మేయర్‌ X కమిషనర్‌

ABN , First Publish Date - 2021-07-23T05:58:21+05:30 IST

మహా విశాఖ నగర పాలక..

మేయర్‌ X కమిషనర్‌

  • మేయర్‌, కమిషనర్‌ మధ్య గ్రీన్‌బెల్ట్‌ చిచ్చు
  • మేయర్‌ ఇంటి వద్ద పార్కింగ్‌ కోసం గ్రీన్‌బెల్ట్‌ ధ్వంసం
  • కమిషనర్‌ వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారంటున్న మేయర్‌ భర్త 
  • సర్వీస్‌ రోడ్డు అభివృద్ధికి మాత్రమే అనుమతిచ్చానంటున్న కమిషనర్‌
  • ఇంజనీరింగ్‌ అధికారులపై విచారణకు ఆదేశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, కమిషనర్‌ జి.సృజన మధ్య ఇప్పటికే నెలకొని వున్న విభేదాలకు గ్రీన్‌బెల్ట్‌ ధ్వంసం అంశం మరింత ఆజ్యం పోసింది. పెదగదిలిలోని మేయర్‌ ఇంటి వద్ద కారు పార్కింగ్‌ కోసం బుధవారం జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు గ్రీన్‌బెల్ట్‌లో చెట్లను తొలగించడాన్ని కమిషనర్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఆ పనులను తక్షణం నిలిపివేయాలని ఆదేశించడంతోపాటు విచారణ జరిపి నివేదిక అందించాలని చీఫ్‌ ఇంజనీర్‌ రవికృష్ణరాజును ఆదేశించారు.


జీవీఎంసీ మేయర్‌ హరివెంకటకుమారికి, కమిషనర్‌ సృజనకు మధ్య మొదటి నుంచి పెద్ద సఖ్యత లేదు. ఛాంబర్‌ కేటాయింపు నుంచి కొవిడ్‌ సమయంలో మాంసం విక్రయాలపై నిషేధం, ఆస్తి పన్ను అంశం కౌన్సిల్‌ ఎజెండాలో చేర్చడం, మురికివాడల అభివృద్ధి ప్లాన్‌పై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం వంటి అంశాలపై ఇరువురి మధ్య విభేదాలు ఉన్నాయి. కొన్నాళ్లపాటు ఇద్దరూ వేర్వేరుగా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురితం కావడంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో కొన్నాళ్లుగా ఇద్దరూ కలిసే పర్యటిస్తున్నారు.


అయితే తాజాగా మేయర్‌ ఇంటి వద్ద కారు పార్కింగ్‌ వ్యవహారం ఇద్దరి నడుమ మరోమారు దూరం పెంచేలా ఉంది. పెదగదిలిలో నివాసం వుంటున్న మేయర్‌ హరివెంకటకుమారి తన నివాసాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మేయర్‌ నివాసానికి సమీపంలో బీఆర్‌టీఎస్‌ రోడ్డుకు, సర్వీస్‌ రోడ్డుకు మధ్యలో సుమారు పది మీటర్లు వెడల్పున గ్రీన్‌బెల్ట్‌ ఉంది. అయితే ఆ ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్‌కు కేటాయించాలని మేయర్‌ కుటుంబం కోరిందే తడవుగా...జీవీఎంసీ అధికారులు వెనుకాముందూ ఆలోచించకుండా బుధవారం 150 మీటర్లు పొడవున గ్రీన్‌బెల్ట్‌ను జేసీబీలతో తవ్వేసి లెవెల్‌ చేసేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం ఎన్నో ఏళ్లుగా పెంచిన పచ్చని చెట్లను నరికేస్తుండడం చూసిన స్థానికులు కొందరు అదంతా వీడియోలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఈ విషయమై మేయర్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆమె భర్త శ్రీనివాసరావు స్పందించారు.


గ్రీన్‌బెల్ట్‌ వద్ద కారు పార్కింగ్‌ ఏర్పాటుకు జీవీఎంసీ కమిషనర్‌ సృజన స్వయంగా ఏప్రిల్‌ 20న రూ.20 లక్షలతో వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చినట్టు చెప్పారు. కమిషనర్‌ను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా సర్వీస్‌ రోడ్డులో పార్కింగ్‌కు అనుగుణంగా పనులు చేసేందుకు మాత్రమే తాను అనుమతి ఇచ్చానని, గ్రీన్‌బెల్ట్‌ను ధ్వంసం చేయడానికి నిబంధనలు అంగీకరించవన్నారు. తన అనుమతిని వక్రీకరించి గ్రీన్‌బెల్ట్‌ను ధ్వంసం చేసిన అధికారులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఈని ఆదేశించినట్టు చెప్పారు. మేయర్‌, కమిషనర్‌ మధ్య ప్రస్తుతం చిచ్చు రేపిన గ్రీన్‌బెల్ట్‌ వివాదానికి ముగింపు ఎలా వుంటుందనే ఆసక్తి నగరవాసులతోపాటు అధికార వర్గాల్లోనూ నెలకొంది.

Updated Date - 2021-07-23T05:58:21+05:30 IST