Abn logo
Jul 1 2020 @ 05:13AM

బందోబస్తు మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సర్వే

కల్లూరు/ తల్లాడ, జూన్‌ 30: ఖమ్మం-దేవరపల్లి వరకు చేపట్టనున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు సంబంధించి భూసేకరణ కార్యక్రమం కల్లూరు మండలం ఓబులరావ్‌బంజర్‌, ముచ్చవరం గ్రామాల్లో రెండోరోజైన మంగళవారం పోలీస్‌ పహారా మధ్య కొనసాగింది. కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ పర్యవేక్షణలో ఈ భూసేకరణ సర్వే కార్యక్రమం జరిగింది. బాధిత రైతులు ఆప్రదేశానికి వచ్చి సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేశారు.


దీంతో రెవెన్యూ అధికారులు స్పందించి మీరు భూములకు సర్వేకు సహకరిస్తేనే ప్రభుత్వం తరపున పరిహారం అందుతుందని అందుకు నిరాకరిస్తే ఇబ్బందులుపడాల్సి వస్తుందని హెచ్చరించటంతో తప్పని పరిస్థితుల్లో బాధిత రైతులు సర్వేకు సహకరించారు. సుమారు 50మందికిపైగా పోలీసులు తల్లాడ, కల్లూరు మండలాల సరిహద్దులో మొహరించటంతో సర్వేను అడ్డుకొనేందుకు రైతులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. తహసీల్దార్‌ మంగీలాల్‌, ఆర్‌ఐ స్టాలిన్‌, ఉమామహేశ్వరరావు, వీఆర్వోలు, సర్వేయర్లు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


తల్లాడ మండలం లక్ష్మీపురం గ్రామం నుంచి నేషనల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూ సర్వే మంగళవారం భారీ పోలీస్‌ బందోబస్తు నడుమ చేపట్టారు. వైరా, కల్లూరు ఏసీపీలు సత్యనారాయణ, వెంకటే్‌ష పర్యవేక్షణలో 50మంది పోలీస్‌ సిబ్బందితో భూసర్వే కోసం భారీ బందోబస్తు నిర్వహించారు. సర్వే కార్యక్రమాన్ని కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, తల్లాడ తహసీల్దార్‌ గంటా శ్రీలతల ఆధ్వర్యంలో రెవెన్యూ సర్వేయర్లు సర్వే నిర్వహించారు. బందోబస్తులో వైరా సీఐ జె.వసంతకుమార్‌, తల్లాడ, వైరా, కల్లూరు ఎస్‌ఐలు తిరుపతిరెడ్డి, సురేష్‌, రఫీ పాల్గొన్నారు. భారీ బందోబస్తుతో రైతులు నిరసన తెలిపేందుకు ముందుకు రాకపోవడంతో ప్రశాంతంగా సర్వే కొనసాగింది.

Advertisement
Advertisement