పలకరిస్తూ.. పరిశీలిస్తూ

ABN , First Publish Date - 2022-01-01T05:43:01+05:30 IST

నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన శుక్రవారం ఉత్సాహంగా సాగింది. రోడ్డు మార్గంలో వచ్చిన ఆయనకు తొలుత 5వేల బైకులతో కార్యకర్తలు ఎంజీయూ యూనివర్సిటీ నుంచి పట్టణం వరకు ర్యాలీ నిర్వహించి ఘనస్వాగతం పలికారు.

పలకరిస్తూ.. పరిశీలిస్తూ
నల్లగొండ పట్టణాన్ని పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌

నల్లగొండలో ఉత్సాహంగా సాగిన మంత్రి కేటీఆర్‌ పర్యటన

ఐటీ హబ్‌, వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్‌కు శంకుస్థాపన

ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ ప్రారంభం

పట్టణ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష

ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ కుటుంబసభ్యులకు పరామర్శ

మంత్రికి ఘనస్వాగతం పలికిన పార్టీ నేతలు



నల్లగొండ, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన శుక్రవారం ఉత్సాహంగా సాగింది. రోడ్డు మార్గంలో వచ్చిన ఆయనకు తొలుత 5వేల బైకులతో కార్యకర్తలు ఎంజీయూ యూనివర్సిటీ నుంచి  పట్టణం వరకు ర్యాలీ నిర్వహించి ఘనస్వాగతం పలికారు. అనంతరం పాలిటెక్నిక్‌ కళాశాలలో ఐటీ హబ్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేసి అక్కడే ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ భవనాలను ప్రారంభించారు. ఆ తరువాత బీట్‌ మార్కెట్‌కు చేరుకొని అక్కడ వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. ఇక్కడి నుంచి గడియారం సెంటర్‌ వరకు కాలినడకన వెళ్తూ దారి వెంట ప్రజలను పలకరిస్తూ పట్టణాన్ని పరిశీలిస్తూ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు వివరించారు. గడియారం సెంటర్‌లో ఓ పాన్‌ షాప్‌నకు వెళ్లి పాన్‌ కట్టించుకొని పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అక్కడే ఉన్న యాచకులను పలకరించి పెన్షన్‌ వస్తుందా అని ప్రశ్నించారు. అనంతరం దేవరకొండ రోడ్డులోని జైల్‌ఖానా వరకు వెళ్లి ఓ వాహనదారుడిని పలకరించి పట్టణానికి ఏం పనులు అవసరమో తెలుసుకున్నారు. సాగర్‌ రోడ్డులోని వైస్‌ఆర్‌ విగ్రహం వరకు వెళ్లి పట్టణం మొత్తాన్ని పరిశీలించారు. అనంతరం ఓ ఫంక్షన్‌ హాల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత నేరుగా ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ ఇంటికి చేరుకొని ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. ఉదయం 11.20గంటలకు చేరుకున్న మంత్రి కేటీఆర్‌ పర్యటన సాయంత్రం 6.50గంటల వరకు సాగింది. కాగా ఆయన రాక పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.


