పదే పదే తిరుగుతున్నా పట్టించుకోరేం!

ABN , First Publish Date - 2022-08-09T06:02:56+05:30 IST

‘‘మా సమస్య ఇది సారూ.. పరిష్కారం చూపండని ఎన్నిసార్లు తిరగాలా!?. వచ్చినప్పుడల్లా అర్జీలు ఇస్తా ఉండాం. సార్లేమో వాటిపై సంతకాలు చేసి పంపుతున్నారు.

పదే పదే తిరుగుతున్నా  పట్టించుకోరేం!
కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

సమస్యలు పరిష్కరించాలని ఏకరువు

‘స్పందన’కు పోటెతుతున్న అర్జీదారులు

క్షేత్రస్థాయిలో స్పందించని యంత్రాంగం

‘ఆంధ్రజ్యోతి విజిట్‌’లో బాధితుల గగ్గోలు


 ‘‘మా సమస్య ఇది సారూ.. పరిష్కారం చూపండని ఎన్నిసార్లు తిరగాలా!?. వచ్చినప్పుడల్లా అర్జీలు ఇస్తా ఉండాం. సార్లేమో వాటిపై సంతకాలు చేసి పంపుతున్నారు. కానీ మా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇలాగైతే ఎలా!?’’ అర్జీదారుల ఆవేదన ఇది. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన ‘స్పందన’ కార్యక్రమం ఆశించినస్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు.  మండల స్థాయిలో అధికారులను కలిసినా వారు కనీసం సమాధానం ఇవ్వకపోవటంతో వందలాది మంది అర్జీదారులు ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు చేరుకొంటున్నారు. కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు తమ మొర వినిపించి, అర్జీలు సమర్పిస్తున్నారు. ఇక సమస్య పరిష్కారం అవుతుందని ఆశతో వెనుతిరుగుతున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. రోజులు కాదు.. వారాలు గడుస్తున్నా తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో తిరిగి కలెక్టరేట్‌కు చేరుకుని అర్జీలు ఇస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమాన్ని ఆంధ్రజ్యోతి విజిట్‌ చేసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో మాట్లాడగా తమగోడును వెల్లబొసుకున్నారు.

  - నెల్లూరు (హరనాథఫురం) 


ఇంటి స్థలం కాపాడాలని ఆరుసార్లు...

ఈయన పేరు పి.మాల్యాద్రి. బోగోలు మండలంలోని పాత బిట్రగుంట. తనకున్న ఇంటి స్థలాన్ని ఇతరులు ఆక్రమించారని, సమస్యను పరిష్కరించి తన స్థలాన్ని తనకు ఇప్పించాలని కోరుతూ కలెక్టరేట్‌లో ఆరుసార్లు వినతిపత్రం అందజేశారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవటంతో మళ్లీ వచ్చారు. 


భూ వివరాలు ఆన్‌లైన్‌ ఎక్కించాలని ఐదుసార్లు.. 

ఈయన పేరు శీలం నడిపి మాలకొండారెడ్డి, వరికుంటపాడు మండలం తూర్పు చెన్నంపల్లి. 1996లో ఈయన కొంతభూమి ఇచ్చారు. దానిని ఆన్‌లైన్‌లో  ఎక్కించాలని కోరుతూ కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమంలో ఐదుసార్లు అర్జీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆయన సమస్య పరిష్కారం కాలేదు. ఆరోసారి కూడా అర్జీ ఇచ్చేందుకు కాగితాలు చేతబట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చారు. 


భూ పరిహారం కోసం..

ఈయన పేరు రావూరు ఆనందరావు. దగదర్తి మండలంలోని కొత్తపల్లి కౌరుగుంట. 1978లో తనకు 96 ఎకరాల సీజేఎఫ్‌ఎస్‌ భూమి ఆయనకు ఇచ్చారు. అయితే, విమానాశ్రయం ఏర్పాటు కోసం ఆ భూమిని తీసుకున్నా ప్రత్నామ్నాయ భూమిని లేదా పరిహారం ఇవ్వలేదని వాపోతున్నాడు. తనకు న్యాయం చేయాలని ఇప్పటికి మూడు సార్లు కలెక్టరేట్‌లో అర్జీ అందజేశారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. 


పెన్షన్‌ కోసం మూడుసార్లు..

