

గ్రేటర్‌లోని 150 వార్డులకు 9,101 కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. ఒక్కో కేంద్రంలో నలుగురు చొప్పున మొత్తం 36,404 మంది పోలింగ్‌ సిబ్బంది అవసరం. 25 శాతం రిజర్వ్‌తో కలిపి 48 వేల మంది సిద్ధంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. పోలింగ్‌ ముందు రోజు డిస్ర్టిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌(డీఆర్‌సీ) కేంద్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రి తీసుకెళ్లే సమయంలో సిబ్బంది తక్కువ పడ్డారు. దీంతో అప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీలోని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఇతర సిబ్బందిని  డీఆర్‌సీ కేంద్రాలకు తరలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు సమీకరించిన రిజర్వ్‌ సిబ్బంది ఎక్కడున్నారు..? శిక్షణ ఇవ్వని అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని పోలింగ్‌ విధులకు ఎందుకు పంపించాల్సి వచ్చింది..? శిక్షణ, అవగాహన లేని వారిని  పోలింగ్‌ కేంద్రాలకు పంపించడం వల్లే గంటల వారీగా పోలింగ్‌ శాతాల విడుదలలో పొరపాట్లు జరగడంతోపాటు.. తుది వివరాల వెల్లడిలో తీవ్ర జాప్యమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు తీసుకోకుండా ఇతర విభాగాల వారిని వినియోగించారు. ఇది కూడా పోలింగ్‌ శాతం వివరాలు కచ్చితంగా రాకపోవడానికి కారణమంటున్నారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బందికి మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల ఆధారంగా పోలింగ్‌ శాతం ఎంత, అన్నది లెక్కించడం కూడా రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో రెయిన్‌బజార్‌, అమీర్‌పేట డివిజన్లలో ఉదయం నుంచే పోలింగ్‌ జరిగినా, ఒక శాతం కూడా ఓట్లు పడలేదన్న వివరాలు బయటకు వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐఎ్‌ససదన్‌లోని ఓ కేంద్రంలో 17 యేళ్ల బాలుడికి పోలింగ్‌ బాధ్యతలు అప్పగించడం వివాదస్పదమైంది. దీనిపై అక్కడి పార్టీల ఏజెంట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదంతా జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారుల నిర్లక్ష్యం వల్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్‌ సిబ్బంది సమీకరణ బాధ్యతలు అప్పగించిన నోడల్‌ అధికారి సీరియ్‌సగా పని చేయలేదని చెబుతున్నారు. ప్రతి ఎన్నికల్లో పోలింగ్‌ శాతానికి సంబంధించి పొరపాట్లు జరుగుతున్నా, అధికారులు ముందస్తు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. పైగా ‘మేం కాబట్టి ఈ మాత్రం వివరాలు వస్తున్నాయి. వేరే వాళ్లయితే అది కూడా కష్టమే. రాత్రంతా కష్టపడితే ఉదయం వరకు తుది పోలింగ్‌ శాతం ఇవ్వగలిగాం’ అని ఎన్నికల విభాగం అధికారులు కొందరు స్వీయ సర్టిఫికేషన్‌ ఇచ్చుకుంటుండడం గమనార్హం. 


Updated Date - 2020-12-03T05:46:51+05:30 IST