నల్లగొండ ముఖ చిత్రాన్ని మారుస్తాం

నల్లగొండ, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వచ్చే జూన్‌ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలోగా, అంటే ఆరు నెలల్లో నల్లగొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు స్పష్టమైన మార్పు కనిపించాలని, ఏడాదిలో నల్లగొండ ముఖ చిత్రాన్ని పూర్తిగా మారుస్తామని పురపాలక, పట్టణాభివద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నల్లగొండ పర్యటనలో భాగంగా మంత్రి జగదీ్‌షరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు గొంతెమ్మ కోరికలు ఉండవని, తాగునీరు, విద్యుత్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తే చాలని వారు భావిస్తారని అన్నారు. నిధుల సమస్యను తనకు వదిలేయాలని, ప్రతీ రెండు నెలలకు ఇక్కడికి వచ్చి అభివృద్ధి పనులను సమీక్షిస్తానన్నారు. మునిసిపల్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ అధికారులు సమన్వయంతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. పట్టణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో స్వయంగా అడగితే మంచినీరు రెండు రోజులకు ఒకసారి వస్తున్నాయని, విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని చెప్పారన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని గానీ రోడ్ల పరిస్థితి బాగాలేదని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, పరిశ్రమలు ఏర్పాటుచేయాలని కోరారరన్నారు. ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్ల కోసం, రైతు బజార్‌ కోసం, అర్బన్‌ లంగ్‌స్పేస్‌ కోసం రెండు చోట్ల చొప్పున స్థలాలు ఎంపిక చేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో మియావాకి విధానంలో అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల విస్తరణకు రోడ్డు భవనాల శాఖ ఇంజనీర్లు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలన్నారు. పట్టణంలో ఆరు ముఖ్యమైన జంక్షన్లను ఫుట్‌పాత్‌లు, సర్వీస్‌ రోడ్లతో విస్తరించాలన్నారు. అంబేడ్కర్‌, జగ్జీవన్‌ రామ్‌ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు వెడల్పు చేసే చోట చెట్లను నరకవద్దని, వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వైకుంఠధామం, ఖబరస్థాన్‌, సిమెట్రీలను సుందరీకరించాలని సూచించారు. ఉదయ సముద్రం సుందరీకరణ, అర్బన్‌ పార్కులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మునిసిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. 


రూ.100కోట్లతో పనులు

టీయూఎ్‌పఐడీసీ ద్వారా నల్లగొండకు రూ.100కోట్లు మంజూరు చేశామన్నారు. తాను ప్రతీ రెండు నెలలకు ఒకసారి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ నెలకు ఒకసారి, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ 15 రోజులకు ఒకసారి వచ్చి అభివృద్ధి పనులు పరిశీలిస్తామన్నారు. నల్లగొండ చుట్టూ 50ఎకరాల్లో నీలగిరి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ ఏర్పాటు చేసి టౌన్‌షి్‌ప ఏర్పాటు చేయాలని, తద్వారా మునిసిపాలిటీకి ఆదాయం వస్తుందన్నారు. నల్లగొండ మునిసిపాలిటీ ఒక రోల్‌ మెడల్‌గా మిగతా వాటికి ఆదర్శంగా ఉండాలన్నదే సీఎం కోరిక అన్నారు. ప్రతిరోజు ఇంటింటికీ మంచినీటి సరఫరాకు ఏం చేయాలో మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి, అధికారులతో కలిసి పరిశీలించాలని ఆదేశించారు. నల్లగొండ పట్టణంలో రోడ్లు వెడల్పు సందర్భంగా వీధి వ్యాపారులను ఆదుకోవాలని, వారి కోసం వెండింగ్‌ జోన్లు ఏర్పాటు చేయాలన్నారు. మునిసిపల్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌శాఖ అధికారులు ప్రతి వారం కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశమవ్వాలని సూచించారు. శాంతి భద్రత చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు, కమాండ్‌ కంట్రోల్‌, సిగ్నలింగ్‌ వ్యవస్థను పటిష్ఠంగా ఏర్పాటుచేయాలన్నారు. జిల్లాలోని మిగతా మునిసిపాలిటీలకు పట్టణ ప్రగతి కింద రూ.72.72కోట్లు కేటాయించామన్నారు. ప్రజలు కోరుకునేది చేయాలి కానీ ఎమ్మెల్యేలు, మునిసిపల్‌ చైర్మన్లు నేల విడిచి సాము చేయవద్దనే ముఖ్యమంత్రి ఆలోచనలు ప్రతి ఫలించాలన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ టౌన్‌హాల్‌, నాలుగు వరుసల రోడ్డు, ఫుట్‌పాత్‌లు, జంక్షన్‌ సుందరీకరణకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, రవీంద్రరావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య భాస్కర్‌రావు, రవీంద్రకుమార్‌, నోముల భగత్‌, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ, కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ రమారాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.


