Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఢిల్లీ పెద్దలనూ అదే పదంతో పలకరించండి

చొక్కా నలగకుండా బయటకొస్తే క్షమాపణ చెబుతాం: సజ్జల 

అమరావతి(ఆంధ్రజ్యోతి)/గుంటూరు, అక్టోబరు 22: ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సహా ఇతర పెద్దలను పట్టాభి చేసిన పద ప్రయోగంతో పలుకరించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చొక్కా నలగకుండా బయటకు రాగలిగితే ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెబుతామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. లేదంటే టీడీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్య తప్పని అంగీకరించి క్షమాపణ కోరాలన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ పట్టాభి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని మహిళలు, యువత చంద్రబాబును నిలదీయాలన్నారు. చంద్రబాబు హయంలో గంజాయి వేళ్లునుకుందని, జగన్‌ హయాంలోనే ధ్వంసం చేయడం మొదలైందన్నారు. చంద్రబాబు చేసిన 36గంటల దీక్ష ఒక ప్రహసనమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సి ఉన్నందున టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలను సజ్జల కోరారు. చంద్రబాబును ఇలాగే వదిలేస్తే రాష్ట్రానికి గుదిబండలా మారిపోతాడన్నారు. 


చంద్రబాబు రాష్ట్రపతిని కలిస్తే, తామూ కలుస్తామన్నారు. పెద్దపెద్ద రౌడీలే కనుమరుగయ్యారనీ టీడీపీ నేతలెంతని సజ్జల ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టించి అర్జెంట్‌గా రాష్ట్రపతి పాలన విధించాలనేదే టీడీపీ కుట్ర రాజకీయమని గుంటూరులో వైసీపీ నేతలు తలపెట్టిన జనాగ్రహ దీక్షా శిబిరంలో ఆయన ఆరోపించారు. సీఎం జగన్‌ పాలనను తట్టుకోలేక చంద్రబాబు ఏదో ఒక అడ్డంకులు, అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే పట్టాభితో దుర్భాషలాడించి అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. ఆ బూతు మాట వింటే ఎవరికైనా వెంటనే చెప్పుతో కొట్టాలనిస్తుందని, అలా కొట్టకపోతే వాడు మనిషే కాదని, చీము నెత్తురు లేనట్టేనని సజ్జల వ్యాఖ్యానించారు.


ఇలా గొడవలు జరగ్గానే చంద్రబాబుకు రాష్ట్రపతి పాలన గుర్తొస్తుందని, శాంతిభద్రతలకు, రాష్ట్రపతి పాలనకు సంబంధమేంటని ప్రశ్నించారు. ఈయన కోరుకున్నప్పుడల్లా రాష్ట్రపతి పాలన విధిస్తారా అని ప్రశ్నించారు. సీఎం అంటే రాష్ట్రంలో రాజ్యాంగాధిపతి అని సజ్జల పునరుద్ఘాటించారు. అటువంటి సీఎంను దుర్భాషలాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బోషడికే అన్న పదానికి ‘బాగున్నారా’ అని అర్థం వస్తుందని చెబుతుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇలా బూతులు తిట్టే పార్టీల గుర్తింపు రద్దు చేయాలన్నారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ను కలిసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు చేయనున్నారని సజ్జల చెప్పారు. 

Advertisement
Advertisement