ఈమె పేరు నాగమణి. విడవలూరు మండలంలోని రామతీర్థం గ్రామవాసి. మూర్చరోగంతోపాటు ముఖం కాలిపోవటంతో పింఛను ఇప్పించాలని మండల అధికారులకు తెలిపినా ప్రయోజనం లేకపోవడంతో కలెక్టరేట్‌కు మూడుసార్లు వచ్చి అధికారులకు అర్జీ అందజేశారు. వచ్చిన ప్రతిసారీ పెన్షన్‌ వచ్చేలా చేస్తామని అధికారులు చెబుతున్నా అమలు కావడం లేదు. తనకు  పెన్షన్‌ మంజూరు చేయాలని నాగమణి కోరుతోంది.


స్థలం ఇచ్చారు.. లాక్కున్నారు 

ఈమె పేరు పర్వీన్‌. నెల్లూరులోని వెంకటేశ్వరపురం వాసి. ఈమెకు వైఎస్‌ఆర్‌ నగర్‌లో ఇంటి స్థలం ఇచ్చారు.  ఆ స్థలంలో ఇల్లు కట్టుకోకపోవడంతో మరొకరు ఆక్రమించారు. ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోలేదు కనుక మరొకరికి ఇచ్చామని చెప్పారు. తన స్థలం తనకే ఇప్పించాలని కలెక్టర్‌ను కోరుతూ రెండు సార్లు అర్జీ ఇచ్చారు. మూడోసారి కలెక్టరేట్‌కు పర్వీన్‌ వచ్చారు. 


భూ వివరాలు ఎక్కించాలని..

ఈమె పేరు బి. భానుమతి. దుత్తలూరు మండలంలోని కొత్తపేట రెవెన్యూ వెంగళపాలెం వాసి. తన 15 ఎకరాల భూమిని తన కుమార్తె తోయజ పేరిట రాశారు. ఆ వివరాలు ఆన్‌లైన్‌లో ఎక్కించాలని రెండుసార్లు కలెక్టరేట్‌కు వచ్చిన అధికారులకు అర్జీ అందజేశారు. కానీ ఇప్పటికీ ఆమె సమస్య పరిష్కారం కాలేదు.


ఇసుక దిబ్బ ఇచ్చి మాగాణి చూపారు!

దమ్ము సురేంద్రకుమార్‌ది సంగం మండలం వెంగారెడ్డి పాళెం. ఈయనకు 3.5 ఎకరాల భూమి ఇచ్చారు. అది ఇసుక దిబ్బ. పట్టా, పాస్‌బుక్‌లలో మాత్రం మెట్ట అని ఉంది. దానిని సరిచేయాలని కోరుతూ ఇప్పటికి రెండుసార్లు కలెక్టరేట్‌లో అర్జీ అందజేశారు. 


వారసత్వ భూమికోసం..

మాచెర్ల చిన్నయ్యది మర్రిపాడు మండలం గోరాజుపల్లె.  తనతోపాటు తన అన్నదమ్ములకు 8 ఎకరాల భూమిని పెద్దలు ఇచ్చారని, ఆ భూమి విషయంలో తగాదాలు ఉండటంతో పరిష్కరించి, ఆ భూమిని సమభాగాలుగా ఇప్పించాలని రెండుసార్లు కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవటంతో మళ్లీ వచ్చారు. 

 

అర్జీలు మళ్లీ మళ్లీ రాకుండా చూడండి! 

‘స్పందన’లో అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

నెల్లూరు (హరనాథపురం) : వివిధ సమస్యలపై స్పందనకు వచ్చే అర్జీలు మళ్లీ మళ్లీ రాకుండా చూడాలని కలెక్టర చక్రధర్‌భాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. పలు ప్రభుత్వ శాఖల నుంచి అర్జీలు తిరిగి వస్తున్నాయని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలని సూచించారు. వచ్చిన అర్జీలను నిర్ధేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇకపై గడువు దాటిన అర్జీలు పెండింగ్‌లో ఉంటే సహించేదిలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేసీ కూర్మనాథ్‌, డీఆర్వో వెంకటనారాయణమ్మ, డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


పోలీస్‌ స్పందన వెల వెల

నెల్లూరురూరల్‌ :  జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనకు వినతులు కరువయ్యాయి. రొట్టెల పండుగ విధుల్లోకి పోలీసు అధికారులు వెళ్లిపోవడంతో కార్యాలయం వెలవెల పోయింది. వచ్చిన అతికొద్ది మంది నుంచి వినతులు స్వీకరించిన ఫిర్యాదుల విభాగం సిబ్బంది పరిశీలిస్తామని  చెప్పి పంపారు. మధ్యాహ్నం 12 గంటలపైన ఎస్పీ విజయరావు కార్యాలయానికి వచ్చినా అర్జీదారులు లేకపోవడం గమనార్హం. 



Updated Date - 2022-08-09T06:02:56+05:30 IST