ఒమైక్రాన్‌ నిబంధనలు తూచ్‌

రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసుల పెరుగుదలను అదుపులోకి తెచ్చేందుకు హైకోర్టు సూచనలతో ర్యాలీలు, సభలకు అనుమతులను నిషేధిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు యత్నించిన ప్రతిపక్షాలను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారు. అయితే శుక్రవారం నల్లగొండలో మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, జగదీ్‌షరెడి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తన నియోజకవర్గానికి విచ్చేస్తుండటంతో స్థాని క ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నల్లగొండ పట్టణ శివారు నుంచి 5వేల మందితో, నకిరేకల్‌ నియోజకవర్గం మీదుగా వస్తుండటంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో చిట్యాల నుంచి 3వేల మందితో బైక్‌ ర్యాలీలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాస్కులు సైతం ధరించలేదు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శ లు వెల్లువెత్తాయి. ర్యాలీలో మాస్కులు లేని వారిని లెక్కించి రూ.1000 చొప్పున నాయకుల నుంచి జరిమానా వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు.


ముందస్తు అరెస్టులు.. నిరసనలు

మంత్రి కేటీఆర్‌ పర్యటనను అడ్డుకుంటారన్న సమాచారంతో బీజేపీ, కాంగ్రెస్‌ నేతలను గురువారం అర్ధరాత్రి నుంచే జిల్లా వ్యాప్తంగా అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారు. జిల్లా కేంద్రంలో ని రామగిరిలో టీతాగుతున్న టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్‌ నేతను, ఏబీవీపీ కార్యాలయం, బీజేపీ కార్యాలయంలో ఉన్న ఆయా సంఘాల నాయకులు పొట్టెపాక నాగరాజుతో పాటు సు మారు 10 మందిని నల్లగొండ టూటౌన్‌ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్‌కు విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. నల్లగొండ వస్తున్న కేటీఆర్‌ను చిట్యాల మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకులు ఆ సంఘం జెండాలతో కాన్వాయ్‌కు ఎదురుగా వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న సమయంలో కూడా స్థానిక వీటీ కాలనీ వద్ద ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ ఆవుల సంపత్‌ ఆధ్వర్యం లో పలువురు నాయకులు సంఘం జెండాలను చేతపట్టి కాన్వాయికి ఎదురుగా పరిగెత్తారు. కాన్వాయ్‌ ముందు ఎస్కార్ట్‌ నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యార్థి నాయకులను కాన్వాయిని అడ్డుకోకుండా పక్కకు నెట్టివేశారు.


 నూతన సంవత్సరంలో అందరికి మంచి జరగాలి : మంత్రి జగదీ్‌షరెడ్డి 

నల్లగొండ : 2022 నూతన సంవత్సరంలో అందరికి మంచి జరగాలని, అందరూ బాగుండాలని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో 2021 సంవత్సరంలో కరోనా ఇబ్బందులను అధిగమించి రాష్ట్రం అద్భుతంగా పురోగమించిందని అన్ని రంగాల్లో దేశానికే మార్గదర్శం చేసిందన్నారు. 


ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి : మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి 

నల్లగొండ : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నూతన సంవత్స ర శుభాకాంక్షలు తెలిపారు. 2022 సంవత్సరంలో ప్రజలు అంతా సుఖసంతోషాలతో ఉండేలా భగవంతుడు ఆశీర్వదించాలని అన్నా రు. కరోనా వైరస్‌ పూర్తి గా నశించాలని ఆకాంక్షించారు. 2021లో కరోనాతో ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుంచుకొని నూతన సంవత్సర వేడుకలను కరోనా జాగ్రత్తలతో పాటించాలని సూచించారు. 


Updated Date - 2022-01-01T05:43:01+05:30 IST