హరితహారం లక్ష్యం.. 47 లక్షల మొక్కలు

ABN , First Publish Date - 2022-05-27T05:32:42+05:30 IST

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 47 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధేశించామాని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు.

హరితహారం లక్ష్యం.. 47 లక్షల మొక్కలు

 - కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, మే 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 47 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధేశించామాని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో డీఆర్డీఏ, డీఎఫ్‌వో, జిల్లా ఇరిగేషన్‌శాఖ అధికారులతో హరితహారంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 47 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చెరువు పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని గుర్తించి మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతి మండలంలో రెండు చొప్పున జిల్లాలో 30 చెరువుల వద్ద స్థలాలను గుర్తించి బహుళస్థాయి మొక్కలను నాటేలా ఇరిగేషన్‌ అధికారులు, మండల స్థాయి హరితహారం కమిటీ ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించాలని, రోడ్ల వెంట బహుళస్థాయి మొక్కలను నాటాలని, ఎల్‌ఎండీతోపాటు జిల్లాలోని ఎస్సారెస్పీ కెనాల్‌ వెంట మొక్కలను నాటించేలా చూడాలని తెలిపారు. కెనాల్‌ వెంట ఉన్న సర్కార్‌ తుమ్మలను తొలగించాలన్నారు. క్రీడలకు ప్రాంగణాల కోసం ఎకరం స్థలాన్ని గుర్తించాలని సూచించారు. స్థలాల గుర్తింపులో ఇబ్బందులు, సమస్యలు ఎదురైనట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనాల్లో విరివిగా మొక్కలను నాటేలా చూడాలని, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటించి మోడల్‌ బృహత్‌ పల్లె ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, జిల్లా అటవీశాఖ అధికారి సీహెచ్‌ బాలామణి, జిల్లా ఇరిగేషన్‌ అధికారి అస్మాత్‌ అలీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలతారెడ్డి, ఈఈ నాగభూషణం పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T05:32:42+05:30 IST